వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్‌ ప్రదానం

మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్‌ పురస్కారం అందుకున్నారు.

Published : 23 Apr 2024 05:13 IST

పద్మశ్రీ అందుకున్న దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, కేతావత్‌ సోమ్లాల్‌
మొత్తం 66 మందికి పద్మ అవార్డులు అందించిన రాష్ట్రపతి ద్రౌపదీముర్ము

ఈనాడు, దిల్లీ: మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్‌ పురస్కారం అందుకున్నారు. ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, జైశంకర్‌ తదితర ప్రముఖులు అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ముగ్గురికి పద్మ విభూషణ్‌, 8 మందికి పద్మ భూషణ్‌, 55 మందికి పద్మశ్రీ కలిపి మొత్తం 66 పురస్కారాలను ప్రదానం చేశారు. ఇందులో అందరికంటే ముందుగా వెంకయ్యనాయుడికి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ అందించారు. వెంకయ్యనాయుడికి గౌరవ సూచకంగా రాష్ట్రపతి తాను నిలుచునే వేదిక నుంచి ముందుకు వచ్చి ఆయనకు అవార్డును అందజేశారు. సులభ్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడు బిందేశ్వర్‌ పాఠక్‌కు(మరణానంతరం) ప్రకటించిన పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని ఆయన సతీమణి అమోలా పాఠక్‌ అందుకున్నారు. ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రహ్మణ్యం కూడా పద్మ విభూషణ్‌ స్వీకరించారు. సినీనటుడు మిథున్‌ చక్రవర్తి, గాయకురాలు ఉషా ఉతుప్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ రామ్‌ నాయక్‌, పారిశ్రామికవేత్త సీతారామ్‌ జిందాల్‌లు పద్మభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే తెలంగాణకు చెందిన దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, కేతావత్‌ సోమ్లాల్‌ పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించినవారికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది మొత్తం ఐదుగురికి పద్మవిభూషణ్‌, 17మందికి పద్మభూషణ్‌, 110 మందికి పద్మశ్రీ కలిపి మొత్తం 132 మందికి పౌర పురస్కారాలు ప్రకటించింది. అందులో 66 మందికి సోమవారం అవార్డులు అందించారు. మిగిలినవారికి మరో విడత ప్రదానం చేయనున్నారు. అందులో సినీనటుడు చిరంజీవి పద్మవిభూషణ్‌ అందుకోనున్నారు.


ఎన్నడూ ఊహించలేదు

-వెంకయ్యనాయుడు

నకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేసినందుకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు దేశానికి తాను ఎంతో రుణపడి ఉంటానని చెప్పారు. ‘‘నెల్లూరు జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన రైతు బిడ్డను ఇంత అత్యున్నత పురస్కారానికి అర్హుడిగా గుర్తిస్తారని నేను ఎన్నడూ ఊహించలేదు. సుదీర్ఘ ప్రజాజీవితంలో నాకు ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. ఆ కష్టాలన్నింటినీ అధిగమించి, రాజ్యాంగపరంగా రెండో అత్యున్నత పీఠమైన ఉప రాష్ట్రపతి స్థాయికి చేర్చిన ఘనత అంతా ఆ దేవుడికే చెందుతుంది. ఈ అవార్డును ప్రజాజీవితంలో నేను కట్టుబడిన విలువలకు, సమాజానికి నా వంతు చేసిన సేవలకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాను. ఇందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తుదిశ్వాస వరకూ దేశసేవలో నిమగ్నమై ఉండాలన్నదే నా సంకల్పం’’ అని అవార్డును స్వీకరించిన అనంతరం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని