MS Dhoni: దటీజ్‌ ధోనీ.. లోయర్‌ ఆర్డర్‌లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?

ధోనీ లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు రావడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో తెలిస్తే.. సీఎస్‌కే విషయంలో అతడు ఎంత అంకితభావంతో ఉన్నాడో అర్థమవుతుంది.

Updated : 07 May 2024 12:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఆవేశం ఎక్కువ.. తాము ఊహించింది జరగకపోతే అసలు విషయం తెలుసుకోకుండానే విమర్శలకు దిగుతారు. తాజాగా ధోనీ (MS Dhoni) విషయంలో కూడా ఫ్యాన్స్‌ ఇలానే ప్రవర్తిస్తున్నారా.. అనే సందేహాలు కలగక మానవు. చెన్నై జట్టు ధర్మశాల వేదికగా పంజాబ్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో 122 పరుగుల వద్ద ఆరో వికెట్‌ కోల్పోయింది. అది 16వ ఓవర్‌ కావడంతో ధోనీ రంగంలోకి దిగుతాడని ఫ్యాన్స్‌ అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ, శార్దూల్‌ ఠాకూర్‌ మైదానంలోకి అడుగుపెట్టడంతో వారు నిరాశకు గురయ్యారు. దీంతో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ధోనీ వీలైనంత వెనక్కి జరుగుతున్నాడని విమర్శలు మొదలయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు రాలేకపోతే.. ధోనీ జట్టు నుంచి వైదొలగి ఓ అదనపు బౌలర్‌ను ఆడించాల్సిందని మాజీ ఆటగాడు, ఒకప్పటి సీఎస్‌కే జట్టు సభ్యుడు హర్భజన్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు. 

ఈ అంశంపై ఓ ఆంగ్ల పత్రిక ఆరా తీయగా ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. తప్పనిసరి స్థితిలోనే ఎమ్మెఎస్‌డీ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో వెనుక్కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఐపీఎల్‌లో మొదటి నుంచి ధోనీ తొడ కండర గాయంతోనే ఆడుతున్నట్లు సీఎస్‌కే వర్గాలు చెబుతున్నాయి. దీంతో అతడు ఎక్కువ సేపు పరిగెత్తే పరిస్థితి లేనట్లు తెలుస్తోంది. 

మందులు వాడుతూనే మైదానంలోకి..

ఈ ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు నుంచే ధోనీ ఇబ్బంది పడుతున్నాడు. జట్టు రెండో వికెట్‌ కీపర్‌ అయిన డేవిడ్‌ కాన్వే కూడా గాయం బారిన పడటంతో.. తప్పనిసరి స్థితిలో మహీనే బాధను ఓర్చుకొని మైదానంలోకి దిగాల్సి వస్తోంది. ఓ పక్క గాయానికి  మందులు వాడుతూనే.. వీలైనంత తక్కువ పరిగెత్తేలా జాగ్రత్తలు తీసుకొంటూ ఆడుతున్నాడు. వాస్తవానికి డాక్టర్లు అతడిని రెస్టు తీసుకోమని సూచించారు. కానీ, జట్టులోని కీలక ఆటగాళ్లు గాయాలతో వైదొలగడంతో ధోనీనే నిలబడాల్సి వచ్చింది. ‘‘మేం మా ‘బి’ టీమ్‌తోనే బరిలోకి దిగుతున్నాం. ధోనీని విమర్శించే వారికి అతడు జట్టు కోసం చేస్తున్న త్యాగం గురించి తెలియకపోవచ్చు’’ అని సీఎస్కే వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాదు.. మైదానంలో జట్టు కొత్త సారథి రుతురాజ్‌కు కూడా మార్గదర్శిగా ధోనీ వ్యవహరిస్తున్నాడు. 

గత ఐపీఎల్‌లో ఎమ్మెఎస్‌డీ మోకాలి గాయంతోనే ఆడి.. జట్టుకు కప్పు అందించాడు. ప్రస్తుతం అది పూర్తిగా నయమైంది. కానీ, కండర గాయం మాత్రం ఇబ్బంది పెడుతోంది. ఫలితంగా మైదానంలో అతడు చురుగ్గా ఉండలేకపోతున్నాడు. ప్రాక్టీస్‌లో కూడా ధోనీ రన్నింగ్‌ చేయడంలేదు. కేవలం బంతిని బలంగా బాదడంపై దృష్టిపెట్టి సాధన చేస్తున్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని