IPL 2022 Auction: రెండో రోజు ఆల్‌రౌండర్లకు పట్టం

ఐపీఎల్‌ మెగా వేలం రెండో రోజు ఆల్‌రౌండర్లపై కాసుల వర్షం కురిసింది. రూ.11.5 కోట్ల కళ్లు చెదిరే ధరకు ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ లివింగ్‌స్టోన్‌ను పంజాబ్‌ సొంతం చేసుకోగా.. బ్యాటుతో, బంతితో రాణించగల టిమ్‌ డేవిడ్‌, రొమారియో

Published : 14 Feb 2022 06:58 IST

రూ.11.5 కోట్లతో పంజాబ్‌కు లివింగ్‌స్టోన్‌

రూ.8 కోట్లకు ఆర్చర్‌ను సొంతం చేసుకున్న ముంబయి

టిమ్‌ డేవిడ్‌, షెపర్డ్‌లకు అనూహ్య ధర

అండర్‌-19 కుర్రాళ్లకూ పెద్ద మొత్తం

బెంగళూరు

ఐపీఎల్‌ మెగా వేలం రెండో రోజు ఆల్‌రౌండర్లపై కాసుల వర్షం కురిసింది. రూ.11.5 కోట్ల కళ్లు చెదిరే ధరకు ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ లివింగ్‌స్టోన్‌ను పంజాబ్‌ సొంతం చేసుకోగా.. బ్యాటుతో, బంతితో రాణించగల టిమ్‌ డేవిడ్‌, రొమారియో షెపర్డ్‌లను భారీ మొత్తాలకు ఫ్రాంఛైజీలు చేజిక్కించుకున్నాయి. యువ పేసర్‌ చేతన్‌ సకారియా పంట పండింది. అండర్‌-19 ఆటగాళ్లు రాజ్‌ బవా, హంగార్గేకర్‌ కూడా జాక్‌పాట్‌ కొట్టేశారు. సీనియర్‌ ఆటగాళ్లు రైనా, పుజారా, ఇషాంత్‌ అమ్ముడు పోలేదు. కొన్ని సీజన్ల నుంచి కోల్‌కతాను నడిపిస్తున్న ఇయాన్‌ మోర్గాన్‌కు వేలంలో నిరాశ తప్పలేదు.

ఐపీఎల్‌ వేలం ఆదివారం కూడా ఆటగాళ్లకు మిశ్రమానుభూతులను మిగిల్చింది. కొందరికి ఊహించిన దాని కన్నా చాలా ఎక్కువ ధర పలికితే.. కొందరు అమ్ముడే పోలేదు. కొందరికి తక్కువతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండో రోజు వేలానికి హైలైట్‌ మాత్రం ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ లివింగ్‌స్టోనే. ఫ్రాంఛైజీల మధ్య పోటీతో అతడి పంట పండింది. రూ.1 కోటి కనీస ధర కలిగిన అతణ్ని పంజాబ్‌ ఏకంగా రూ.11.5 కోట్లకు కొనుక్కుంది. 2022 వేలంలో అత్యధిక  ధర పలికిన విదేశీ ఆటగాడిగా లివింగ్‌స్టోన్‌ నిలిచాడు. అతడి కోసం గుజరాత్‌ టైటాన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గట్టిగా పోటీపడ్డా చివరికి పంజాబే పైచేయి సాధించింది.

అనూహ్యంగా..

వెస్టిండీస్‌ బౌలర్‌ రొమారియో షెపర్డ్‌, ఆల్‌రౌండర్‌ టిమ్‌ డేవిడ్‌లకు ఆశ్చర్యకరంగా కోట్లాభిషేకం జరిగింది. షెపర్డ్‌ను రూ.7.75 కోట్లకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంతం చేసుకోగా.. ఆస్ట్రేలియా సంతతికి చెందిన సింగపూర్‌ క్రికెటర్‌ టిమ్‌ డేవిడ్‌ కోసం ముంబయి రూ.8.25 కోట్లు వెచ్చించింది. ఈ సీజన్‌కు అందుబాటులో ఉండకపోయినా ఇంగ్లాండ్‌ ఫాస్ట్‌బౌలర్‌ ఆర్చర్‌ కోసం ఫ్రాంఛైజీలు పోటాపోటీగా వేలంలో పోటీపడ్డాయి. చివరికి ముంబయి రూ.8 కోట్లకు అతణ్ని సొంతం చేసుకుంది. రూ.5 కోట్ల వరకు ముంబయి, రాజస్థాన్‌ పోటీపడగా.. ఆ తర్వాత సన్‌రైజర్స్‌ రేసులోకి వచ్చింది. దీంతో ఆర్చర్‌  ధర అమాంతం పెరిగింది. వేలం వేస్తున్న చారు శర్మ... ఫ్రాంఛైజీల మధ్య పోటీ చూసి, ఈ ఏడాది అతడు ఐపీఎల్‌కు అందుబాటులో ఉండడన్న విషయాన్ని గుర్తు చేశాడు కూడా. అయినా జట్లు వెనక్కి తగ్గలేదు. ఆర్చర్‌ ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నాడు. స్వయంగా ఆర్చరే తనకు అంత డిమాండ్‌ ఉండడంపై ట్విట్టర్లో ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

మనోళ్లకు ఇలా

దేశీ కుర్రాళ్లకు చాలా మందికి వేలంలో మంచి ధర పలికింది. పేస్‌ బౌలర్లు  చేతన్‌ సకారియాను రూ.4.2 కోట్లకు, ఖలీల్‌ అహ్మద్‌ను రూ.5.25 కోట్లకు దిల్లీ క్యాపిటల్స్‌ సొంతం చేసుకుంది. 24 ఏళ్ల ఉత్తరప్రదేశ్‌ ఫాస్ట్‌బౌలర్‌ యశ్‌ దయాల్‌ రూ.3.2 కోట్లకు గుజరాత్‌ టైటాన్స్‌కు అమ్ముడయ్యాడు. ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబె రూ.4 కోట్లకు చెన్నై జట్టులో చేరాడు. మన్‌దీప్‌ సింగ్‌ 1.10 కోట్లతో దిల్లీ జట్టులో సభ్యుడయ్యాడు. పేసర్‌ వైభవ్‌ అరోరా (రూ.2 కోట్లు, పంజాబ్‌), నవ్‌దీప్‌ సైని (రూ.2.6 కోట్లు, రాజస్థాన్‌), స్పిన్నర్‌ ప్రశాంత్‌ సోలంకి (రూ.1.2 కోట్లు, చెన్నై), సాహా (రూ.1.9 కోట్లు, గుజరాత్‌), జయంత్‌ యాదవ్‌ (రూ.1.7 కోట్లు, గుజరాత్‌), విజయ్‌ శంకర్‌ (రూ.1.4 కోట్లు, టైటాన్స్‌),  కూడా మంచి ధరలు సాధించారు. పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడుతున్న సీనియర్‌ ఆటగాడు రహానె కోటి రూపాయల కనీస ధరకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు అమ్ముడయ్యాడు. ఆ ఒక్క జట్టు మాత్రమే అతడి కోసం బిడ్‌ వేసింది.

విదేశీయుల హవా..

వేలంలో భారీ ధర పలికిన మరో వెస్టిండీస్‌ ఆటగాడు ఆల్‌రౌండర్‌ ఒడియన్‌ స్మిత్‌. పంజాబ్‌ కింగ్స్‌ రూ.6 కోట్లకు అతణ్ని ఎంచుకోగా.. దక్షిణాఫ్రికా యువ పేసర్‌ జాన్సన్‌ రూ.4.2 కోట్లకు సన్‌రైజర్స్‌ పరమయ్యాడు. న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ అడమ్‌ మిల్నె రూ.1.9 కోట్లకు చెన్నై సొంతమయ్యాడు. ఆ దేశానికే చెందిన స్పిన్నర్‌ శాంట్నర్‌ను కూడా అదే మొత్తానికి చెన్నై దక్కించుకుంది. అలాగే రూ.3.6 కోట్లకు ఇంగ్లాండ్‌ పేసర్‌ క్రిస్‌ జోర్డాన్‌ను కూడా తీసుకుంది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మిల్లర్‌ను టైటాన్స్‌ రూ.3 కోట్లకు చేజిక్కించుకుంది. దక్షిణాఫ్రికాకే చెందిన మార్‌క్రమ్‌ను సన్‌రైజర్స్‌ రూ.2.6 కోట్లకు కొనుగోలు చేసింది. కనీస ధర రూ.1 కోటితో న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ డెవాన్‌ కాన్వేను చెన్నై ఎంచుకుంది. కరీబియన్‌ వీరుడు రోమన్‌ పావెల్‌ను రూ.2.8 కోట్లకు దిల్లీ సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ డేనియల్‌ సామ్స్‌ రూ.2.6 కోట్లు పలికాడు. అతణ్ని ముంబయి ఇండియన్స్‌ తీసుకుంది. టైమల్‌ మిల్స్‌ (రూ.1.5 కోట్లు), మెరెడిత్‌ (రూ.1 కోటి)లను కూడా ముంబయి వేలంలో చేజిక్కించుకుంది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ సీన్‌ అబాట్‌ (రూ.2.4 కోట్లు, సన్‌రైజర్స్‌), వెస్టిండీస్‌ పేసర్‌ అల్జారి జోసెఫ్‌ (రూ.2.4 కోట్లు, గుజరాత్‌), మాథ్యూ వేడ్‌ (రూ.2.4 కోట్లు, గుజరాత్‌), వెస్టిండీస్‌ ఆటగాడు లూయిస్‌ (రూ.2 కోట్లు, లఖ్‌నవూ), సామ్‌ బిల్లింగ్స్‌ (రూ.2 కోట్లు, కోల్‌కతా), నీషమ్‌ (రూ.1.5 కోట్లు, రాజస్థాన్‌), చమీర (రూ.2 కోట్లు, లఖ్‌నవూ), కౌల్టర్‌నైల్‌ (రూ.2 కోట్లు, రాజస్థాన్‌), విల్లీ (రూ.2 కోట్లు, బెంగళూరు), సౌథీ (రూ.1.5 కోట్లు, కోల్‌కతా) కూడా సంతృప్తికర ధరలకు అమ్ముడయ్యారు.

రైనా ఖేల్‌ ఖతం..

చెన్నై తరఫున ఓ వెలుగు వెలిగిన సురేశ్‌ రైనాను ఈసారి వేలంలో ఎవరూ కొనలేదు. టీమ్‌ ఇండియా సీనియర్‌ ఆటగాళ్లు పుజారా, ఇషాంత్‌లకు కూడా నిరాశ తప్పలేదు. ఏ ఫ్రాంఛైజీ కూడా వారిపై ఆసక్తి చూపకపోవడంతో వాళ్లు అమ్ముడు పోలేదు. పియూష్‌ చావ్లా, అమిత్‌ మిశ్రా, పవన్‌ నేగీల పరిస్థితీ అంతే. ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ డేవిడ్‌ మలన్‌ ఇయాన్‌ మోర్గాన్‌.. ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ లబుషేన్‌, ఫించ్‌, స్టీవ్‌ స్మిత్‌, విండీస్‌ పేసర్‌ కాట్రెల్‌ కూడా ఫ్రాంఛైజీలను ఆకర్షించలేకపోయారు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని