వికసిత భారతానికి మోదీ గ్యారంటీ

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు ప్రధానంగా ‘మోదీ గ్యారంటీ’పైనే జరుగుతున్నాయి. 2014 ఎన్నికల తీర్పు ప్రజల ఆకాంక్షకు, 2019 నాటి తీర్పు విశ్వాసానికి అద్దం పడితే, 2024 ఎన్నికల ఫలితాలు ‘మోదీ గ్యారంటీ’ని ప్రతిబింబిస్తాయని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీయే చెప్పారు. ఇది ఎన్నికల ప్రణాళిక, హామీలకు సంబంధించినది మాత్రమే కాదు.

Published : 03 May 2024 01:25 IST

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు ప్రధానంగా ‘మోదీ గ్యారంటీ’పైనే జరుగుతున్నాయి. 2014 ఎన్నికల తీర్పు ప్రజల ఆకాంక్షకు, 2019 నాటి తీర్పు విశ్వాసానికి అద్దం పడితే, 2024 ఎన్నికల ఫలితాలు ‘మోదీ గ్యారంటీ’ని ప్రతిబింబిస్తాయని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీయే చెప్పారు. ఇది ఎన్నికల ప్రణాళిక, హామీలకు సంబంధించినది మాత్రమే కాదు. దశాబ్దకాలంగా వివిధ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూర్చిన రికార్డు మాకుంది. అదెంత విశ్వసనీయమైనదనేది జాతి జనులే నిర్ణయించనున్నారు.

కొవిడ్‌-19 విసిరిన కఠిన సవాళ్లను మనమెలా అధిగమించామో గడచిన అయిదేళ్లుగా యావద్దేశం చూస్తూనే ఉంది. సరైన ఆర్థిక విధానాలు, సంస్కరణల ద్వారా దేశార్థికం ఏడు శాతం వృద్ధిరేటుతో దూసుకుపోతోంది. నాడు బలహీన స్థితిలో కొట్టుమిట్టాడిన దేశార్థికం నేడు ప్రపంచంలోనే తొలి అయిదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా వెలుగొందుతోంది. సమీప భవిష్యత్తులోనే మూడో స్థానాన్ని ఆక్రమించేందుకు ఉవ్విళ్లూరుతోంది.

ఒత్తిళ్లను అధిగమించి...

మా పాలనలో నివాస ప్రాంతాలు, పట్టణాలు, రాష్ట్రాల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో విశేషమైన మార్పు వచ్చింది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. సులభతర వ్యాపార విధానాలు, రుణాలు, బ్యాంకింగ్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా అవకాశాలెన్నో అందుబాటులోకి వచ్చాయి. పేదలు, యువకులు, రైతులు, మహిళలు... ఇలా సమాజంలోని ప్రతి ఒక్కరికీ ‘సమ్మిళిత అభివృద్ధి’ ఫలాలు అందివచ్చాయి. సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అనేక రకాలుగా వారికి లబ్ధి చేకూరుస్తున్నాయి. ముఖ్యంగా నిత్యావసరాలు, ఆరోగ్య సేవలు, అల్పాదాయ వర్గాలకు గృహాలు, తాగునీరు, విద్యుత్తు, గ్యాస్‌ సిలిండర్లు దరిచేరుతున్నాయి. స్వయం ఉపాధికి, మహిళలకు, అన్నదాతలకు రుణాలివ్వడంతో పాటు వారి గృహావసరాలనూ తీర్చాలని లక్షించాం. డిజిటల్‌ పంపిణీ వ్యవస్థను తీసుకురావడంవల్ల మునుపటి ‘లీకేజీ’లకు అడ్డుకట్ట పడింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక వసతుల నిర్మాణం వంటి అంశాల్లో సమర్థంగా ముందుకు వెళ్ళడంవల్ల భారత్‌ మునుపటి కంటే ఇప్పుడు మరెంతో భద్రంగా ఉంది.

ఈ పరంపరలోనే- దేశాన్ని ‘వికసిత భారత్‌’గా అవతరింపజేసేందుకు ‘మోదీ గ్యారంటీ’ మార్గ నిర్దేశనం చేస్తుంది. మరో అయిదేళ్లపాటు నిరుపేదలకు ఉచితంగా రేషన్‌ అందజేస్తామని, మూడు కోట్ల గృహాలను నిర్మిస్తామని, ఉచిత విద్యుత్తును అందజేసేందుకు ఇంటి పైకప్పులపై సౌర ఫలకాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తోంది. అంతేకాదు- ఆరోగ్యం, విద్య, మౌలిక వసతులను మరింతగా విస్తరించడంతో పాటు 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత వైద్య సదుపాయాలు అందిస్తామంటోంది. ‘స్వనిధి, విశ్వకర్మ’ వంటి పథకాలను మరింతగా ముందుకు తీసుకువెళ్ళడంతో పాటు మత్స్యకారుల ప్రయోజనాల పరిరక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామంటోంది. కిసాన్‌ కల్యాణ్‌, పంటల బీమా పథకాలను పటిష్ఠీకరించడంతో పాటు చిరు ధాన్యాల సాగుకు, పాడి పరిశ్రమకు, మత్స్య రంగానికి తోడ్పడతామని చెబుతోంది. ‘ఇ-శ్రమ్‌’ పరిధిలోకి మరింత మంది కార్మికులను తీసుకురావడమే కాకుండా, ట్రక్కు డ్రైవర్ల కోసం జాతీయ రహదారుల పక్కన వసతులు కల్పిస్తామంటోంది. మన యువత ఇప్పుడు శక్తిమంతమైన అంకుర సంస్కృతిని అందిపుచ్చుకొనే అవకాశాలున్నాయి. వారికోసమనే, ముద్రా యోజన కింద ఇచ్చే రుణాలను రూ.20లక్షలకు పెంచుతామంటోంది. మరింతమంది మహిళలను లక్షాధికారులను చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తామంటోంది... ‘మోదీ గ్యారంటీ’! అయితే ఇవన్నీ జరిగేది- దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు మరింతగా విస్తరించి, తయారీ రంగం దూకుడు పెంచి, వ్యవసాయ ఉత్పత్తులు జోరందుకున్నప్పుడే!

‘భారత్‌లో తయారీ’ ఏ విధంగా పురోగమించిందో... కొత్త వ్యాపార, ఉపాధి అవకాశాలను ఎలా సృష్టించిందో యావద్దేశం ఇప్పటికే పరికించింది. ఇకపై ఇవి ఇనుము, సిమెంటు, అల్యూమినియం, రైల్వే, రక్షణ, ఔషధ, ఎలెక్ట్రిక్‌ వాహనాలు(ఈవీ), మొబైల్‌ ఫోన్లు వంటి రంగాల్లోనూ విస్తరించనున్నాయి. సరైన ఆర్థిక, విదేశీ విధానాల ఫలితంగా నేడు ఇండియా రూపకల్పన(డిజైన్‌), ఆవిష్కరణ(ఇన్నొవేషన్‌), తయారీ రంగాల ప్రపంచ కేంద్రంగా అవతరించేందుకు సిద్ధంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్లు, ఎలెక్ట్రిక్‌ కార్లు, డ్రోన్లు, అంతరిక్ష పరిశోధనలు, పునరుత్పాదక ఇంధన వనరులు వంటి రంగాలకు చెందిన పరిశ్రమలెన్నో తమకు అనుకూలమైన స్థానాల కోసం ఎదురుచూస్తున్నాయి. మన దగ్గర నిపుణ యువతకు కొదవలేదు. మౌలిక వసతులు, సుపరిపాలన సైతం ఉన్నాయి కాబట్టి, పరిశ్రమలను స్థాపించాలనుకొనే వారిని మనం ఆకర్షించే అవకాశముంది. కొవిడ్‌ ఉద్ధృతి వేళ పెద్దయెత్తున టీకాల ఉత్పత్తి చేపట్టడం, 5జీ సాంకేతికతను స్వయంగా అభివృద్ధి చేసుకోవడం, నగదు రహిత యూపీఐ చెల్లింపులను అందుబాటులోకి తీసుకురావడం, చంద్రయాన్‌-3 మిషన్‌ను విజయవంతం చేయడం ద్వారా భారత్‌ తన నూతన సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పింది.

ఎగుమతుల్లోనూ పురోగతి నమోదు చేశాం. నిరుడు భారతీయ ఎగుమతులు సుమారు రూ.64 లక్షల కోట్లకు చేరాయి. అంటే దానర్థం మరింత మందికి ఉపాధి అవకాశాలు అందివచ్చి, కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాయన్న మాట! భారత్‌ నేడు ప్రపంచ యవనికపై గౌరవాభిమానాలు పొందుతోంది. ‘జీ20’ కూటమికి విజయవంతంగా సారథ్యం వహించాం. జాతి ప్రయోజనాలకు విరుద్ధమైన ఒత్తిళ్లను సమర్థంగా అధిగమించాం. ‘భారత్‌ ఫస్ట్‌’ విధానానికి కట్టుబడి క్వాడ్‌, ఐఎంఈసీ వంటి సమూహాలతో జతకట్టాం. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో మా ప్రభుత్వ వైఖరి ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందింది.

మన ఎన్నికల వైపు ప్రపంచం చూపు...

ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్‌లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలను నిశితంగా గమనిస్తున్నాయి. ఈ ఎన్నికలు తదుపరి ప్రభుత్వ ఏర్పాటునే కాకుండా... ‘వికసిత భారత్‌’ కోసం దేశం సాగిస్తున్న అన్వేషణ సాఫల్యతనూ నిర్ణయిస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. యుద్ధాలు, ఉద్రిక్తతలు, విభజనలు, అప్పులు ప్రపంచాన్ని ముసురుకున్న ప్రస్తుత తరుణంలో- భారత్‌కు శక్తిమంతమైన, మంచి అనుభవమున్న నాయకత్వ మార్గనిర్దేశనం అవసరం. స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు పూర్తిచేసుకునే 2047వ సంవత్సరం కోసం మనకో ‘విజన్‌’ ఉంది. దాన్ని క్షేత్రస్థాయిలో సాకారం చేసుకోవడానికి 24 గంటలూ సుపరిపాలన కావాలి. ‘మోదీ గ్యారంటీ’ అనేది దశాబ్ద కాలంపాటు సాధించిన విజయాల ట్రాక్‌ రికార్డును దీనితో అనుసంధానించే ప్యాకేజీ. భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకోవాల్సిన కీలక సమయంలో- దేశానికి ఎవరి మార్గనిర్దేశం అవసరమో, ఎవరిని విశ్వసించాలో మనమంతా బాగా ఆలోచించాలి!


విదేశాల్లో నిబ్బరంగా...

మునుపటి కంటే ఇప్పుడు భారతీయులు పెద్ద సంఖ్యలో విదేశాలకు వెళ్తున్నారు. చదువు, ఉద్యోగం, పర్యటన కోసం పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా మోదీ ప్రభుత్వం పాస్‌పోర్ట్‌ కేంద్రాల సంఖ్యను 77 నుంచి 527కు తీసుకెళ్ళింది. అయితే, విదేశాలకు వెళ్ళిన భారతీయులకు భద్రత కల్పించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం. మోదీ ప్రభుత్వం సరిగ్గా దానిపైనే దృష్టి కేంద్రీకరించింది. అందుకు ప్రత్యేకంగా నిధిని కేటాయించడంతో పాటు సర్కారీ వనరులన్నింటినీ వినియోగించడం ద్వారా రెస్క్యూ ఆపరేషన్లు చేపడుతోంది. విదేశాల్లో రాయబార కార్యాలయాలను పెంచేందుకు ప్రణాళికలు రచించింది. ఇటువంటి చర్యలవల్ల విదేశాల్లోని భారతీయులకు మరింత భద్రత, మద్దతు లభిస్తున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు