Ruturaj Gaikwad: గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్‌ టర్నింగ్‌ స్పెల్ జడ్డూదే: రుతురాజ్‌

తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు.

Published : 29 Apr 2024 11:35 IST

ఇంటర్నెట్ డెస్క్: వరుసగా రెండు ఓటముల తర్వాత చెన్నై మళ్లీ పుంజుకుంది. కీలకమైన మ్యాచ్‌లో హైదరాబాద్‌ను 78 పరుగుల తేడాతో చిత్తు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (98), డారిల్ మిచెల్ (52), దూబె (39) అదరగొట్టారు. దీంతో 212/3 స్కోరు చేయగలిగింది. అనంతరం హైదరాబాద్‌ 134 పరుగులకే ఆలౌటైంది. తుషార్ దేశ్‌పాండే (4/27), జడేజా (1/22), పతిరన (2/17), ముస్తాఫిజుర్ (2/19) బౌలింగ్‌లో రాణించారు. తృటిలో తన సెంచరీని చేజార్చుకున్న రుతురాజ్‌ (Ruturaj Gaikwad) జట్టు విజయం సాధించడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘‘తేమ ప్రభావం ఎక్కువగా ఉన్న ఇలాంటి మ్యాచుల్లో ఆడటం చాలా కష్టం. చివరికి విజయం సాధించడం ఆనందంగా ఉంది. అద్భుతమైన ప్రదర్శనతో హైదరాబాద్‌పై 70+ రన్స్‌ తేడాతో గెలిచాం. టాస్ ఓడిపోవడమూ మాకు కలిసొచ్చింది. గత మ్యాచ్‌లోనే మేం వేడి, ఉక్కపోత వాతావరణంలో 40 ఓవర్లపాటు మైదానంలో ఉన్నాం. ఇప్పుడు ఇదే పరిస్థితి. నేను కాస్తలో సెంచరీ మిస్ అయినందుకు బాధేం లేదు. కనీసం 220 + స్కోరు చేయాలని అనుకున్నాం. అయితే, నాలుగైదు షాట్లు సరిగ్గా కనెక్ట్ కాలేదు. ఇన్నింగ్స్‌ బ్రేక్‌ సమయంలో ఇదే నన్ను బాధించింది. కానీ, మా బౌలర్లు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ అద్భుతంగా బౌలింగ్‌ వేశారు. గత మ్యాచ్‌లో మేం కొన్ని తప్పిదాలు చేశాం. వాటిని సరిచేసుకొని విజయం సాధించగలిగాం. ఫీల్డింగ్‌లోనూ చాలా మెరుగయ్యాం. తుషార్‌ అద్భుతంగా బౌలింగ్‌ వేశాడు. కానీ, మ్యాచ్‌ టర్నింగ్‌ స్పెల్ మాత్రం జడ్డూదే. బంతిపై పట్టు దొరకడమే కష్టమైన సమయంలో నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 22 పరుగులే ఇవ్వడం అభినందనీయం. సీనియర్లకు నేను చెప్పేదేం ఉండదు’’ అని రుతురాజ్‌ వ్యాఖ్యానించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డును రుతురాజ్‌ దక్కించుకున్నాడు.

బ్యాటింగ్‌ తీసుకోనందుకు..: కమిన్స్

‘‘ఈ మ్యాచ్‌ ఫలితం తర్వాత తొలుత బ్యాటింగ్‌ తీసుకొని ఉంటే బాగుండని భావించలేదు. తప్పకుండా గెలుస్తామని అనుకున్నాం. అయితే, చెన్నై బ్యాటర్లు చాలా బాగా ఆడారు. 210+ స్కోరును లక్ష్యంగా నిర్దేశించారు. మా బ్యాటింగ్ లైనప్‌తో ఛేదిస్తామని అనుకున్నప్పటికీ.. పిచ్‌ ఒక్కసారిగా మారిపోయింది. మంచు ప్రభావం మ్యాచ్‌ మొత్తం కొనసాగింది. తప్పకుండా తదుపరి మ్యాచుల్లో పుంజుకొని విజయం సాధిస్తాం’’ అని కమిన్స్‌ తెలిపాడు. 

మరికొన్ని మ్యాచ్‌ విశేషాలు..

  • ఎంఎస్ ధోనీకిది 150వ ఐపీఎల్‌ మ్యాచ్‌ విజయం. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని రికార్డు. 
  • ఐపీఎల్‌లో పరుగుల పరంగా హైదరాబాద్‌కిదే భారీ ఓటమి. ఇప్పుడు 78 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అంతకుముందు చెన్నై చేతిలోనే (2013లో) 77 రన్స్‌ తేడాతో ఓడింది.
  • ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో గుజరాత్‌ తర్వాత రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టు హైదరాబాద్‌. రెండు మ్యాచుల్లోనూ లక్ష్య ఛేదన సమయంలోనే కావడం గమనార్హం. 
  • ఐపీఎల్ 17వ సీజన్‌లో హైదరాబాద్‌ తొలిసారి ఆలౌటైంది. అలానే చెన్నై ప్రత్యర్థి జట్టును మొదటిసారి ఆలౌట్‌ చేయడం గమనార్హం. 
  • ఒక ఐపీఎల్‌ మ్యాచ్‌లో 9 మంది బ్యాటర్లు క్యాచ్‌ల ద్వారానే పెవిలియన్‌కు చేరారు. ఇలా జరగడం ఇది మూడోసారి. హైదరాబాద్‌కు మాత్రం తొలిసారి.
  • ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన రెండో ఆటగాడు డారిల్ మిచెల్. హైదరాబాద్‌పై 5 క్యాచ్‌లను పట్టాడు. అంతకుముందు ముంబయిపై నబీ (ఎస్‌ఆర్‌హెచ్) కూడా ఐదు క్యాచ్‌లను అందుకొన్నాడు.
  • ఒకే వేదికపై అత్యధిక విజయాలు సాధించిన మూడో జట్టు చెన్నై. చెపాక్‌లో ఆ జట్టుకిది 50వ విక్టరీ. వాంఖడేలో ముంబయి 51, ఈడెన్‌ గార్డెన్స్‌లో కోల్‌కతా 50 విజయాలతో కొనసాగుతున్నాయి. 
  • టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు 200+ స్కోర్లు చేసిన తొలి జట్టుగా చెన్నై అవతరించింది. సీఎస్కే 35 సార్లు చేయగా.. సోమర్సెట్ (34), భారత్ (32), బెంగళూరు (31), యార్క్‌షైర్ (29), సర్రే (28) తర్వాత స్థానాల్లో నిలిచాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని