ఆమె.. ఓ స్ఫూర్తి!

మహిళల క్రికెట్‌ అనగానే గుర్తొచ్చే పేరు మిథాలిరాజ్‌! బౌలింగ్‌లో అంతటి స్టార్‌డమ్‌ పేసర్‌ జులన్‌ గోస్వామికి మాత్రమే సొంతం. మిథాలీలాగే సుదీర్ఘమైన కెరీర్‌తో పాటు ఎన్నో ఘనతలను సొంతం చేసుకుందామె.

Updated : 25 Sep 2022 07:26 IST

జులన్‌ నిషిత్‌ గోస్వామి పుట్టింది: బెంగాల్‌
అరంగేట్రం: 2002 ఇంగ్లాండ్‌పై
వీడ్కోలు: 2022 ఇంగ్లాండ్‌పై
టెస్టులు: 12; వికెట్లు: 44; పరుగులు: 291
వన్డేలు: 204; వికెట్లు: 255; పరుగులు: 1228
టీ20: 68; వికెట్లు: 56; పరుగులు: 405

మహిళల క్రికెట్‌ అనగానే గుర్తొచ్చే పేరు మిథాలిరాజ్‌! బౌలింగ్‌లో అంతటి స్టార్‌డమ్‌ పేసర్‌ జులన్‌ గోస్వామికి మాత్రమే సొంతం. మిథాలీలాగే సుదీర్ఘమైన కెరీర్‌తో పాటు ఎన్నో ఘనతలను సొంతం చేసుకుందామె. ‘ఛాక్డా ఎక్స్‌ప్రెస్‌’గా ముద్దుగా పిలుచుకునే జులన్‌.. బాల్‌ గర్ల్‌గా మొదలై భారత మహిళల క్రికెట్‌పై తనదైన ముద్ర వేసింది. బెంగాల్‌లో చిన్న ఊరి నుంచి వచ్చినా ప్రపంచం తనవైపు చూసేలా చేసిన పేసర్‌ జులన్‌. భారత్‌లో మహిళల క్రికెట్‌ ఉనికే లేని స్థితిలో కెరీర్‌ ఆరంభించించింది. తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకుంది. మహిళల క్రికెట్లో పేస్‌ బౌలింగ్‌ అంటే జులన్‌ పేరు గుర్తుచ్చే స్థాయికి ఎదిగింది. ఈ స్థాయికి చేరుకునేందుకు ఆమె ఎదుర్కొన్న కష్టాలెన్నో.. పడ్డబాధలు ఇంకెన్నో! 1997లో ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన మహిళల ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ ఫైనల్లో బాల్‌ గర్ల్‌గా పని చేసిన జులన్‌.. ఎలాగైనా భారత క్రికెట్‌ జట్టుకు ఆడాలని సంకల్పం ఏర్పర్చుకుంది. క్రికెట్‌లో శిక్షణ పొందడానికి ఇంటి నుంచి ప్రతిరోజూ దాదాపు 80 కిలోమీటర్లు ప్రయాణించేది. ఉదయాన్నే 5 గంటలకే బయల్దేరి 7.30 కల్లా కోల్‌కతాలో వివేకానంద పార్క్‌కు వెళ్లేది. సాధారణ రైలు కంపార్ట్‌మెంట్లలో ప్రయాణించేది. డార్మెటరీల్లో నిద్రపోయేది. క్రికెట్లో పేరు తెచ్చుకుంటే చాలు అని తపించేది.

ఇంగ్లాండ్‌తోనే మొదలు: 2002లో ఇంగ్లాండ్‌పై అరంగేట్రం చేసిన ఆమె.. వేగంగా భారత జట్టులో కీలక సభ్యురాలిగా మారింది. దేశంలో అమ్మాయిల క్రికెట్లో ఫాస్ట్‌ బౌలింగ్‌కు చిరునామాగా మారింది. క్రమశిక్షణతో కూడిన లైన్‌ అండ్‌ లెంగ్త్‌, మంచి వేగంతో బౌలింగ్‌ చేస్తూ ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా మారింది. ముఖ్యంగా జులన్‌ రనప్‌, బౌలింగ్‌ శైలి బ్యాటర్లను కంగారుపెట్టేవి. మెరుపు స్వింగ్‌ బంతులతో పాటు చక్కని కటర్స్‌తో వికెట్లు సాధించేదామె. పరిమిత ఓవర్ల క్రికెట్లో గోస్వామి బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి బ్యాటర్లు కష్టపడేవాళ్లు. తాజాగా ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో 10 ఓవర్లలో కేవలం 20 పరుగులే ఇచ్చి ఒక వికెట్‌ పడగొట్టింది ఈ పేసర్‌. కెరీర్‌ ఆఖరి మ్యాచ్‌లోనూ 10 ఓవర్లలో 2 వికెట్లు తీసి 30 పరుగులే ఇచ్చింది. 39 ఏళ్ల వయసులోనూ యువ పేసర్లకు ధీటుగా బౌలింగ్‌ చేస్తూ క్రికెట్‌ నుంచి ఘనంగా రిటైరైంది. తనను చూసే పేసర్లుగా ఎదిగిన రేణుక, అరుంధతిరెడ్డి లాంటి అమ్మాయిలతోనూ ఇంకా ఆడుతూ స్ఫూర్తిగా నిలుస్తోంది ఈ వెటరన్‌ బౌలర్‌.

పేసర్‌గానే కాదు కెప్టెన్‌గా, లోయర్‌ఆర్డర్‌లో విలువైన బ్యాటర్‌గా రెండు దశాబ్దాల కెరీర్‌లో భిన్నమైన పాత్రలు పోషించింది జులన్‌. 2002లో ఇంగ్లాండ్‌పై టాంటన్‌ టెస్టులో మిథాలీరాజ్‌తో కలిసి నెలకొల్పిన 157 పరుగుల భాగస్వామ్యం జట్టును గట్టెక్కించింది.  2006లో ఇంగ్లాండ్‌ పర్యటనలో తొలిసారి భారత జట్టు వైస్‌ కెప్టెన్‌గా ఎంపికైన ఆమె.. జట్టు సిరీస్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించింది. భారత్‌ తొలి టెస్టు విజయం అందుకుంది ఈ సిరీస్‌లోనే. టాంటన్‌ టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అయిదు వికెట్ల ప్రదర్శన చేసింది. కెరీర్‌లో ఉత్తమ మ్యాచ్‌ గణాంకాలు (10/78) నమోదు చేసి జట్టుకు విజయాన్ని అందించింది. ఇలా చెప్పుకుంటూపోతే ఈ పేసర్‌ కెరీర్‌లో జట్టును గెలిపించిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఇంగ్లాండ్‌పై కెరీర్‌ ఆరంభించిన జులన్‌.. ఇంగ్లాండ్‌పైనే కెరీర్‌ ముగించడం విశేషం.


255

వన్డేల్లో జులన్‌ పడగొట్టిన వికెట్లు. ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆమె ఘనత సాధించింది.

* వన్డేల్లో 100 వికెట్లు, 1000 పరుగులు చేసిన 11 మంది క్రికెటర్ల జాబితాలో జులన్‌ కూడా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని