మహోగ్ర‘మే’

రాష్ట్రంలో వారం రోజులుగా ఠారెత్తిస్తున్న ఎండలు గురువారం కూడా కొనసాగాయి. ఉదయం ఎనిమిది గంటలకే మొదలైన భానుడి ఉగ్రప్రతాపం.. సాయంత్రం ఐదున్నర వరకూ కొనసాగింది.

Updated : 03 May 2024 06:54 IST

8 జిల్లాల్లో 46 డిగ్రీలపైన గరిష్ఠ ఉష్ణోగ్రత
నల్గొండ జిల్లాలో 46.6..
80 మండలాల్లో వడగాలులు
ఎండదెబ్బతో నలుగురి మృతి
ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
ఏపీలోనూ భానుడి ప్రతాపం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వారం రోజులుగా ఠారెత్తిస్తున్న ఎండలు గురువారం కూడా కొనసాగాయి. ఉదయం ఎనిమిది గంటలకే మొదలైన భానుడి ఉగ్రప్రతాపం.. సాయంత్రం ఐదున్నర వరకూ కొనసాగింది. ఏకంగా 8 జిల్లాల్లో 46 నుంచి 46.6 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేటలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.6 డిగ్రీలు రికార్డయింది. సూర్యాపేట, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్‌, నాగర్‌కర్నూల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో 46 డిగ్రీలపైన నమోదయ్యాయి. నిర్మల్‌, గద్వాల, సిరిసిల్ల, యాదాద్రి, ఆసిఫాబాద్‌, ములుగు, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, భూపాలపల్లి, హనుమకొండ, మహబూబాబాద్‌ జిల్లాల్లోని పలు మండలాల్లో 45.1 నుంచి 45.8 డిగ్రీల వరకు ఎండ కాసింది.

పెరిగిన వడగాలుల తీవ్రత

వారం రోజులుగా కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో ఉంటుండటంతో వడగాలులు వీస్తున్నట్లు వాతావరణశాఖ ప్రకటిస్తోంది. సాధారణం కన్నా 4.5 డిగ్రీల నుంచి 6.4 డిగ్రీలపైన ఉష్ణోగ్రత పెరిగితే వడగాలులుగా రికార్డు చేస్తారు. ఒక ప్రాంతంలో 45 డిగ్రీల సెల్సియస్‌ దాటినా వడగాలుల ప్రభావం ఉన్నట్లు పరిగణనలోకి తీసుకుంటారు. గురువారం 19 జిల్లాల్లోని 80 మండలాల్లో వీచాయి. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలు ఎండల ధాటికి చిగురుటాకులా వణికిపోతున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో గురువారం 17 మండలాల్లో, నల్గొండ జిల్లాలో 14 మండలాల్లో వడగాలులు వీచాయి.

6వ తేదీ తరువాత ఉపశమనం

రాష్ట్రంలో ఎండల తీవ్రత ఆదివారం వరకు ఉంటుంది. వాతావరణ మార్పుల కారణంగా ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. సాధారణం కన్నా రెండు డిగ్రీల వరకు పెరిగాయి. 6వ తేదీ నుంచి కొంత ఉపశమనం దొరికే అవకాశాలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నాం.

 నాగరత్న, డైరెక్టర్‌, వాతావరణశాఖ, హైదరాబాద్‌

కుప్పకూలుతున్న రైతులు, కూలీలు

కొల్చారం, బెజ్జూరు, శంకరపట్నం, నడికూడ, న్యూస్‌టుడే: మెదక్‌ జిల్లా కొల్చారం మండల కేంద్రానికి చెందిన కుమ్మరి శాఖయ్య(55) 15 రోజులుగా మామిడికాయలు కోసి టంకర ఎండబెడుతున్నారు. గురువారం సొమ్మసిల్లి పడిపోవడంతో వెంటనే మెదక్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. కుమురం భీం జిల్లా బెజ్జూరు మండలం గబ్బాయికి చెందిన పోర్తెటి శ్రీనివాస్‌(47) రెండు రోజుల క్రితం ఓ వివాహ వేడుకకు వెళ్లి అస్వస్థతకు గురయ్యారు. గురువారం పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతిచెందారు. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం లింగాపూర్‌లో గజ్జెల సంజీవ్‌(50) హమాలీగా పని చేస్తూ వడదెబ్బకు గురయ్యారు. ఇంట్లోనే చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందారు. హనుమకొండ జిల్లా నడికూడ మండలం రాయపర్తికి చెందిన వ్యవసాయ కూలీ అల్లె గోవర్ధన్‌(65) వడదెబ్బకు గురై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతిచెందారు.


ప్రకాశం జిల్లాలో 47.1 డిగ్రీల నమోదు 

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: భగభగ మండే ఎండలతో ఆంధ్రప్రదేశ్‌ నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1, మార్కాపురంలో 47 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా బనగానపల్లిలో 46.7, నెల్లూరు జిల్లా వేపినాపి అక్కమాంబపురంలో 46.6 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 14 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. 33 మండలాల్లో తీవ్ర వడగాలులు, 188 మండలాల్లో వడగాలులు వీచాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని