‘ప్రత్యేక విభాగాల్లో’ని సర్వీసునూ పరిగణించాలి

సివిల్‌ పోలీసు కానిస్టేబుల్‌ సీనియారిటీ జాబితా తయారీలో గతంలో వారు ఏపీ స్పెషల్‌ పోలీసు బెటాలియన్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వు విభాగాల్లో అందించిన సర్వీసును పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని మంగళవారం హైకోర్టు స్పష్టం చేసింది. స్పెషల్‌ పోలీసు, ఆర్మ్‌డ్‌ రిజర్వు నుంచి సివిల్‌ పోలీసులుగా వచ్చినవారికి

Published : 26 Jan 2022 06:10 IST

సివిల్‌ పోలీసు కానిస్టేబుల్‌ ‘సీనియారిటీ’పై హైకోర్టు తీర్పు

ఈనాడు, హైదరాబాద్‌: సివిల్‌ పోలీసు కానిస్టేబుల్‌ సీనియారిటీ జాబితా తయారీలో గతంలో వారు ఏపీ స్పెషల్‌ పోలీసు బెటాలియన్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వు విభాగాల్లో అందించిన సర్వీసును పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని మంగళవారం హైకోర్టు స్పష్టం చేసింది. స్పెషల్‌ పోలీసు, ఆర్మ్‌డ్‌ రిజర్వు నుంచి సివిల్‌ పోలీసులుగా వచ్చినవారికి సీనియారిటీ వెయిటేజీ కల్పిస్తూ 2018 ఫిబ్రవరి 6న తీసుకువచ్చిన జీవో 19ని గతానికి వర్తింపజేయరాదంటూ తీర్పు వెలువరించింది. ఆయా విభాగాల నుంచి 10 శాతం కోటా కింద 2018 తరువాత సివిల్‌ పోలీసు దళంలోకి వచ్చినవారికే ఈ జీవో వర్తిస్తుందని తెలిపింది. జీవో 19ని సవాలు చేస్తూ దాఖలైన, అందులో ప్రతివాదులుగా చేర్చాలంటూ మరికొందరు దాఖలు చేసిన పలు పిటిషన్లపై సుదీర్ఘ వాదనలను విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ తీర్పు వెలువరించింది.  పిటినర్ల తరఫున న్యాయవాది కె.ఆర్‌.ప్రభాకర్‌ తదితరులు వాదనలు వినిపించారు. ‘‘స్పెషల్‌ బెటాలియన్‌లో కానిస్టేబుళ్లుగా 10 నుంచి 15 ఏళ్లు, తరువాత ఆర్మ్‌డ్‌ రిజర్వులో అయిదేళ్లకుపైగా సర్వీసు అందించినా.. జీవో 19 కారణంగా సీనియారిటీని కోల్పోతున్నాం. గత సర్వీసులో ప్రతి రెండేళ్లకు ఏడాది చొప్పున గరిష్ఠంగా ఏడేళ్లు మాత్రమే వెయిటేజీ లభిస్తోంది. తద్వారా సివిల్‌ పోలీసు విభాగంలో మా కంటే జూనియర్లకు హెడ్‌కానిస్టేబుల్‌ పదోన్నతులు లభిస్తున్నాయి’’ అని పిటిషనర్లు తెలిపారు.  ఆర్మ్‌డ్‌ రిజర్వు నుంచి 10 శాతం కోటా కింది బదిలీపై సివిల్‌లోకి వస్తుండటంతో సీనియారిటీ దక్కక తాము అవకాశాలు కోల్పోతున్నామని నేరుగా నియమితులైనవారి తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం ఆర్మ్‌డ్‌ రిజర్వు నుంచి సివిల్‌ పోలీసు శాఖలోకి ఏ ఉత్తర్వులు ఆధారంగా నియమితులయ్యారో దాని ప్రకారమే సీనియారిటీని లెక్కించి పదోన్నతులు కల్పించాలని తెలిపింది. జీవో 19 విడుదల కంటే ముందు ఇలా బదిలీ అయిన వారికి ఆ ఉత్తర్వును వర్తింపజేయడం సరికాదని స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని