కప్పు సంబరం.. మళ్లీ ఎప్పుడో!

సాధారణంగా కనిపించి, అంచనాలే లేకుండా బరిలోకి దిగిన జట్టు ఏదంటే రాజస్థాన్‌ రాయల్స్‌ పేరే వినిపించేది. కానీ ఎంతో బలంగా కనిపించిన జట్లు తుస్సుమనిపించిన ఆ సీజన్లో అద్భుత ప్రదర్శనతో టైటిల్‌ ఎగరేసుకుపోయింది రాజస్థాన్‌.

Updated : 14 Mar 2024 06:48 IST

మరో 8 రోజుల్లో ఐపీఎల్‌-17

2008లో ఐపీఎల్‌ ఆరంభమైనపుడు.. అత్యంత సాధారణంగా కనిపించి, అంచనాలే లేకుండా బరిలోకి దిగిన జట్టు ఏదంటే రాజస్థాన్‌ రాయల్స్‌ పేరే వినిపించేది. కానీ ఎంతో బలంగా కనిపించిన జట్లు తుస్సుమనిపించిన ఆ సీజన్లో అద్భుత ప్రదర్శనతో టైటిల్‌ ఎగరేసుకుపోయింది రాజస్థాన్‌. ఇక అప్పట్నుంచి రాయల్స్‌ ప్రతిసారీ మంచి అంచనాలతో బరిలోకి దిగుతోంది. కానీ మరో టైటిల్‌ మాత్రం సాధ్యపడట్లేదు. మరి ఈసారైనా రాయల్స్‌ మెరుపులు మెరిపిస్తుందా? రెండో టైటిల్‌ కోసం సుదీర్ఘ నిరీక్షణకు తెరపడుతుందా?

ఈనాడు క్రీడావిభాగం

2008లో విజేతగా నిలిచాక తర్వాతి 15 సీజన్లలో రాజస్థాన్‌ ఒక్కసారి మాత్రమే ఫైనల్‌ చేరింది. 2022లో తుది పోరులో తలపడ్డ ఆ జట్టు గుజరాత్‌ టైటాన్స్‌కు తలవంచింది. మిగతా సీజన్లలో ఆ జట్టు ప్రదర్శన సాధారణం. చివరి అయిదు సీజన్లలో నాలుగుసార్లు ఆ జట్టు గ్రూప్‌ దశను దాటలేకపోయింది. కొందరు పేరున్న ఆటగాళ్లతో కాగితం మీద బాగానే కనిపిస్తున్న రాయల్స్‌.. ఒడుదొడుకుల ప్రయాణాన్ని దాటి ఈసారి కప్పు గెలవాలని చూస్తోంది. సీజన్‌ ముంగిట వేలంలో భారీ ధర పెట్టి విండీస్‌ ఆల్‌రౌండర్‌ రోమన్‌ పావెల్‌ (రూ.7.4 కోట్లు), మహారాష్ట్ర ఆటగాడు శుభమ్‌ దూబె (రూ.5.4 కోట్లు)లతో పాటు దక్షిణాఫ్రికా యువ ఫాస్ట్‌బౌలర్‌ బర్గర్‌లను కొనుక్కుని జట్టును మరింత బలోపేతం చేసుకుంది.

బలాలు: రాజస్థాన్‌కు కొందరు ప్రపంచ స్థాయి ఆటగాళ్ల అండ ఉంది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది జోస్‌ బట్లర్‌ గురించి. అతను ప్రతి సీజన్లోనూ ఒంటిచేత్తో కొన్ని మ్యాచ్‌లు గెలిపిస్తాడు. ఓపెనింగ్‌లో అతను జట్టుకు పెద్ద బలం. అంతకుముందే ఐపీఎల్‌లో సత్తా చాటుకుని.. గత ఏడాది కాలంలో అంతర్జాతీయ స్థాయిలోనూ మెరుపులు మెరిపించిన యశస్వి జైస్వాల్‌ రాజస్థాన్‌కు ఎంతో కీలకం. ఈసారి లీగ్‌లోనే అత్యంత ఆకర్షణీయ ఆటగాళ్లలో అతనొకడు. వీరికి తోడు సంజు శాంసన్‌, హెట్‌మయర్‌, రోమన్‌ పావెల్‌, ధ్రువ్‌ జురెల్‌లతో రాయల్స్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ దుర్బేధ్యంగా కనిపిస్తోంది. బౌల్ట్‌, సందీప్‌ శర్మ, చాహల్‌, అశ్విన్‌లతో బౌలింగ్‌ విభాగమూ బాగానే కనిపిస్తోంది.

బలహీనతలు: రాయల్స్‌ జట్టులో కొందరు ప్రధాన ఆటగాళ్లు ఫామ్‌లో లేరు. బౌల్ట్‌ ఒకప్పటి స్థాయిలో ప్రభావం చూపట్లేదు. సంజు శాంసన్‌కు నిలకడ లేమి ఎప్పుడూ సమస్యే. ఒక మ్యాచ్‌లో ఆడితే రెండు మూడు మ్యాచ్‌ల్లో చేతులెత్తేస్తాడు. చాహల్‌ స్పిన్‌లోనూ పదును తగ్గింది. మిడిలార్డర్‌ కొంచెం బలహీనంగా కనిపిస్తోంది. పావెల్‌, ధ్రువ్‌ జురెల్‌ ఏమేర రాణిస్తారో చూడాలి. లీగ్‌ ఆరంభం నుంచి దేశీయ ఆటగాళ్లను ఎక్కువగా నమ్ముకుంటున్న రాయల్స్‌.. కొన్నేళ్లుగా వారి నుంచి సరైన ప్రదర్శన రాబట్టలేకపోతోంది. రియాన్‌ పరాగ్‌ను ప్రతి మ్యాచ్‌లో ఆడిస్తుంది కానీ అతడి ప్రదర్శన అంతంతమాత్రమే.

దేశీయ ఆటగాళ్లు: సంజు శాంసన్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, అశ్విన్‌, అవేష్‌ ఖాన్‌, చాహల్‌, ధ్రువ్‌ జురెల్‌, రియాన్‌ పరాగ్‌, కునాల్‌ రాఠోడ్‌, డొనోవన్‌ ఫెరీరా, అబిద్‌ ముస్తాక్‌, కుల్‌దీప్‌ సేన్‌, నవ్‌దీప్‌ సైని, సందీప్‌ శర్మ,

విదేశీయులు: బట్లర్‌, హెట్‌మయర్‌, బౌల్ట్‌, జంపా, రోమన్‌ పావెల్‌, శుభమ్‌ దూబె, టామ్‌ కోహ్లెర్‌ క్యాడ్మోర్‌, నాంద్రి బర్గర్‌.

కీలక ఆటగాళ్లు: బట్లర్‌, యశస్వి జైస్వాల్‌, బౌల్ట్‌, సంజు శాంసన్‌, చాహల్‌.

ఉత్తమ ప్రదర్శన: 2008లో ఛాంపియన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని