Published : 07/12/2021 02:47 IST

తక్షణమే ఉద్యోగుల బదలాయింపు ప్రక్రియ

ఎన్నికల కోడ్‌లేని జిల్లాల్లో సత్వరమే అమలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో కొత్త జోనల్‌ విధానం అమలులో భాగంగా ఉద్యోగులను స్థానికత ఆధారంగా సొంత జిల్లాలు, జోన్లు, బహుళ జోన్‌లకు బదలాయించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు(జీవో నం.317) జారీ చేసింది. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వారిని తమ తమ స్థానిక కేడర్ల(పోస్టుల)లో సర్దుబాటు చేయాలని సూచించింది. మొదటగా జిల్లా స్థాయిలో ఉద్యోగుల బదలాయింపులుంటాయని, ఆ తర్వాత జోనల్‌, బహుళ జోన్ల బదలాయింపులు జరుగుతాయని తెలిపింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ లేని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో (వరంగల్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి) తక్షణమే ప్రక్రియ ప్రారంభమవుతుందని.. హైదరాబాద్‌ మినహా మిగతా ఐదు ఉమ్మడి జిల్లాల్లో కోడ్‌ అనంతరం చేపట్టనున్నట్లు పేర్కొంది. ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాలతో వచ్చే దరఖాస్తుల ఆధారంగా సీనియారిటీ ప్రాతిపదికన వారిని కొత్త స్థానాలకు కేటాయించనున్నారు. 70 శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం గల వారికి, మనోవైకల్యం గల పిల్లలున్నవారికి, కారుణ్య నియామకాల్లో పనిచేస్తున్న వితంతువులు, క్యాన్సర్‌, న్యూరోసర్జరీ, మూత్రపిండాలు, కాలేయ మార్పిడి, గుండె శస్త్రచికిత్స జరిగిన వారికి కేటాయింపుల్లో ప్రాధాన్యమిస్తారు. భార్యాభర్తల కేటగిరీని సైతం పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ప్రక్రియ కోసం అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు ఈ నెల ఎనిమిదో తేదీలోగా ఉద్యోగుల సీనియారిటీ జాబితాలను సమర్పించాలని ప్రభుత్వం మరో ఉత్తర్వును జారీ చేసింది. 2018 రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా అమల్లోకి వచ్చిన కొత్త జోనల్‌ విధానం కార్యాచరణపై ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధ్యక్షతన టీఎన్జీవో, టీజీవో సంఘాలతో జరిగిన సమావేశంలో ఖరారైన విధివిధానాలకు అనుగుణంగా ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఉద్యోగుల బదలాయింపు కోసం కమిటీలు ఏర్పాటయ్యాయి. జిల్లా స్థాయి పోస్టులకు ఉమ్మడి జిల్లా కేంద్రం కలెక్టర్‌ నేతృత్వంలో జిల్లా ఉన్నతాధికారులు సభ్యులుగా కమిటీ ఉంటుంది.

జోనల్‌, బహుళ జోనల్‌ పోస్టులకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో సంబంధిత ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ముఖ్యకార్యదర్శి/కార్యదర్శి, శాఖాధిపతులు, సీనియర్‌ సలహాదారు, ఇతర ఉన్నతాధికారులు సభ్యులుగాకమిటీ ఉంటుంది.

కేటాయింపుల సమయంలో గుర్తింపు గల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఒక్కొక్కరిని కమిటీలు ఆహ్వానించవచ్చు.

ఈ కమిటీలు బదలాయింపుల కోసం ఐఎఫ్‌ఎంఐఎస్‌ పోర్టల్‌ను ఉపయోగించుకుంటాయి. తుది కేటాయింపుల అనంతరం ఈ జాబితాను సంబంధిత కార్యదర్శి, శాఖాధిపతికి పంపితే వారు దీనికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేస్తారు.

ఉత్తర్వులకు అనుగుణంగా అన్ని శాఖలు తమ తమ పరిధిలోని ఉద్యోగుల సీనియారిటీ జాబితాను రూపొందించాలి. సెలవు, దీర్ఘకాలిక సెలవు, సస్పెన్షన్‌, శిక్షణ, డిప్యుటేషన్‌లో ఉన్న వారి వివరాలు సైతం చేరాలి.  

హైదరాబాద్‌ మినహా... తొమ్మిది ఉమ్మడి జిల్లాల విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన జిల్లాల ఉద్యోగులను ఉమ్మడి జిల్లా పరిధిలోని పోస్టులలోనే సర్దుబాటు చేస్తారు.

పరిపాలనావసరాలుంటే...
పరిపాలనావసరాలు, ఇతర సందర్భాలుంటే ఆయా ఉద్యోగులకు నిబంధనలు సడలించి అవసరమైన కేడర్‌లో ప్రభుత్వం నియమిస్తుంది.

దరఖాస్తు నమూనా పత్రం..
బదలాయింపుల కోసం ఉద్యోగులు తమ పేరు, గుర్తింపు సంఖ్య, లింగం, కేటగిరి(ఎస్సీ,ఎస్టీ), శాఖ, హోదా, బదలాయింపు ఎక్కడికి, ప్రత్యేక కేటగిరిలో ఉన్నారా? దీనికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను జతచేస్తూ సంతకం చేసి దరఖాస్తు చేసుకోవాలి.

సీనియారిటీ జాబితా కోసం..
సీనియారిటీ జాబితా నమూనాను ప్రభుత్వం నిర్దేశించింది. ఉద్యోగి, పాత జిల్లా/జోనల్‌/బహుళ జోన్‌, ప్రస్తుత జిల్లా/జోన్‌, శాఖ, హోదా, పేరు, పుట్టిన తేదీ, లింగం, ఐడీ, కేటగిరీ(ఎస్సీ/ఎస్టీ), ఫోన్‌ నంబరు, సీనియారిటీ సంఖ్యను పేర్కొనాలని కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం సూచించింది.

జోన్‌లలో: ఉమ్మడి రాష్ట్రంలో అమల్లో ఉన్న అయిదో జోన్‌ పరిధిలోని ఉద్యోగులు ప్రస్తుతం ఉన్న ఒకటి నుంచి నాలుగు కొత్త జోన్ల (నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, సిద్దిపేట మినహాయించి) పరిధిలోకి బదలాయించేందుకు అర్హులు.

పూర్వపు ఆరో జోన్‌ (జనగామ మినహాయించి) ఉద్యోగులు ప్రస్తుత ఐదు, ఆరు, ఏడు జోన్లలో.. రెండో జోన్‌లోని నిజామాబాద్‌, మూడో జోన్‌లోని కామారెడ్డి, మెదక్‌, పూర్వ మెదక్‌ జిల్లాలలోని సిద్దిపేటలను పరిగణనలోకి తీసుకుంటారు.  
బహుళ జోన్‌లలో: ఉమ్మడి రాష్ట్రంలోని అయిదో జోన్‌ ఉద్యోగులు ప్రస్తుత మొదటి బహుళ జోన్‌ పరిధిలోకి, ఉమ్మడి రాష్ట్రంలోని నాలుగో జోన్‌ పరిధిలోని ఉద్యోగులు రెండో బహుళ జోన్‌ పరిధిలోకి వస్తారు.

బదలాయింపుల సందర్భంగా ఎవరు ఏ కేటగిరీలోకి వస్తారనేది ఉద్యోగులకు తెలిసేలా ప్రదర్శించాలి.

జిల్లా, జోన్‌, బహుళ జోన్‌లలోని వారు నిర్దేశిత నమూనా పత్రం(ఫాం)తో గడువులోగా సొంత జిల్లా, జోన్‌, బహుళ జోన్‌లలో బదలాయింపుల కోసం తమ జిల్లా/జోనల్‌/రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. అందులో ప్రాధాన్యాలను పేర్కొనాలి.  

జిల్లా, జోనల్‌/బహుళ జోనల్‌ బదలాయింపుల కోసం ఏర్పాటైన కమిటీలు తమకు వచ్చిన దరఖాస్తుల ఆధారంగా కేటాయింపుల కోసం జాబితాను రూపొందించాలి. పోస్టుల కంటే ఎక్కువ సంఖ్యలో వినతులు వస్తే.. సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలి.

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను ప్రస్తుతం ఉన్న సంఖ్యలోని పోస్టుల మేరకు కేటాయింపులకు పరిగణనలోకి తీసుకుంటారు.

బదలాయింపు వల్ల నష్టపోయానని ఎవరైనా ఉద్యోగి భావిస్తే సంబంధిత శాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలి. దానిని ప్రభుత్వం పరిశీలిస్తుంది.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని