WT20 WC: సెమీస్‌లో రనౌట్‌.. గెలుపు ముంగిట భారత్‌ బోల్తా

భారత అమ్మాయిలకు నిరాశ! ఫైనల్‌ కల చెదిరింది!అదరగొట్టి, ఆశలు రేపిన హర్మన్‌సేన ఆఖర్లో తడబడి మహిళల టీ20 ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. ఫైనల్లో ఆస్ట్రేలియా.

Updated : 24 Feb 2023 06:49 IST

హర్మన్‌, జెమీమా పోరాటం వృథా
ఫైనల్లో ఆస్ట్రేలియా
మహిళల టీ20 ప్రపంచకప్‌

భారత అమ్మాయిలకు నిరాశ! ఫైనల్‌ కల చెదిరింది!

అదరగొట్టి, ఆశలు రేపిన హర్మన్‌సేన ఆఖర్లో తడబడి మహిళల టీ20 ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. ఫైనల్లో ఆస్ట్రేలియా.

ఎంత అద్భుతమైన అవకాశం చేజారిందో! సెమీస్‌లో లక్ష్యం పెద్దదే అయినా ధాటిగా ఆడి,  నెగ్గాలంటే 33 బంతుల్లో 41 పరుగులు చేయాల్సిన స్థితిలో నిలిచింది భారత్‌. పైగా ధాటిగా ఆడుతున్న కెప్టెన్‌ హర్మన్‌, దూకుడుగా ఆడగల రిచా ఘోష్‌ క్రీజులో ఉన్నారు. భారతే స్పష్టమైన ఫేవరెట్‌గా కనిపించింది. కానీ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతూ గెలుపు ముంగిట బోల్తా కొట్టింది. చేజేతులా మ్యాచ్‌ను కోల్పోయింది.

అత్యంత తేలికైన పరుగు తీసే ప్రయత్నంలో హర్మన్‌ప్రీత్‌ చిత్రంగా రనౌట్‌ కావడం మ్యాచ్‌ గమనాన్నే మార్చేసింది. ఆయాచితంగా దక్కిన వికెట్‌తో ఉత్సాహం పెరిగిన ఆసీస్‌.. అనుభవాన్నంతా ఉపయోగించి భారత్‌కు కళ్లెం వేసింది. పేలవ ఫీల్డింగ్‌ కూడా మ్యాచ్‌లో భారత్‌ను దెబ్బతీసింది.

హిళల టీ20 ప్రపంచకప్‌ నుంచి భారత జట్టు నిష్క్రమించింది. గురువారం ఆసక్తికరంగా సాగిన సెమీఫైనల్లో 5 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. బేత్‌ మూనీ (54; 37 బంతుల్లో 7×4, 1×6), లానింగ్‌ (49 నాటౌట్‌; 34 బంతుల్లో 4×4, 2×6), ఆష్లీ గార్డ్‌నర్‌ (31; 18 బంతుల్లో 5×4) మెరవడంతో మొదట ఆస్ట్రేలియా 4 వికెట్లకు 172 పరుగులు సాధించింది. ఛేదనలో భారత్‌ ఊరించి ఉస్సూరుమనిపించింది. హర్మన్‌ప్రీత్‌ (52; 34 బంతుల్లో 6×4, 1×6), జెమీమా రోడ్రిగ్స్‌ (43; 24 బంతుల్లో 6×4) అదరగొట్టినా.. గెలుపు ముంగిట భారత్‌ తడబడింది. మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటూ 8 వికెట్లకు 167 పరుగులే చేయగలిగింది. డార్సీ బ్రౌన్‌ (2/18), గార్డ్‌నర్‌ (2/37) భారత్‌ను దెబ్బతీశారు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన ఆష్లీ గార్డ్‌నర్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

తడబడి నిలబడి: 28/3. కఠినమైన లక్ష్య ఛేదనలో నాలుగో ఓవర్లో టీమ్‌ఇండియా పరిస్థితిది. సూపర్‌స్టార్‌ ఓపెనర్లు స్మృతి మంధాన (2), షెఫాలి వర్మ (9)లు ఇద్దరితో పాటు యాస్తిక (4) వెనుదిరిగింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాపై, అంత పెద్ద లక్ష్య ఛేదనలో.. ఇలాంటి ఆరంభంతో గెలవడం కష్టమే అనిపించింది. కానీ అదిరే బ్యాటింగ్‌తో జెమీమా, హర్మన్‌ప్రీత్‌ జట్టును బలంగా పోటీలోకి తెచ్చారు. దూకుడైన బ్యాటింగ్‌తో 69 పరుగులు జోడించి భారత్‌లో ఆశలు రేపారు. ఆటను రసవత్తరగా మార్చేశారు.

ఆ ఇద్దరు అదరహో..: మూడు వికెట్లు తీయడంతో మ్యాచ్‌పై పట్టుబిగించినట్లేనని ఆసీస్‌ భావించి ఉంటుంది. కానీ జట్టు కష్టాల్లో ఉన్నా జెమీమా, హర్మన్‌ ఏమ్రాతం రక్షాణాత్మకంగా ఆడలేదు. ఎదురుదాడికి దిగి స్కోరు బోర్డును పరుగులు పెటించారు. స్మృతి ఔట్‌తో క్రీజులోకి వచ్చి, ఎదుర్కొన్న తొలి రెండు బంతులను కవర్‌, స్క్వేర్‌ లెగ్‌ మీదుగా బౌండరీకి తరలించి ఉద్దేశాన్ని చాటిన జెమీమా.. హర్మన్‌ వచ్చాక జోరు కొనసాగించింది. యాస్తిక నిష్క్రమణతో వచ్చిన హర్మన్‌.. తొలి బంతికే కవర్స్‌లో ఫోర్‌ సాధించి ఆకట్టుకుంది. ఆమె జొనాసెన్‌ బౌలింగ్‌లో కళ్లు చెదిరే సిక్స్‌ కూడా దంచింది. హర్మన్‌, జెమీమా ధాటైన బ్యాటింగ్‌ ఫలితంగా భారత్‌ 10 ఓవర్లలో 93/3తో బలమైన స్థితిలో నిలిచింది. తర్వాతి ఓవర్లోనే జెమీమా ఔటయ్యాక స్కోరు వేగం తగ్గింది. రిచా ఘోష్‌ వేగంగా ఆడలేకపోయింది. అయితే హర్మన్‌ తిరిగి జోరందుకోవడంతో 13 ఓవర్లలో 111/4తో ఉన్న టీమ్‌ఇండియా.. 14.3 ఓవర్లలో 132/4తో తిరుగులేని స్థితిలో నిలిచింది. భారత్‌దే స్పష్టంగా పైచేయి. 33 బంతుల్లో 41 పరుగులు చేయాల్సిన స్థితిలో ఆ జట్టు విజయం దిశగా ఉరకలేసింది. కానీ ఒక్క రనౌట్‌తో భారత్‌ ఆశలు గల్లంతయ్యాయి. అనుకోకుండా దక్కిన వికెట్‌తో కంగారు జట్టు విజయాన్ని లాగేసుకుంది.

అలా చేజారింది..: హర్మన్‌ ఔట్‌ కావడంతో వచ్చిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకున్న ఆసీస్‌ తర్వాతి బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చి పైచేయి సాధించింది. ధాటిగా ఆడలేకపోయిన రిచా (17 బంతుల్లో 14) 16వ ఓవర్లో ఔటైంది. అప్పటికీ లక్ష్యం భారత్‌కు అందుబాటులోనే ఉంది. చివరి నాలుగు ఓవర్లలో 38 పరుగులు చేయాల్సిన పరిస్థితి. కానీ ఆసీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో దీప్తి శర్మ (20 నాటౌట్‌; 17 బంతుల్లో 2×4), స్నేహ్‌ రాణా (11; 10 బంతుల్లో 1×4) ధాటిగా ఆడలేకపోయారు. ఆఖరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సిరాగా.. భారత్‌ 10 పరుగులే చేసింది. చివరి అయిదు ఓవర్లలో భారత్‌కు మూడు బౌండరీలే వచ్చాయి.

మెరిసిన లానింగ్‌, మూనీ: అంతకుముందు భారత బౌలర్లు చాలా వరకు కట్టుదిట్టంగానే బౌలింగ్‌  చేసినా.. ఆఖర్లో జోరు పెంచిన ఆసీస్‌ గట్టి లక్ష్యాన్నే నిర్దేశించగలిగింది. పేలవ ఫీల్డింగ్‌ను ఆ జట్టు సొమ్ము చేసుకుంది. భారత బౌలర్లకు ఫీల్డర్లు సహకరించి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదే. ఆసీస్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోగా.. ఇన్నింగ్స్‌ సగం వరకు ఆట భారత్‌ నియంత్రణలోనే ఉంది. బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. దీప్తి, రేణుక ఆసీస్‌ ఓపెనర్లు మూనీ, అలీసా హీలీలను స్వేచ్ఛగా బ్యాట్‌ ఝుళిపించనివ్వలేదు. వికెట్‌ పడకున్నా.. అయిదు ఓవర్లకు ఆసీస్‌ 31 పరుగులే చేసింది. అయితే దీప్తి బౌలింగ్‌లో సిక్స్‌తో మూనీ గేర్‌ మార్చింది. రాధ బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టింది. కానీ అదే ఓవర్లో హీలీని ఔట్‌ చేసి భారత్‌కు రాధ తొలి వికెట్‌ను అందించింది. 9 ఓవర్లకు స్కోరు 59/1. కానీ అక్కడి నుంచి మూనీ చెలరేగిపోయింది. రాధ, శిఖా ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టిన ఆమె.. స్నేహ్‌ రాణా బౌలింగ్‌లో ఓ బంతిని బౌండరీ దాటించింది. కానీ చివరికి శిఖా.. ఆమెను ఔట్‌ చేయడంతో భారత్‌ ఊపిరిపీల్చుకుంది. కానీ అది కొన్ని ఓవర్ల పాటే. 14 ఓవర్లలో 99/2తో కంగారును భారత్‌ కట్టడి చేసినట్లే కనిపించినా.. ఆఖర్లో బ్యాటర్ల దూకుడుతో ఇన్నింగ్స్‌ స్వభావమే మారిపోయింది. అప్పటిదాకా ఎక్కువగా సింగిల్స్‌కే పరిమితమైన లానింగ్‌ (తొలి 18 బంతుల్లో 14) దూకుడు పెంచింది. ఎడాపెడా బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. గార్డ్‌నర్‌ కూడా విరుచుకుపడడంతో ఆఖరి 6 ఓవర్లలో ఆసీస్‌ రెండు వికెట్లు కోల్పోయి 73 పరుగులు పిండుకుంది. లానింగ్‌ రెండు సిక్స్‌లు, ఫోర్‌ బాదడంతో ఆఖరి ఓవర్లో రేణుక ఏకంగా 18 పరుగులు సమర్పించుకుంది.

కన్నీళ్లు కనపడొద్దని..

గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడటంతో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ దుఃఖంలో మునిగిపోయింది. రనౌటై వెనుదిరిగినప్పటి నుంచి ఆమె కంట నీరు ఆగలేదు. మ్యాచ్‌ అనంతరం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కన్నీళ్లు కనిపించకుండా ఉండేందుకు నల్ల కళ్లద్దాలతో వచ్చింది. ఎందుకు ఏడుస్తున్నారు అని వ్యాఖ్యాత ప్రశ్నించగా.. ‘‘విజయం సాధిస్తామనుకున్న దశలో ఊహించని విధంగా ఓడిపోయాం. నేను రనౌటైన తీరు కంటే దురదృష్టం మరొకటి ఉండదేమో’’ అంటూ నిరాశవ్యక్తం చేసింది హర్మన్‌. జ్వరం నుంచి పూర్తిగా కోలుకోని హర్మన్‌ సెమీస్‌ ఆడకపోవచ్చని మ్యాచ్‌ ముందు వార్తలొచ్చాయి.

పోయింది ఇక్కడే...

33 బంతుల్లో 41 పరుగులు.. చేతిలో ఆరు వికెట్లున్నాయి. కెప్టెన్‌ హర్మన్‌ జోరుమీదుంది. భారత్‌దే విజయం అనిపించింది. కానీ దురదృష్టం భారత్‌ను వెంటాడింది. అనూహ్య రీతిలో హర్మన్‌ రనౌటై వెనుదిరిగింది. 15వ ఓవర్‌ నాలుగో బంతిని స్లాగ్‌స్వీప్‌తో డీప్‌ మిడ్‌వికెట్‌ వైపు బౌండరీ కోసం హర్మన్‌ పంపించింది. కానీ డైవ్‌ చేసి బంతిని ఆపిన గార్డ్‌నర్‌ వికెట్‌కీపర్‌ హీలీకి త్రో విసిరింది. అప్పటికే ఒక పరుగు పూర్తి చేసి, రెండో పరుగు కూడా సులువుగానే పూర్తి చేసేలా కనిపించిన హర్మన్‌ క్రీజు దగ్గరికి చేరుకుంది. బ్యాట్‌ను నేలపై రాసుకుంటూ క్రీజులో పెడదామనుకుంది. కానీ బ్యాట్‌ నేలను తాకిన చోటే ఆగిపోయింది. హర్మన్‌ కాలు క్రీజులో పెట్టే లోపే హీలీ స్టంప్స్‌ ఎగరగొట్టింది. దీంతో హర్మన్‌తో పాటు భారత క్రికెటర్లందరూ షాక్‌లో మునిగిపోయారు. ఆ తర్వాత భారత్‌ ఓటమి దిశగా సాగింది.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: అలీసా హీలీ (స్టంప్డ్‌) రిచా (బి) రాధ 25; బేత్‌ మూనీ (సి) షెఫాలి (బి) శిఖా 54; లానింగ్‌ నాటౌట్‌ 49; ఆష్లీ గార్డ్‌నర్‌ (బి) దీప్తి 31; గ్రేస్‌ హారిస్‌ (బి) శిఖా 7; ఎలిస్‌ పెర్రీ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 172; వికెట్ల పతనం: 1-52, 2-88, 3-141, 4-148; బౌలింగ్‌: రేణుక సింగ్‌ 4-0-41-0; దీప్తి శర్మ 4-0-30-1; శిఖా పాండే 4-0-32-2; రాధ యాదవ్‌ 4-0-35-1; స్నేహ్‌ రాణా 4-0-33-0

భారత్‌ ఇన్నింగ్స్‌: షెఫాలి ఎల్బీ (బి) షట్‌ 9; స్మృతి ఎల్బీ (బి) గార్డ్‌నర్‌ 2; యాస్తిక రనౌట్‌ 4; జెమీమా (సి) హీలీ (బి) బ్రౌన్‌ 43; హర్మన్‌ప్రీత్‌ రనౌట్‌ 52; రిచా (సి) తాలియా (బి) బ్రౌన్‌ 14; దీప్తి శర్మ నాటౌట్‌ 20; స్నేహ్‌ (బి) జొనాసెన్‌ 11; రాధ యాదవ్‌ (సి) పెర్రీ (బి) గార్డ్‌నర్‌ 0; శిఖా పాండే నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 167; వికెట్ల పతనం: 1-11, 2-15, 3-28, 4-97, 5-133, 6-135,   7-157, 8-162; బౌలింగ్‌: గార్డ్‌నర్‌ 4-0-37-2; మెగాన్‌ షట్‌ 4-0-34-1; డార్సీ బ్రౌన్‌ 4-0-18-2; ఎలిస్‌ పెర్రీ 1-0-14-0; జొనాసెన్‌ 3-0-22-1; జార్జియా 3-0-29-0; తాలియా 1-0-13-0

ఇంగ్లాండ్‌ × దక్షిణాఫ్రికా రెండో సెమీస్‌ నేడు.. సాయంత్రం 6.30 నుంచి

* మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్‌ చేరడం ఇది ఏడోసారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు