ఓట్ల ప్రయాణంలో.. నోట్ల దోపిడీ

ఏపీఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీ అన్న తేడా లేదు. ఏపీ వైపు వెళ్లే అన్ని బస్సుల్లో రిజర్వేషన్లు అయిపోయాయి. రైళ్లలో నెల క్రితమే అయిపోయి.. వెయిటింగ్‌ లిస్టులు వందలు దాటేశాయి.

Updated : 08 May 2024 06:51 IST

10, 11 తేదీల్లో ఏపీ, టీఎస్‌ఆర్టీసీల బస్సుల కిటకిట
ఇదే అదనుగా ప్రైవేటు ట్రావెల్స్‌ అడ్డగోలు ధరలు
హైదరాబాద్‌-విశాఖ స్లీపర్‌ బస్‌ టికెట్‌ రూ.4 వేలకుపైనే..

ఈనాడు, హైదరాబాద్‌: ఏపీఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీ అన్న తేడా లేదు. ఏపీ వైపు వెళ్లే అన్ని బస్సుల్లో రిజర్వేషన్లు అయిపోయాయి. రైళ్లలో నెల క్రితమే అయిపోయి.. వెయిటింగ్‌ లిస్టులు వందలు దాటేశాయి. పలు రైళ్లలో ఏకంగా రిగ్రెట్‌కు వెళ్లిపోయాయి. ఇక మిగిలిన ఆధారం ప్రైవేటు బస్సులే. వచ్చే సోమవారం ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని పలు ముఖ్య ప్రాంతాల నుంచి ఏపీ వైపు ఈ వారాంతంలో భారీగా ప్రయాణాలు ఉన్నాయి. ఈ రద్దీని ప్రైవేటు ట్రావెల్స్‌ యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. అడ్డగోలుగా ఛార్జీలు పెంచేస్తున్నారు. హైదరాబాద్‌-విశాఖపట్నం ప్రైవేటు స్లీపర్‌ బస్సు టికెట్‌ ధర ప్రస్తుతం రూ.4వేలు దాటేసింది.

ఆ 2 రోజులు అధిక ప్రయాణాలు

హైదరాబాద్‌లోని చాలామంది ఉద్యోగులు శుక్ర, శనివారాల్లో ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఇరు రాష్ట్రాల ఆర్టీసీలు పదుల సంఖ్యలో ప్రత్యేక బస్సులు పెట్టినా అన్నింట్లో టికెట్లు నిండుకున్నాయి. ఏసీ, సూపర్‌లగ్జరీ, అల్ట్రా డీలక్స్‌ బస్సులు ఎన్ని వేసినా నిండిపోతున్నాయి. ఇంకా అదనంగా నడిపేందుకు బస్సుల్లేకపోవడంతో ఏపీఎస్‌ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌లనూ సిద్ధం చేస్తోంది. అలాగే బెంగళూరు నుంచి విజయవాడకు 10వ తేదీన ప్రత్యేక బస్సులు కూడా కలిపి 21 సర్వీసులు ఉంటే ఒక్క సీటూ మిగల్లేదు. 11న ఉంచిన 16 బస్సులు కూడా నిండిపోవడంతో మరో ప్రత్యేక సర్వీసును ఆన్‌లైన్‌లో అందుబాటులో పెట్టారు.  

ఛార్జీలపై నియంత్రణ ఏది?

సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నంకు బస్సు ప్రయాణం 12 గంటలకుపైగా పడుతుండటంతో ఏసీ స్లీపర్‌ బస్సులకు డిమాండు ఏర్పడింది. దీంతో ప్రైవేటు ఆపరేటర్లు వెనుక సీటు, ముందు సీటు, కింది బెర్తూ అంటూ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కొన్ని బస్సుల్లో లోయర్‌బెర్తుకు రూ.4,566గా నిర్ణయించారు. ఈ అడ్డగోలు దోపిడీ రహస్యంగా ఏమీ సాగడం లేదు. వెబ్‌సైట్ల ద్వారా బహిరంగంగానే నడుస్తోంది. రవాణాశాఖ అధికారులు నియంత్రణ చర్యలు తీసుకుంటున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు