పులికి దారి ఇచ్చి.. గిరిజనం ఊరు విడిచి

దశాబ్దాలుగా అడవితల్లితో ఉన్న అనుబంధాన్ని వదులుకుని భారమైన హృదయాలతో బయటకు వచ్చారు ఆదివాసీలు. కవ్వాల్‌ పెద్దపులుల సంరక్షణ కేంద్రం పరిధిలో పెద్దపులి, ఇతర జంతువులు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అటవీ ప్రాంతాన్ని వదిలి మైదాన ప్రాంతానికి రావాలని అటవీశాఖ పిలుపునిచ్చింది.

Published : 03 May 2024 06:24 IST

కవ్వాల్‌ పరిధిలో పునరావాస ప్రక్రియ పూర్తి

ఈనాడు, హైదరాబాద్‌- కడెం, న్యూస్‌టుడే: దశాబ్దాలుగా అడవితల్లితో ఉన్న అనుబంధాన్ని వదులుకుని భారమైన హృదయాలతో బయటకు వచ్చారు ఆదివాసీలు. కవ్వాల్‌ పెద్దపులుల సంరక్షణ కేంద్రం పరిధిలో పెద్దపులి, ఇతర జంతువులు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అటవీ ప్రాంతాన్ని వదిలి మైదాన ప్రాంతానికి రావాలని అటవీశాఖ పిలుపునిచ్చింది. ఈ మేరకు నిర్మల్‌ జిల్లా కడెం మండలం మైసంపేట, రాంపూర్‌ గ్రామాలు అడవిని వీడాయి. వీరికి పునరావాసం కల్పించే ప్రక్రియను ఐదేళ్ల క్రితం చేపట్టారు. మొత్తం 142 కుటుంబాలకు రెండు రకాల ప్యాకేజీ ప్రకటించారు.

మొదటిది పునరావాసం లేకుండా రూ.15 లక్షలు ఇవ్వడం. రెండోది ఇల్లు, 2 ఎకరాల 32 గుంటల సాగుభూమి కేటాయించడం. నగదు ప్యాకేజీని 48 కుటుంబాలు తీసుకున్నాయి. రెండో ప్యాకేజీలో భాగంగా 94 కుటుంబాలకు కడెం మండలం కొత్తమద్దిపడిగ శివారులో రోడ్లు, మురుగుకాలువలు, నీటివసతి, పాఠశాల ఇలా అన్ని సౌకర్యాలతో కాలనీ నిర్మించారు. రాంపూర్‌, మైసంపేటల నుంచి 35, 25 కి.మీ. దూరంలో ఉన్న కొత్తమద్దిపడిగకు పది రోజులుగా గిరిజన కుటుంబాలను తరలిస్తున్నారు. పశువుల కొట్టాలు, పందిళ్ల కర్రలనూ తెచ్చుకుని కొత్తకాలనీలో కొట్టాలు నిర్మించుకునేందుకు అనుమతివ్వడంతో ప్రస్తుతం ఖాళీ చేసిన గ్రామాల్లో మొండిగోడలే దర్శనమిస్తున్నాయి. ఇంతకాలం మారుమూలన ఉన్న గిరిజనులకు రహదారి, విద్యుత్‌ సహా అనేక సదుపాయాలు చేరువ కానున్నాయి.


కవ్వాల్‌తోపాటు అమ్రాబాద్‌లో..
పీసీసీఎఫ్‌ డోబ్రియాల్‌

కవ్వాల్‌ పులుల అభయారణ్యం నుంచి 94 కుటుంబాల తరలింపు ప్రక్రియ గురువారం పూర్తయ్యిందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్‌) ఆర్‌ఎం డోబ్రియాల్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. అభయారణ్యం కోర్‌ఏరియాలోని మిగతా గ్రామాలతోపాటు అమ్రాబాద్‌ పులుల అభయారణ్యంలోని నాలుగు పునరావాస గ్రామాల తరలింపు ప్రక్రియను త్వరలోనే చేపడతామని వెల్లడించారు. అటవీ జంతువుల సంరక్షణకు గ్రామాలను ఖాళీ చేసి పునరావాసాన్ని కల్పించడం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే మొదటిసారి అని, ఇందుకు రూ.14.2 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని