
యువ భారత్ రికార్డు విజయం
326 పరుగుల తేడాతో ఉగాండాపై గెలుపు
తరౌబా: అండర్-19 ప్రపంచకప్‌లో భారత కుర్రాళ్లు అద్భుత ప్రదర్శనతో గ్రూప్ దశను అజేయంగా ముగించారు. తమ చివరి గ్రూప్- బి మ్యాచ్‌లో ఉగాండాను 326 పరుగుల తేడాతో చిత్తు చేసిన యువ భారత్.. ఈ టోర్నీ చరిత్రలోనే పరుగుల పరంగా అతి పెద్ద విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మన జట్టు 50 ఓవర్లలో 5 వికెట్లకు 405 పరుగుల భారీ స్కోరు చేసింది. రాజ్ బవా (162 నాటౌట్; 108 బంతుల్లో 14×4, 8×6), రఘువంశీ (144; 120 బంతుల్లో 22×4, 4×6) శతకాలతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ జోడీ మూడో వికెట్‌కు 206 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. కొండంత లక్ష్య ఛేదనలో ఉగాండా.. భారత బౌలర్ల ధాటికి 19.4 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో ఇద్దరు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. బౌలింగ్‌లో తాత్కాలిక సారథి నిశాంత్ (4/19) విజృంభించాడు. రాజ్‌వర్ధన్ (2/8) కూడా ఆకట్టుకున్నాడు. గ్రూప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్ శనివారం బంగ్లాదేశ్‌తో క్వార్టర్స్‌లో తలపడుతుంది. కెప్టెన్ యశ్‌తో సహా కరోనా బారిన పడ్డ టీమ్‌ఇండియా ఆటగాళ్లు అప్పటిలోపు కోలుకునే అవకాశం ఉంది.
మరోవైపు వర్షం అంతరాయం కలిగించిన గ్రూప్- ఎ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 9 వికెట్ల తేడాతో యూఏఈని ఓడించిన డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్ క్వార్టర్స్ చేరింది. ఇప్పటికే నాకౌట్ దశకు అర్హత సాధించిన పాకిస్థాన్ చివరి గ్రూప్- సి మ్యాచ్‌లో పపువా న్యూ గునియాపై 9 వికెట్ల తేడాతో పైచేయి సాధించింది. క్వార్టర్స్‌లో ఆ జట్టు.. ఆస్ట్రేలియా తలపడుతుంది. ముందంజ వేయాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో జింబాబ్వేపై 109 పరుగుల తేడాతో గెలిచిన అఫ్గానిస్థాన్ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.