గుప్పిట్లోకి విమానాశ్రయం

ఉగ్రవాదులు పేట్రేగిపోయి పెద్దఎత్తున మారణహోమానికి పాల్పడిన నేపథ్యంలో అఫ్గాన్‌ రాజధాని కాబుల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై తాలిబన్లు మరింత పట్టు బిగించారు. మరోసారి దాడి జరిగే అవకాశాలున్నాయన్న..

Updated : 29 Aug 2021 04:59 IST

రాజధాని కాబుల్‌పై మరింతగా పట్టు బిగించిన తాలిబన్లు
భారీగా ప్రజలు రాకుండా చర్యలు

కాబుల్‌: ఉగ్రవాదులు పేట్రేగిపోయి పెద్దఎత్తున మారణహోమానికి పాల్పడిన నేపథ్యంలో అఫ్గాన్‌ రాజధాని కాబుల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై తాలిబన్లు మరింత పట్టు బిగించారు. మరోసారి దాడి జరిగే అవకాశాలున్నాయన్న సమాచారం నేపథ్యంలో విమానాశ్రయానికి పెద్దఎత్తున ప్రజలు రాకుండా నిలువరించడంపై దృష్టి సారించారు. విమానాశ్రయ మార్గాల్లో మరిన్ని చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. చీకట్లోనూ దృశ్యాలు కనిపించేందుకు.. అఫ్గాన్‌ బలగాల నుంచి స్వాధీనం చేసుకున్న ప్రత్యేక కళ్లద్దాలను వారు వినియోగిస్తున్నారు. 2 వారాలుగా జనసమ్మర్దంగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

భవితపై అయోమయం

మెరికా బలగాల ఉపసంహరణకు గడువు ఈ నెల 31 కావడంతో పలువురిలో ఆందోళన పెరిగిపోతోంది. ‘‘అమెరికా పాస్‌పోర్ట్‌ ఉన్నవారినే పంపాల్సిందిగా అమెరికా వర్గాలు చెప్పినట్లు తాలిబన్లు స్పష్టంచేశారు. భవితపై బెంగగా ఉంది’’ అని అమెరికా సైన్యానికి అనువాదకుడిగా వ్యవహరించిన అఫ్గాన్‌ వ్యక్తి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. తమ సైనిక బలగాల తుది దశ ఉపసంహరణను అమెరికా ప్రారంభించింది. చనిపోయిన 13 మంది తమ సైనికుల మృతదేహాలను అమెరికాకు తరలిస్తున్నట్లు పెంటగాన్‌ తెలిపింది.

ఇప్పటికి 1.12 లక్షల మంది తరలింపు

త రెండువారాల్లో అమెరికా నేతృత్వంలో దాదాపు 1.12 లక్షల మందిని వివిధ దేశాలకు తరలించినా ఇంకా కొన్ని వేల మంది తమవంతు కోసం ఎదురు చూస్తున్నారు. మంగళవారం లోగా వారి ప్రయత్నాలు ఫలిస్తాయా అనేది సందేహమే. తగిన పత్రాలు ఉన్నవారిని విమానాశ్రయం లోపలకు ఇప్పటికీ అనుమతిస్తున్నామని, దాదాపు 5,400 మంది ప్రజలు ప్రస్తుతం టెర్మినల్‌ భవనంలో నిరీక్షిస్తున్నారని అమెరికా వర్గాలు తెలిపాయి. ప్రమాదంలో ఉన్న అఫ్గాన్లను తరలించే చర్యల్ని ముమ్మరం చేయాలంటూ ఇప్పటివరకు 28 మంది సెనేటర్లు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు లేఖలు రాశారు. అవసరమైతే వీసా నిబంధనల్ని సడలించాలని వారు సూచించారు.

వెనక్కి మళ్లుతున్న ఫ్రాన్స్‌, బ్రిటన్‌

ఫ్గాన్‌లో మోహరించిన తమ బలగాల్ని ఫ్రాన్స్‌ పూర్తిగా వెనక్కి తీసుకుంది. అమెరికా సేనలు వెళ్లిపోయిన తర్వాత ఎవరైనా అఫ్గాన్‌ను వీడిపోవాలంటే దానికి వీలుగా వాణిజ్య విమానాలను అనుమతిస్తామని తాలిబన్లు చెబుతున్నా  వారి నియంత్రణలోని విమానాశ్రయానికి వచ్చేందుకు ఏ విమానయాన సంస్థ అయినా ముందుకు వస్తుందా అనేది అనుమానంగానే ఉంది. తమ పౌరుల్ని అఫ్గాన్‌ నుంచి తరలించే పనిని ముగించినట్లు బ్రిటన్‌ ప్రకటించింది. అందరినీ తీసుకురావడం వీలు కాదని, తరలింపు క్రమంలో అనేకసార్లు తన కళ్లు చెమ్మగిల్లాయని బ్రిటన్‌ రక్షణ దళాల అధిపతి జనరల్‌ సర్‌ నిక్‌ కార్టర్‌ చెప్పారు. క్షేత్రస్థాయిలో నిర్ణయాలు తీసుకోవడం ఎంతో సవాల్‌తో కూడుకునేదని వివరించారు. చిట్టచివరి విమానం అక్కడి నుంచి వస్తున్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందనేది ఉద్వేగాన్ని కలిగిస్తోందన్నారు.

70 లక్షల మంది ఉపాధికి దెబ్బ

ఫ్గాన్‌లో కరవు కారణంగా 70 లక్షల మంది ప్రజల జీవనోపాధి దెబ్బతింటుందని ఐరాస ప్రపంచ ఆహార కార్యక్రమం హెచ్చరించింది. ప్రతి ముగ్గురు అఫ్గాన్లలో ఒకరికి అత్యవసర ఆహార సాయం అందించాల్సి ఉందని పేర్కొంది. కరోనా వైరస్‌కు తోడు, ఇతర ప్రాంతాలకు తరలిపోవడం వల్ల అఫ్గాన్లకు తీవ్ర ఇక్కట్లు తప్పవని రోమ్‌ కేంద్రంగా పనిచేసే ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏవో) పేర్కొంది. ‘‘గత ఏడాదితో పోలిస్తే ఈసారి వ్యవసాయ ఉత్పత్తులు 20% తగ్గుతాయి’’ అని ఎఫ్‌ఏవో అంచనా వేసింది.


జీతాల కోసం ఆందోళన

కాబుల్‌: కరోనా మహమ్మారి, తీవ్ర కరవు పరిస్థితులతో సతమతమవుతున్న అఫ్గాన్‌కు తాలిబన్ల దురాక్రమణ తోడుకావడంతో... ఆ దేశ పరిస్థితి ‘గోటిచుట్టుపై రోకటి పోటు’లా పరిణమించింది! కొద్దిరోజులుగా అఫ్గాన్‌ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతోంది. రాజధానిలోని న్యూ కాబుల్‌ బ్యాంకు ఎదుట వందలమంది పౌరులు శనివారం నిరసనకు దిగారు. జీతభత్యాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఆరు నెలలుగా తమకు వేతనాలు ఇవ్వలేదని, మూడు రోజుల కిందటే బ్యాంకులు పునఃప్రారంభమైనా... చెల్లింపులు జరపడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటీఎంల వద్ద కూడా ప్రజలు భారీ సంఖ్యలో బారులు తీరారు. వాటి నుంచి ఒక్కొక్కరు రోజుకు 200 డాలర్లకు మించి తీసుకోకుండా అధికారులు ఆంక్షలు విధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని