భూసార పరీక్షకు కాసుల్లేవాయె!

నాకు 5 ఎకరాల భూమి ఉంది. ఏటా పంటలు సాగు చేస్తున్నాను. కానీ భూసార పరీక్షల కోసం వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న జడ్చర్లలోని ప్రయోగశాలకు మట్టి నమూనాలు తీసుకెళ్లాలని చెబుతున్నారు. అంతదూరం ఖర్చులు పెట్టుకుని నాలాంటి పేద రైతులు ఎలా వెళ్లగలరు?

Updated : 27 Jun 2022 06:08 IST

కేంద్ర నిధులు రాలేదు.. రాష్ట్రమూ ఇవ్వలేదు

మూతపడిన 16 ప్రయోగశాలలు

రసాయన ఎరువుల వినియోగం తగ్గేదెలా?

వంద కిలోమీటర్ల దూరం మట్టి నమూనాలు ఎలా తీసుకెళ్లాలి?

నాకు 5 ఎకరాల భూమి ఉంది. ఏటా పంటలు సాగు చేస్తున్నాను. కానీ భూసార పరీక్షల కోసం వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న జడ్చర్లలోని ప్రయోగశాలకు మట్టి నమూనాలు తీసుకెళ్లాలని చెబుతున్నారు. అంతదూరం ఖర్చులు పెట్టుకుని నాలాంటి పేద రైతులు ఎలా వెళ్లగలరు? మాకు దగ్గర్లోని కొల్లాపూర్‌లో ప్రయోగశాలను మూసివేశారు. భూమిలో ఏ పోషకాలు ఎంత ఉన్నాయో తెలియకుండానే పంటలకు తోచిన ఎరువులు చల్లుతున్నాను. రైతులకు దగ్గరగా భూసార ప్రయోగశాలలు పెడితే ప్రయోజనకరంగా ఉంటుంది.

- బాలపీరు, రైతు, ముప్పిడిగుండం గ్రామం, నాగర్‌కర్నూల్‌ జిల్లా

భూమితల్లి ఆరోగ్యాన్ని కాపాడే భూసార పరీక్షలు రాష్ట్రంలో దాదాపు నిలిచిపోయాయి. మట్టి పరీక్షలకు అవసరమైన రసాయనాల కొనుగోలుకు కేంద్రం నిధులు నిలిపివేసింది. రాష్ట్ర వ్యవసాయశాఖ కూడా నిధులివ్వలేదు. ప్రస్తుత వానాకాలం సాగుకు ముందే భూసార పరీక్షలు చేయాలి. కానీ ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రెండువేల మట్టి నమూనాలు మాత్రమే తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు లక్షల నమూనాలు తీయాలనుకున్నా నిధుల్లేక సాధ్యం కాలేదు. భూసార పరీక్షల ఆధారంగా రసాయన ఎరువులను వినియోగించడం వల్ల పంటలకు, రైతులకు ఎంతో మేలు జరుగుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రచారం చేస్తున్నారు. కానీ మట్టి నమూనాలు ఎవరు తీసుకెళ్లాలి, ఎక్కడ పరీక్షలు చేయాలనేవి కీలక సమస్యలుగా మారాయి.

కొత్త జిల్లాల కేంద్రాల్లో ఎలా?

రాష్ట్రంలో 44 భూసార పరీక్షల ప్రయోగశాలలున్నాయి. వీటిలో 16 వ్యవసాయ మార్కెట్లలో ఉన్న ప్రయోగశాలలు మూతపడ్డాయి. కొల్లాపూర్‌ (నాగర్‌కర్నూల్‌ జిల్లా), ఇంద్రవెల్లి (ఆదిలాబాద్‌), నిర్మల్‌ జిల్లా కేంద్రం, మంచిర్యాల, పెద్దపల్లి, మంథని (పెద్దపల్లి), వేములవాడ (రాజన్న సిరిసిల్ల), జగిత్యాల, కామారెడ్డి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, సూర్యాపేట, జనగామ, ఏటూరు నాగారం (ములుగు), సత్తుపల్లి (ఖమ్మం), కేసముద్రం (మహబూబాబాద్‌) వ్యవసాయ మార్కెట్లలో ఉన్న ప్రయోగశాలలు సిబ్బంది, రసాయనాలు లేక మూతపడ్డాయి. వాస్తవానికి అన్ని జిల్లా కేంద్రాల్లో వ్యవసాయశాఖ ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలి. కానీ కొత్తగా జిల్లా కేంద్రాలుగా మారిన కామారెడ్డి, గద్వాల, సూర్యాపేట, నారాయణపేట, జనగామ, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, నిర్మల్‌ వంటి పట్టణాల్లో ప్రయోగశాలలు ఏర్పాటు చేయలేదు. ఆ ప్రాంతాల్లోని వ్యవసాయ మార్కెట్లలో ఉన్నవాటికైనా నిధులివ్వడంలేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మాత్రమే భూసార పరీక్ష కేంద్రాలు పనిచేస్తున్నాయి. మిగతావి కొన్ని వ్యవసాయ మార్కెట్లలో నడుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10వేల గ్రామాల్లో ప్రతి గ్రామం నుంచి కనీసం 20 మట్టి నమూనాలు సేకరించి పరీక్షించాలంటే రూ.4 కోట్లు అవసరమని అంచనా. ఈ నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినా ఫలితం లేకపోయింది.


కేంద్రం ఇస్తేనే చేస్తారా?

కేంద్రం 2015-16 నుంచి 2018-19 దాకా ప్రత్యేకంగా ‘భూసార పరీక్షల కార్డు’ పథకాన్ని అమలు చేసింది. తరువాత దాన్ని ఆపేసింది. ఈ ఏడాది ‘భూమి పోషణ అభియాన్‌’ అనే పథకాన్ని అమలు చేస్తామని కేంద్రం చెప్పింది. దానికి రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రతిపాదనలు పంపినా నిధులేమీ విడుదల కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా భూసార పరీక్షలపై దృష్టి పెట్టలేదు. దీంతో ఏ ఎరువు ఎంత వాడాలో రైతులకు చెప్పే అవకాశం లేకుండా పోయింది. అయిదేళ్ల కిందట గ్రామస్థాయిలో ప్రతి వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో) స్థాయిలోనే మట్టి నమూనాలను పరీక్షించాలని మినీ సాయిల్‌ టెస్ట్‌ కిట్‌లను ఇచ్చారు. వీటితో పరీక్షించాలంటే ప్రతి 100 మట్టి నమూనాలకు రూ.20 వేల విలువైన రసాయనాలను వినియోగించాలి. ఆ సొమ్ము ఇచ్చేవారు లేక కిట్‌లను ఏఈవోలు మూలన పడేశారు.

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని