
దక్షిణ మధ్య రైల్వేకి రూ.62 కోట్ల చెక్కు
అందజేసిన సింగరేణి అధికారులు
ఈనాడు, హైదరాబాద్: కొత్తగూడెం-సత్తుపల్లి రైల్వేలైన్ నిర్మాణం కోసం సింగరేణి సంస్థ.. దక్షిణ మధ్య రైల్వేకు రూ.62.17 కోట్ల చెక్కును శుక్రవారం అందజేసింది. ఈ కొత్త రైల్వేలైన్‌ని సింగరేణి కాలరీస్- దక్షిణమధ్య రైల్వే సంయుక్త భాగస్వామ్యంతో నిర్మిస్తున్నాయి. తన వాటా చివరి విడత మొత్తాన్ని ఇచ్చే క్రమంలో సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్మెంట్) జె.అల్విన్, జీఎం (కోఆర్డినేషన్, మార్కెటింగ్) కె.సూర్యనారాయణ, జీఎం (సివిల్) రమేశ్‌బాబు సికింద్రాబాద్‌లోని రైల్‌నిలయంలో ద.మ.రైల్వే జీఎం గజానన్ మల్యని కలిసి చెక్కు అందజేశారు. ఈ ప్రాజెక్టు కోసం తన వంతుగా మొత్తం రూ.618.55 కోట్లను చెల్లించినట్లు సింగరేణి సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నిర్మాణపనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని అల్విన్ కోరగా ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని మల్య హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ద.మ.రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషనల్ మేనేజర్ ఆర్.ధనుంజయులు తదితరులు పాల్గొన్నారు.