గ్రామీణ భారతంపై ఉదాసీనత

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2024 ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్లో విశేషాలు చాలానే ఉంటాయని దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసింది. వివిధ వర్గాలకు ఎడాపెడా వరాలు ఇచ్చేస్తారని కొందరు ఆశించారు. చివరకు జనాకర్షణ బాట పట్టకుండా నిర్మలమ్మ బడ్జెట్‌ దేశాన్ని వృద్ధి పథంలో నడిపించడంపైనే దృష్టి కేంద్రీకరించింది.

Published : 04 Feb 2023 00:23 IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2024 ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్లో విశేషాలు చాలానే ఉంటాయని దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసింది. వివిధ వర్గాలకు ఎడాపెడా వరాలు ఇచ్చేస్తారని కొందరు ఆశించారు. చివరకు జనాకర్షణ బాట పట్టకుండా నిర్మలమ్మ బడ్జెట్‌ దేశాన్ని వృద్ధి పథంలో
నడిపించడంపైనే దృష్టి కేంద్రీకరించింది.

ప్రపంచ ఆర్థికం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో తాజా కేంద్ర బడ్జెట్‌ వచ్చింది. భారత ఆర్థిక పునాదులు బలంగానే ఉన్నా- ఇతర దేశాల్లో సంభవిస్తున్న ప్రాదేశిక, రాజకీయ, ఆర్థిక పరిణామాల ప్రభావం నుంచి ఇండియా పూర్తిగా తప్పించుకోలేదు. స్వదేశంలోనూ పెట్టుబడుల వాతావరణం ప్రోత్సాహకరంగా లేదు. ప్రపంచ విపణిలో గిరాకీ తగ్గినందువల్ల ఎగుమతుల్లో ఆశించిన వృద్ధి కనిపించడం లేదు. ఇన్ని ప్రతికూలాంశాల మధ్యా భారత జీడీపీ నిరుడు వృద్ధి సాధించింది. ప్రపంచంలో అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. 2023-24 బడ్జెట్‌ కేటాయింపులను ఈ కోణం నుంచే పరిశీలించాలి.

ప్రభుత్వ వ్యయం

సంక్షోభ పరిస్థితుల్లోనూ భారత్‌ ఆర్థిక పథంలో పరుగు తీస్తూనే ఉండాలంటే ప్రభుత్వ పెట్టుబడులు ఇంధనంగా పనిచేయాలని ఎన్‌డీఏ సర్కారు గుర్తించింది. ప్రభుత్వ వ్యయం ఆర్థిక కార్యకలాపాలకు ఊపు తీసుకొస్తుంది. బడ్జెట్లో రూ.10 లక్షల కోట్లను పెట్టుబడి వ్యయంగా కేటాయించడం ఈ దిశగా పడిన సరైన అడుగుగా భావించవచ్చు. దీనికి అదనంగా రాష్ట్రాలకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద బడ్జెట్లో రూ.3.7 లక్షల కోట్లను కేటాయించారు. రైల్వే శాఖకు పెట్టుబడి వ్యయం కింద రూ.2.40 లక్షల కోట్లు ప్రత్యేకించారు. 2013-14 రైల్వే బడ్జెట్‌తో పోలిస్తే ఇది తొమ్మిది రెట్లు. ఈ నిధులన్నింటినీ ఉత్పాదకతను పెంచే విధంగా వెచ్చించి ఆశించిన ఫలితాలు సాధించడం ముఖ్యం. ఉదాహరణకు రైల్వేస్టేషన్ల సుందరీకరణపై కన్నా రైల్వేట్రాక్‌ల ఆధునికీకరణకే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వ పెట్టుబడులు, వ్యయాలు ఆర్థికాభివృద్ధిని ఇనుమడింపజేసినప్పుడు ప్రైవేటు పెట్టుబడులూ ప్రవహిస్తాయి. బడ్జెట్‌పై వేతన జీవులు పెట్టుకున్న ఆశలను ఎంతవరకూ తీర్చారన్నది మరో ముఖ్యాంశం. 2014 నుంచి మారకుండా ఉన్న వ్యక్తిగత ఆదాయపన్ను శ్లాబులను, రేట్లను ఈసారైనా మారుస్తారని జనం ఎదురుచూశారు. ఇంతవరకూ వేతనజీవులకు అయిదు లక్షల రూపాయల దాకా పన్ను లేకుండా చూసుకునే సౌలభ్యం ఉండేది. తాజా బడ్జెట్లో దాన్ని ఏడు లక్షల రూపాయలకు పెంచడంవల్ల మధ్యతరగతి చేతిలో కొంత డబ్బు ఆడుతుంది. ఆ మొత్తాన్ని పొదుపు చేసినా లేదా కొనుగోళ్లకు వినియోగించినా ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనకరమే. అయిదు లక్షల రూపాయలు, అంతకు మించిన ఆదాయాలపై సర్‌చార్జీని తగ్గించడం ఎన్నదగిందే. సర్‌చార్జి తగ్గింపు వల్ల సంపన్న వర్గాల ఆదాయ పన్ను రేటు 42.7శాతం నుంచి 39శాతానికి తగ్గినట్లు లెక్క. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు, మహిళలు, హస్తకళాకారులకు రాయితీలు ఇవ్వడం ద్వారా వివిధ వర్గాలను ఆకట్టుకోవడానికి బడ్జెట్‌ ప్రయత్నించింది.

తాజా కేంద్ర పద్దులో ఆయా కేటాయింపుల ద్వారా అభివృద్ధికి ఊపు తీసుకురావాలని సర్కారు భావించింది. ఇది అభినందనీయమే. అదే సమయంలో కొన్ని రంగాలను బడ్జెట్‌ విస్మరించిందనే విమర్శలూ వచ్చాయి. ముఖ్యంగా గ్రామీణ రంగానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడాన్ని నిపుణులు తప్పుపట్టారు. బడ్జెట్లో గ్రామీణాభివృద్ధికి కేటాయించిన రూ.2.38 లక్షల కోట్లు అరకొరే అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తం ప్రభుత్వ వ్యయంలో గ్రామీణాభివృద్ధికి కేటాయింపులు నిరుటికన్నా కేవలం 0.1శాతమే పెరిగాయి. గతంలో దేశాన్ని సంక్షోభాలు చుట్టుముట్టినప్పుడు ఆదుకొన్నది గ్రామీణ ఆర్థిక వ్యవస్థేనని గుర్తించాలి. పల్లెపట్టుల్లో ఆదాయాలు పడిపోతే పారిశ్రామిక ఉత్పత్తులు, సేవలకు గిరాకీ సన్నగిల్లుతుంది. పరిశ్రమలు దెబ్బతిని ఉపాధి అవకాశాలు హరించుకుపోతాయి.

పెట్టుబడులకు ప్రాధాన్యం

బ్యాంకు రుణాల్లో పెరుగుదల దేశంలో పెట్టుబడులు జోరందుకుంటున్నాయని సూచిస్తోందని, అది అభివృద్ధికి సంకేతమని కేంద్ర బడ్జెట్‌ అభివర్ణించింది. వాస్తవం మాత్రం వేరుగా ఉంది. బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణాలు పెరుగుతున్నాయే తప్ప పరిశ్రమలకు పెట్టుబడి పరపతి అధికం కావడం లేదు. అంటే బ్యాంకు రుణాలను ఉత్పత్తి పెంపునకు కాకుండా వ్యక్తిగత వినియోగం కోసం తీసుకునేవారు ఎక్కువయ్యారు. ఆర్థిక వ్యవస్థ దివ్యంగా ఉంటుందని భరోసా కల్పించి పెట్టుబడిదారులను ఆకర్షించాలి. అలాగే తీసుకున్న రుణాలను పరిశ్రమలు సవ్యంగా తీరుస్తాయనే భరోసాను బ్యాంకులకు కల్పించాలి.అది జరిగినప్పుడు రుణాలు తీసుకుని పెట్టుబడులు పెట్టి పరిశ్రమలను, తద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించడానికి అనువైన వాతావరణం ఏర్పడుతుంది. విదేశీ వాణిజ్యం పరంగా బడ్జెట్‌ రక్షణాత్మక ధోరణిని ప్రదర్శించింది. ఆర్థికంగా ఆచితూచి అడుగులు వేసింది. పెట్టుబడులు పెంచడానికి ప్రాధాన్యమిచ్చింది. కేటాయించిన నిధులను సక్రమంగా ఖర్చుచేసి, బడ్జెట్‌ లక్ష్యాలను సాధించడానికి పటిష్ఠ కార్యాచరణ జరగడమే అత్యంత కీలకం.


* ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి వీలుగా పెట్రోలు, డీజిల్‌పై పన్నులు తగ్గించడానికి, జీఎస్‌టీ రేట్ల క్రమబద్ధీకరణకు తాజా బడ్జెట్లో ఎలాంటి ప్రతిపాదనలూ లేవు. పైగా ఆహారం, ఎరువులు, పెట్రో రాయితీలకు గతంతో పోలిస్తే భారీగా కోత విధించారు.

* కొవిడ్‌, ద్రవ్యోల్బణం, పంటల వైఫల్యం వల్ల ఆర్థికంగా కుదేలైన గ్రామసీమలపై బడ్జెట్‌ శీతకన్ను వేసిందని చెప్పాలి. ఇది స్థూల ఆర్థిక వ్యవస్థకు మేలు చేయదు.

* గ్రామాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తాజా బడ్జెట్లో కేటాయింపులను 32శాతం మేర తగ్గించడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి అధిక నిధులు కేటాయించాలని ఎన్‌డీఏ సర్కారు ప్రతిపాదించింది. తీరా కొత్త బడ్జెట్లో కోత పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అరకొర కేటాయింపులతో గ్రామీణులకు 100 రోజుల పని చూపడం సవాలుగా మారుతుంది. ఉపాధి లేక రాబడి తగ్గిపోయి ఆదాయపరంగా అసమానతలు పెరగడం సమాజానికి మంచిది కాదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.