ఇక అమ్మాయిల పోరు

భారత క్రికెట్‌ లీగ్‌ ప్లేఆఫ్స్‌ ముంగిట చిన్న విరామం! ఈలోపు మరో సందడి మొదలవుతోంది. మహిళల ఛాలెంజర్‌ టీ20 టోర్నీ ఆరంభం కాబోతోంది. సోమవారం జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ....

Published : 23 May 2022 02:14 IST

నేటి నుంచి మహిళల ఛాలెంజ్‌
తొలి మ్యాచ్‌లో సూపర్‌నోవాస్‌తో ట్రయల్‌బ్లేజర్స్‌ ఢీ
రాత్రి 7.30 నుంచి

పుణె: భారత క్రికెట్‌ లీగ్‌ ప్లేఆఫ్స్‌ ముంగిట చిన్న విరామం! ఈలోపు మరో సందడి మొదలవుతోంది. మహిళల ఛాలెంజర్‌ టీ20 టోర్నీ ఆరంభం కాబోతోంది. సోమవారం జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ట్రయల్‌ బ్లేజర్స్‌తో సూపర్‌నోవాస్‌ తలపడనుంది. ట్రయల్‌ బ్లేజర్స్‌ను స్మృతి మంధాన నడిపిస్తుండగా.. సూపర్‌నోవాస్‌కు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్‌గా ఉంది. మూడు జట్లు తలపడే ఈ టోర్నీ ఈనెల 23న మొదలై 28న ముగుస్తుంది. అన్ని మ్యాచ్‌లూ పుణెలోని ఎంసీఏ స్టేడియంలోనే జరుగుతాయి. మూడో జట్టుగా మిథాలీరాజ్‌ సారథ్యంలోని వెలాసిటీ బరిలో దిగనుంది. ‘‘టీ20ల్లో నా ఆటను మరింత మెరుగుపరుచుకోవడానికి ఈ టోర్నీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. నేను రెగ్యులర్‌గా ఆడే షాట్లతో పాటు మరిన్ని షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తా. సూపర్‌నోవాస్‌తో మ్యాచ్‌లో స్పిన్‌ ద్వయం సోఫీ ఎకిల్‌స్టోన్‌, అలానా కింగ్‌లతో ప్రమాదం పొంచి ఉంది. వారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని మంధాన చెప్పింది. పేసర్‌ మాన్సి జోషి సత్తా చాటి భారత జట్టులోకి వచ్చేందుకు ఈ టోర్నీ మంచి అవకాశమని సూపర్‌నోవాస్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ చెప్పింది. ‘‘చాలా రోజులుగా మాన్సి భారత జట్టులో లేదు. దేశవాళీ టోర్నీల్లో ఆమె సత్తా చాటింది. నెట్‌ సెషన్స్‌లోనూ రాణించింది. ఛాలెంజర్‌ టోర్నీ ఆమెకు మరో మంచి అవకాశం. సూపర్‌నోవాస్‌ సమతూకంతో ఉంది. శుభారంభం చేసేందుకు ఎదురు చూస్తున్నాం’’ అని హర్మన్‌ప్రీత్‌ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని