Jemimah Rodrigues: ‘రీల్స్‌ కాదు.. రన్స్‌ చెయ్‌’.. బ్యాట్‌తోనే ట్రోలర్లపై రోడ్రిగ్స్‌ రోరింగ్‌!

Eenadu icon
By Sports News Team Published : 31 Oct 2025 11:16 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

‘‘ఎప్పుడూ చూసినా మైదానంలో తిరుగుతూ ఉంటావు. రీల్స్‌ చేసుకుంటూ ఉంటావు. ఆడేదెప్పుడు? అనవసరంగా జట్టులో ఉంచారు’’.. ఇవీ జెమామీ రోడ్రిగ్స్‌ గురించి సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్‌. ఎప్పుడూ నవ్వుతూ ఉండే రోడ్రిగ్స్‌ ఈ విజయం అనంతరం కన్నీళ్లు పెట్టుకొంది. తన సత్తా ఏంటో క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పింది.

వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో ఆసీస్‌పై భారత్‌ అద్వితీయమైన విజయం సాధించింది. అసాధ్యమనుకున్న టార్గెట్‌ను ఛేదించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇదంతా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌తోపాటు జెమీమా రోడ్రిగ్స్‌ చలవే. మరీ ముఖ్యంగా ఆఖరివరకూ క్రీజ్‌లో ఉండి జట్టును గెలిపించిన రోడ్రిగ్స్‌ ఇన్నింగ్స్‌ ఎప్పటికీ మరిచిపోలేం. ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా సెమీస్‌కు చేరిన ఆసీస్‌పై 127 పరుగులతో జెమీమా అజేయంగా నిలిచింది. రోడ్రిగ్స్‌ రోరింగ్‌ అంటూ అభిమానులు పిలుచుకోవడం వెనక చాలా శ్రమ ఉంది. ఈ గెలుపుతో అప్పటివరకూ ఆమెలో దాగి ఉన్న కన్నీళ్లన్నీ జలజలా బయటకు వచ్చేశాయి. వద్దన్నవారే జట్టులో ఉండాల్సిందే అనే స్థాయికి రోడ్రిగ్స్‌ చేరుకుంది.  

ఆ కన్నీళ్లలో..

సాధారణంగా ప్రపంచ కప్‌ గెలిస్తేనో లేకపోతే ఏదైనా భారీ టోర్నీలో విజయం సాధిస్తేనో భావోద్వేగానికి గురికావడం సహజం. కానీ, టీమ్‌ఇండియా సెమీస్‌లో ఆసీస్‌పై గెలవడంతోనే సంబరాలు అంబరాన్నంటాయి. శతకంతో జట్టును గెలిపించిన జెమీమా రోడ్రిగ్స్‌ అయితే మైదానమంతా కలయతిరుగుతూ కన్నీళ్లు పెట్టుకుంది. సెంచరీ చేసిన తర్వాత కూడా సంబరాలు చేసుకోని ఆమె.. మ్యాచ్ విజయం అనంతరం అభిమానులకు అభివాదం చేస్తూ సందడి చేసింది. నవీ ముంబయి తన హోం గ్రౌండ్‌ కావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇలా చేయడానికి మరో కారణం ఆమెపై వచ్చిన ట్రోలింగ్‌కు తన బ్యాటింగే సమాధానం చెప్పిందనే ఆత్మవిశ్వాసమని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. 

రీల్స్‌ చేస్తుంది.. గిటార్‌ అంటే ప్రాణం

క్రికెట్‌లోనే కాకుండా జెమీమాకు ఇతర ఆటల్లోనూ ప్రావీణ్యం ఉంది. హాకీ, ఫుట్‌బాల్, బాస్కెట్‌ బాల్ కూడా ఆడుతుంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే క్రికెటర్. రీల్స్‌ చేస్తూ సందడిగా ఉంటుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌కు దాదాపు 1.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక గిటార్‌  వాయిస్తూ పాటలు పాడటం ఆమెకెంతో ఇష్టం. ఇన్‌స్టా వీడియోలు చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. అయితే, ఇవన్నీ ఆమెపై ఓ రకంగా ప్రతికూలంగా మారడానికి కారణం. ఏదైనా మ్యాచ్‌లో విఫలమైతే వెంటనే జెమీమాను టార్గెట్‌ చేసేవారికి ఈ రీల్స్‌ ఆయుధంగా మారేది. ఎప్పుడు చూసినా రీల్స్, వీడియోలు చేసుకోవడం కాదు ఆటపై దృష్టి పెట్టాలంటూ ఉచిత సలహాలు ఇచ్చేవారు. 

అత్యుత్తమ ఫీల్డర్‌ కూడానూ..

జెమీమా రోడ్రిగ్స్‌ 2018లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. సన్నగా రివటాలా ఉండే జెమీమా మైదానంలో చాలా చురుగ్గా ఉంటుంది. అత్యుత్తమ ఫీల్డింగ్‌ నైపుణ్యాలతో జెమీమా రోడ్రిగ్స్‌ ‘జాంటీ రోడ్స్‌’ను గుర్తుకుతెచ్చేలా ప్రదర్శన ఇస్తుంటుంది. అందుకు తాజా ఉదాహరణ ఆసీస్‌తో సెమీస్‌. తాలియా మెక్‌గ్రాత్‌ను ఔట్‌ చేసిన తీరు అద్భుతం. ఇక బంతిని ఆపడంలో ఆసీస్‌కు దీటుగా స్పందించింది. అసలు జట్టులో స్థానం ఉంటుందో, లేదో అనే పరిస్థితి నుంచి తన ప్లేస్‌ను సుస్థిరం చేసుకొనే స్థాయికి చేరుకుందనడంలో సందేహం లేదు.

- ఇంటర్నెట్ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని