సేద్యానికి పగలే కరెంటు ఇవ్వండి

వ్యవసాయ బోర్లకు రోజూ పగటిపూట మాత్రమే కరెంటు సరఫరా చేయాలని కేంద్ర విద్యుత్‌ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 07 Sep 2023 04:58 IST

ఆగస్టులో విద్యుత్‌ డిమాండు 23 శాతం పెరుగుదల
ఇది ప్రపంచ రికార్డు: కేంద్రం  
ఉత్పత్తిని మరింత పెంచాలని రాష్ట్రాలకు ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: వ్యవసాయ బోర్లకు రోజూ పగటిపూట మాత్రమే కరెంటు సరఫరా చేయాలని కేంద్ర విద్యుత్‌ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యాహ్నం వేళ సౌర విద్యుదుత్పత్తి అధికంగా ఉంటుందని, ఆ సమయంలో వ్యవసాయానికి సరఫరా చేయడం ద్వారా దేశంలో విద్యుత్‌ డిమాండును తీర్చడానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. ఆగస్టులో రోజువారీ విద్యుత్‌ డిమాండులో 23% పెరుగుదల నమోదైంది. ఇది ప్రపంచ రికార్డు. ఈ నెల ఒకటిన కూడా దేశవ్యాప్తంగా జాతీయ విద్యుత్‌ డిమాండు పగటిపూట 2.41 లక్షల మెగావాట్లకు, రాత్రిపూట 2.18 లక్షల మెగావాట్లకు చేరింది. ఈ స్థాయిలో పెరుగుతున్న డిమాండును తీర్చడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో ముఖ్యాంశాలు...

  • దేశంలో ఆగస్టులో ఏడు రోజులపాటు రోజూ సగటున 500 కోట్ల యూనిట్ల కరెంటు వినియోగం నమోదైంది. మొత్తం 16 రోజులపాటు రోజూ 2.20 లక్షల మెగావాట్లకు పైగా డిమాండు ఏర్పడింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 23% అదనం. ఈ స్థాయి డిమాండును తీర్చలేక కొన్ని రాష్ట్రాల్లో కరెంటు కోతలు విధించారు.
  • ప్రధానంగా వర్షాలు లేక రాత్రి సమయంలో పెరిగిన ఉక్కపోతలతో ఏర్పడిన డిమాండు మేర కరెంటు సరఫరా చేయడానికి 10 వేల మెగావాట్ల వరకు జాతీయస్థాయిలో కొరత ఏర్పడింది.
  • పగటిపూట సైతం డిమాండు భారీగానే పెరిగినా... సౌర విద్యుదుత్పత్తితో కొరత 0.1 శాతమే ఉంటోంది. రాత్రిపూట సౌర విద్యుదుత్పత్తి లేక పోవడంతో కొరత అధికంగా ఉంటోంది.
  • ఈ ఏడాది వర్షాలు సరిగా లేకపోవడంతో విద్యుత్‌ డిమాండు రికార్డు స్థాయిలో పెరిగింది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ప్రధానంగా తెలంగాణ, ఏపీ, తమిళనాడుల్లో జలవిద్యుదుత్పత్తి గణనీయంగా తగ్గింది.
  • ఒక్క తెలంగాణలోనే గత ఏడాదితో పోలిస్తే ఆగస్టులో 140 కోట్ల యూనిట్ల జలవిద్యుదుత్పతి తగ్గింది. ఇలా దేశవ్యాప్తంగా గత ఏడాదితో పోలిస్తే 500 కోట్ల యూనిట్ల జలవిద్యుదుత్పత్తి లేకపోవడంతో డిమాండుకు తగినట్లుగా కరెంటు సరఫరా కష్టంగా మారింది.
  • దేశవ్యాప్తంగా పవన విద్యుదుత్పత్తి ప్లాంట్ల స్థాపిత సామర్థ్యం 43,900 మెగావాట్లుంటే మూడు వేల మెగావాట్లే ఉత్పత్తి అవుతోంది.
  • గ్యాస్‌ కొరతతోనూ విద్యుదుత్పత్తి 25 వేల మెగావాట్లకు 8,700 మెగావాట్లే ఉంది. గ్యాస్‌ ఆధారిత ఉత్పత్తి కేంద్రాలతో కొనుగోలు ఒప్పందాలున్న రాష్ట్రాలు పూర్తిస్థాయిలో కరెంటు ఉత్పత్తి జరిగేలా చూడాలి. తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌ తాజాగా ఇలాంటి చర్యలు తీసుకున్నాయి.

బొగ్గు దిగుమతి చేసుకోండి

సెప్టెంబరులోనూ వర్షాలు పెద్దగా కురిసే అవకాశాలు లేనందున విద్యుత్‌ డిమాండు ఇంకా పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా రాష్ట్రాల్లో దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంచడంతోపాటు విదేశాల నుంచి సైతం దిగుమతి చేసుకోవాలి. బొగ్గు నాణ్యత సరిగా లేకపోవడం, ఇతర సాంకేతిక కారణాలతో థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల్లో సామర్థ్యానికన్నా 14 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి తక్కువగా ఉంటోంది. దీన్ని పెంచాలి.


ఎంత పెరిగినా నిరంతర సరఫరా చేస్తున్నాం
- దేవులపల్లి ప్రభాకర్‌రావు, సీఎండీ, తెలంగాణ ట్రాన్స్‌కో-జెన్‌కో

తెలంగాణలో రోజువారీ విద్యుత్‌ డిమాండు రికార్డుస్థాయిలో 14,700 మెగావాట్లు దాటింది. అయినా ఆగస్టులో ఏకంగా రూ.1150 కోట్లు వెచ్చించి ఇంధన ఎక్స్ఛేంజిలో అదనంగా కరెంటు కొని ప్రజలకు 24 గంటలూ సరఫరా చేశాం. కేంద్రం జారీచేసిన ఉత్తర్వులపై సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. తెలంగాణలో 24 గంటలూ వ్యవసాయానికి కరెంటు ఇచ్చి తీరాలని ఆదేశించారు. ఎక్కడా కోతల్లేకుండా అన్ని వర్గాలకు తెలంగాణలో మాత్రమే నిరంతర కరెంటు సరఫరా చేస్తున్నాం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు