రాహిల్‌ బెయిల్‌ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో హిట్‌ అండ్‌ రన్‌ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహిల్‌ను అరెస్ట్‌ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది.

Published : 23 Apr 2024 04:05 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో హిట్‌ అండ్‌ రన్‌ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహిల్‌ను అరెస్ట్‌ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. జూబ్లీహిల్స్‌ రోడ్డు ప్రమాదం కేసులో ఓ చిన్నారి మృతి చెందగా.. కారు ప్రమాదానికి కారణమైన ముగ్గురు పారిపోయారు. కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉండగా.. తానే వాహనాన్ని నడిపినట్లు ఒకరు లొంగిపోయారు. ఈ కేసులో రాహిల్‌ పాత్ర ఉందని పోలీసులకు సమాచారం అందడంతో అతన్ని నిందితుడిగా చేర్చారు. దీంతో తనపై కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలంటూ హైకోర్టును రాహిల్‌ ఆశ్రయించి.. మధ్యంతర బెయిల్‌ పొందాడు. బెయిల్‌ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రమాదం జరిగిన సమయంలో రాహిల్‌ కారు నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం ఉందన్నారు. అయితే పోలీసుల ఎదుట మరో వ్యక్తి లొంగిపోయేలా చేసి.. రాహిల్‌ తప్పించుకున్నాడన్నారు. అరెస్ట్‌ చేయరాదని ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ పోలీసులు దురుద్దేశపూరితంగా వ్యవహరిస్తున్నారని, 2022 నాటి కేసును తిరగదోడి రాహిల్‌ను వేధిస్తున్నారని తెలిపారు. దర్యాప్తునకు సహకరించడానికి రాహిల్‌ సిద్ధంగా ఉన్నాడన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి నిర్ణయాన్ని ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని