
మీ ప్రతిపాదన గొప్పది
మా ఇబ్బందినీ చూడండి
ఏ ఐఏఎస్‌లను పంపాలో మేం నిర్ణయిస్తాం
డిప్యుటేషన్ ప్రతిపాదనపై ప్రధానికి ఏపీ సీఎం జగన్ లేఖ
ఈనాడు, అమరావతి: వివిధ కేంద్రప్రభుత్వ విభాగాలు, కార్యాలయాలను నడిపించేందుకు సమర్థులైన ఐఏఎస్ అధికారుల్ని నియమించాలని ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని ఏపీ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. పాలనను సజావుగా, నిరాటంకంగా సాగించేందుకు కేంద్రం చేతిలో శక్తిమంతులు, సమర్థులైన అధికారులతో కూడిన బృందం ఉండాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో రాష్ట్రప్రభుత్వ అభీష్టంతో సంబంధం లేకుండా రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారుల్ని కేంద్ర సర్వీసుకు డిప్యూటేషన్‌పై పిలిపించుకునే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి కట్టబెడుతూ సర్వీసు నిబంధనల్ని సవరించాలన్న ప్రతిపాదనపై పునరాలోచించాలని ఆయన ప్రధానిని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్రమోదీకి శుక్రవారం ఓ లేఖ రాశారు. కేంద్రం కోరినంతమంది ఐఏఎస్ అధికారుల్ని నిబంధనల ప్రకారం కేంద్రానికి డిప్యుటేషన్‌పై పంపేందుకు సిద్ధంగా ఉన్నామని... కానీ ఎవర్ని పంపించాలో నిర్ణయించుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వానికే ఉంచాలని కోరారు.
ఉన్నపళంగా తీసుకుంటే ఇబ్బంది
‘మీరు తీసుకున్న ఆ నిర్ణయం ప్రశంసనీయం. ఆ ప్రతిపాదనను నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. అదే సమయంలో ప్రతిపాదిత సవరణ వల్ల తలెత్తే కొన్ని ఇబ్బందుల్ని మీ దృష్టికి తెస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వాల్లో ఐఏఎస్ అధికారుల పాత్ర ఎంత కీలకమైందో మీకు తెలియంది కాదు. కేంద్రప్రభుత్వం ఎవరిని కోరితే వారిని, ఉన్నపళంగా రిలీవ్ చేస్తే... రాష్ట్రంలో వారు చూస్తున్న విభాగాలు, ప్రాజెక్టులకు ఇబ్బంది కలుగుతుంది. అధికారుల అభీష్టంతో సంబంధం లేకుండా పంపితే వారి వ్యక్తిగత జీవితం కూడా ఒడుదొడుకులకు లోనవుతుంది’ అని సీఎం పేర్కొన్నారు.
ఎన్ఓసీ విధానాన్ని కొనసాగించండి
‘ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని ఎన్ఓసీ ఇచ్చే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కొనసాగించండి. కేంద్రానికి అవసరమైన సంఖ్యలో ఐఏఎస్ అధికారుల్ని పంపిస్తామని హామీ ఇస్తున్నాను. ఈ దేశాన్ని అత్యున్నత స్థానంలో నిలబెట్టేందుకు మీరు వేసే ప్రతి అడుగులోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంపూర్ణ మద్దతు మీకుంటుందని హామీ ఇస్తున్నాను’ అని ఆ లేఖలో సీఎం పేర్కొన్నారు.