NEPAL vs MON: టీ20ల్లో చరిత్ర సృష్టించిన నేపాల్‌.. ఆసియా క్రీడల్లో రికార్డుల మోత

టీ20 క్రికెట్‌లో నేపాల్‌ చరిత్ర సృష్టించింది. మంగోలియాతో (NEP vs MON) జరిగిన మ్యాచ్‌ల్లో సరికొత్త రికార్డులను నమోదు చేసింది.

Updated : 27 Sep 2023 10:52 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియా క్రీడల్లో (Asian Games) పురుషుల క్రికెట్‌ తొలి రోజే రికార్డుల మోత మోగింది. నేపాల్ - మంగోలియా జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. మంగోలియా బౌలింగ్‌లో నేపాల్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ఈ క్రమంలో నాలుగు అంతర్జాతీయ రికార్డులను నమోదు చేశారు. అత్యంత వేగవంతమైన అర్ధశతకం, వేగవంతమైన సెంచరీ, టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టు, భారీ తేడాతో విజయం సాధించిన జట్టుగానూ రికార్డు సృష్టించింది. 

  • నేపాల్ బ్యాటర్ దీపేంద్ర సింగ్‌ ఐరీ (52 నాటౌట్: 10 బంతుల్లో 8 సిక్స్‌లు) అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీని సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. దీపేంద్ర సింగ్ 9 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. అంతకుముందు భారత బ్యాటర్ యువరాజ్‌ సింగ్‌ పేరిట (12 బంతుల్లో) ఈ రికార్డు ఉంది. దీపేంద్ర  కూడా ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు బాదేశాడు.
  • కుశాల్‌ మల్లా అత్యంత వేగవంతమైన సెంచరీ బాదిన బ్యాటర్‌గా అవతరించాడు. కేవలం 34 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. కుశాల్‌ మొత్తం 50 బంతుల్లో 137 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 12 సిక్స్‌లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ సెంచరీ రికార్డు దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ పేరిట ఉండేది. అతడు బంగ్లాదేశ్‌పై 35 బంతుల్లోనే (2017లో) శతకం కొట్టాడు.
  • మంగోలియాపై నేపాల్‌ 20 ఓవర్లలో 314/3 స్కోరు చేసింది. టీ20ల్లో ఒక జట్టు నమోదు చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. 2019లో ఐర్లాండ్‌పై అఫ్గానిస్థాన్‌ 278/3 స్కోరు సాధించింది. ఇదే ఇప్పటి వరకు అత్యధిక స్కోరుగా ఉండేది. దానిని నేపాల్‌ అధిగమించింది. టీ20ల్లో 300కిపైగా పరుగులు చేసిన ఏకైక జట్టుగా నేపాల్‌ నిలిచింది.
  • అత్యధిక తేడాతో గెలిచిన జట్టుగా నేపాల్‌ అవతరించింది. మంగోలియాపై 273 పరుగుల తేడాతో విజయం సాధించింది. మంగోలియా 13.1 ఓవర్లలో 41 పరుగులకే ఆలౌటైంది. మంగోలియా బ్యాటర్ దావసురెన్ (10) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు. ఇంతకుముందు టర్కీపై చెక్‌ రిపబ్లిక్‌ 257 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు నేపాల్‌ ఆ రికార్డును తుడిచిపెట్టింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు