29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం

వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్‌ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Published : 27 Apr 2024 05:04 IST

విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లకు ఉన్నత విద్యామండలి సమాచారం
వైకాపాతో అంటకాగుతూ లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నాలు

ఈనాడు, అమరావతి: వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్‌ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. విశ్వవిద్యాలయాల్లోని అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియపై సమావేశం నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి సిద్ధమైంది. అన్ని వర్సిటీల రిజిస్ట్రార్లకు సమాచారం పంపింది. ఈనెల 29న ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించే నియామక ప్రక్రియ సమావేశానికి సంబంధించిన సమాచారంతో రావాలంటూ ఆదేశాలు ఇచ్చింది. విమర్శలు వ్యక్తమవుతున్నా వైకాపాకు లబ్ధి చేకూర్చేందుకు ఉన్నత విద్యామండలిలోని కీలక వ్యక్తి ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18విశ్వవిద్యాలయాల్లో 3,220 పోస్టుల భర్తీకి అక్టోబరు 30న వర్సిటీల వారీగా ప్రకటనలు విడుదలయ్యాయి. 278 బ్యాక్‌లాగ్‌ పోస్టులతో పాటు 2,942 రెగ్యులర్‌ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల హేతుబద్ధీకరణ, రిజర్వేషన్‌ రోస్టర్‌ విధానంపై అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు జరిగిన సమయంలో వర్సిటీల్లో పోస్టుల భర్తీకి ఇచ్చిన ప్రకటనను వెనక్కి తీసుకోవడంగాని, బ్యాక్‌లాగ్‌ పోస్టులను విడదీసి, సవరణ నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉంటుందని న్యాయస్థానానికి ప్రభుత్వం తెలిపింది. ఇదే జరిగితే గతంలో ఇచ్చిన ప్రకటనలు రద్దు కానున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ ప్రకటనలు ఇవ్వడం.. బ్యాక్‌లాగ్‌ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌లపై ఉన్నత విద్యామండలి సమావేశం నిర్వహిస్తోంది. ఎన్నికల సమయంలో ఉద్యోగాల భర్తీకి సమావేశాలు నిర్వహించడం నిరుద్యోగ ఓటర్లను ప్రభావితం చేయడం కోడ్‌ ఉల్లంఘనే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని