
Smriti Mandhana : మేటి మహిళా క్రికెటర్ మంధాన
రెండోసారి అవార్డుకు ఎంపిక
దుబాయ్
భారత అమ్మాయిల జట్టు ఓపెనర్ స్మృతి మంధాన రెండోసారి ఐసీసీ అవార్డుకు ఎంపికైంది. 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలోనూ అద్భుత ప్రదర్శనతో మేటి మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ఈ విషయాన్ని ఐసీసీ సోమవారం ప్రకటించింది. ఈ అవార్డు రేసులో టామీ బీమాంట్ (ఇంగ్లాండ్), లిజెల్లె లీ (దక్షిణాఫ్రికా), గాబీ లూయిస్ (ఐర్లాండ్)ను మంధాన వెనక్కినెట్టింది. లిజెల్లె ఉత్తమ వన్డే క్రికెటర్‌గా నిలిచింది. ఐసీసీ టీ20 మహిళల జట్టులోనూ ఆమె చోటు దక్కించుకుంది. 2018లోనూ తను ఈ అవార్డు అందుకుంది. అప్పుడు వన్డేల్లోనూ మేటి మహిళా క్రికెటర్‌గా నిలిచింది. జులన్ గోస్వామి (2007లో) మాత్రమే మంధాన కంటే ముందు ఓవరాల్‌గా మేటి మహిళా క్రికెటర్ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. పాకిస్థాన్ యువ పేసర్ షహీన్ షా అఫ్రిది మేటి పురుష క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. 21 ఏళ్ల అతను.. ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్సు క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. గతేడాది మూడు ఫార్మాట్లలో కలిపి 36 మ్యాచ్‌ల్లో 78 వికెట్లు పడగొట్టాడు. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ వన్డే క్రికెటర్ అవార్డును అందుకుంటాడు. 27 ఏళ్ల అతను నిరుడు ఆరు వన్డేల్లో 67.50 సగటుతో 405 పరుగులు చేశాడు. గతేడాది సుదీర్ఘ ఫార్మాట్లో అమోఘంగా రాణించిన ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్.. టెస్టు క్రికెటర్ అవార్డుకు ఎంపికయ్యాడు. నిరుడు 15 టెస్టుల్లో 61 సగటుతో 1708 పరుగులు సాధించాడు. ఈ అవార్డు కోసం పోటీపడిన అశ్విన్‌కు నిరాశే మిగిలింది. దక్షిణాఫ్రికాకు చెందిన ఎరాస్మస్ మూడో సారి మేటి అంపైర్‌గా నిలిచాడు.