ఏఐ శకంలో కొత్త ఒరవడి

వేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ (ఏఐ) పరిజ్ఞానం సమాజాలను, పరిశ్రమలను సమూలంగా మార్చనుంది. రాబోయే రోజుల్లో అన్ని ఉత్పత్తులు, సేవలను ఏఐ ఆధారిత సాధనాలు, రోబోలే అందిస్తాయని టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ తాజా అంచనా. కొత్త ఏఐ లోకంలో నెగ్గుకొచ్చేలా మన విద్యార్థులు, యువతను సన్నద్ధం చేయాలి.

Published : 25 May 2024 00:26 IST

వేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ (ఏఐ) పరిజ్ఞానం సమాజాలను, పరిశ్రమలను సమూలంగా మార్చనుంది. రాబోయే రోజుల్లో అన్ని ఉత్పత్తులు, సేవలను ఏఐ ఆధారిత సాధనాలు, రోబోలే అందిస్తాయని టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ తాజా అంచనా. కొత్త ఏఐ లోకంలో నెగ్గుకొచ్చేలా మన విద్యార్థులు, యువతను సన్నద్ధం చేయాలి. ప్రాథమిక దశనుంచే పాఠ్య ప్రణాళికలలో ఏఐని అంతర్భాగంగా చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించగల వీలుంది.

ప్రపంచంలో అతిపెద్ద విద్యావ్యవస్థలలో భారత్‌ ఒకటి. మన దేశంలో సుమారు 15 లక్షల పాఠశాలలు, దాదాపు 39 వేల కళాశాలలు, విశ్వవిద్యాలయాలు 26 కోట్లమందిదాకా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతున్నాయి. ఏఐ, సాంకేతికతలను బోధనలో అంతర్భాగంగా చేర్చాలని జాతీయ విద్యావిధానం నిర్దేశించింది. జాతీయ విద్యా సాంకేతికత వేదిక (ఎన్‌ఈటీఎఫ్‌)ను నెలకొల్పాలని సిఫార్సు చేసింది. నీతి ఆయోగ్‌ చేపట్టిన ‘అందరికీ ఏఐ’ కార్యక్రమం విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌ కోర్సుల ద్వారా దీన్ని నేర్పాలని తలపెట్టింది. సీబీఎస్‌ఈ పాఠశాలల్లో ఏఐ ఐచ్ఛికాంశంగా ఉంది. ఐఐటీలు, ఐఐఎంలు ప్రత్యేక ఏఐ కోర్సులను అందిస్తున్నాయి. టెక్‌ కంపెనీలు, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల సహకారంతో ఏఐ విద్యా బోధన, పరిశోధనను కొత్త శిఖరాలకు తీసుకెళ్ళవచ్చు. ప్రభుత్వం ఏఐ పరిశోధన-అభివృద్ధికి నిధులు కేటాయిస్తోంది. స్కిల్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా పథకాలు ఏఐ శిక్షణకు ప్రాధాన్యమిస్తున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాలకు ఏఐ శిక్షణ అందుబాటులో లేదు. ఏఐని నేర్పించగల బోధకులు, శిక్షకులకు తీవ్ర కొరత నెలకొంది.

పాఠ్య ప్రణాళికల నుంచే...

విద్యార్థులకు తార్కిక విశ్లేషణ సామర్థ్యాన్ని, సమస్యా పరిష్కార శక్తిని అలవరచి, నైతికంగా సరైన నిర్ణయాలు తీసుకోగలిగేలా తీర్చిదిద్దాలి. దీనితోపాటు ఏఐ బోధన, శిక్షణతో భావి ఉపాధి మార్కెట్‌లో నెగ్గుకొచ్చేలా సంసిద్ధం చేయాలి. దీనికి విద్యా వ్యవస్థలోనే పునాది వేయాలి. అమెరికా, బ్రిటన్, సింగపూర్‌ల మాదిరిగా పటిష్ఠమైన ఏఐ పాఠ్యప్రణాళికలను రూపొందించి, ఏఐ బోధనకు గణనీయంగా నిధులు కేటాయించాలి. ఉపాధ్యాయులకు శిక్షణ కల్పించాలి. ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులు చేపట్టాలి. మన పాఠ్య ప్రణాళికలను సమూలంగా సంస్కరించాలి. ప్రాథమిక విద్య స్థాయిలోనే పిల్లలకు సమస్యా పరిష్కార నైపుణ్యాలను, కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని నేర్పాలి. గేమ్స్, ఇంటరాక్టివ్‌ సాధనాల ద్వారా ఏఐ, అధునాతన సాంకేతికతలను పరిచయం చేయాలి. మాధ్యమిక విద్యలో కోడింగ్, డేటా సాక్షరత, ప్రాథమిక ఏఐ భావనలను ప్రవేశపెట్టాలి. ఉన్నత విద్యలో ఏఐ, మెషీన్‌ లెర్నింగ్, డేటా సైన్స్‌ కోర్సులను అందించాలి. ఆరోగ్యం, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణకు ఏఐని ఎలా ఉపయోగించాలన్నది బోధించాలి. ఉపాధ్యాయులు తరగతి గదుల్లో సమర్థంగా ఏఐని బోధించేలా శిక్షణ ఇవ్వాలి. పాఠశాలలకు అంతర్జాలం, కంప్యూటర్లు, ఏఐ సాఫ్ట్‌వేర్‌ను సమకూర్చాలి. అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ల్యాబ్‌లు ఏర్పాటుచేసి ప్రయోగాల సాయంతో నేర్పాలి. తరగతి గదుల్లో నవ కల్పనల కోసం అంకుర సంస్థల సహకారాన్ని ఆహ్వానించాలి. పరిశ్రమల నిపుణులు విద్యార్థుల్లో ఆసక్తిని రేకెత్తించేలా కార్యక్రమాలు చేపట్టాలి.

ఏఐ విద్యను ప్రోత్సహిస్తూ, అవసరమైన నిధులు కేటాయించడం ప్రభుత్వ బాధ్యత. ఇందుకు అవసరమైన విధివిధానాలను అమలు చేయాలి. ఏఐలో విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దకపోతే నిరుద్యోగం పెరుగుతుంది. ఏఐ పరిజ్ఞానం లేని ఉన్నత విద్యావంతులు కూడా చిన్నాచితకా ఉద్యోగాలతో సరిట్టుకోవాల్సి వస్తుంది. అది సమాజంలో ఆర్థిక అంతరాలను పెంచుతుంది. భారత్‌ అంతర్జాతీయంగా పోటీ పడలేని దుస్థితిలోకి జారిపోతుంది. ఏఐ లేనిదే శాస్త్ర సాంకేతిక రంగాల్లో నవకల్పనలను సాధించడమూ అసాధ్యమవుతుంది. రేపటి సామాజిక సమస్యలను సైతం పరిష్కరించలేని అశక్తత నెలకొంటుంది. వివిధ రంగాల్లో ఉత్పాదకత పడిపోతుంది. జీవన నాణ్యత క్షీణిస్తుంది.

అందిపుచ్చుకొంటే అద్భుత ప్రగతి

కృత్రిమ మేధ ప్రపంచమంతటా విద్యార్థులు, అధ్యాపకుల మధ్య వారధిగా నిలుస్తోంది. మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకూ అధునాతన విద్య నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఆరోగ్యం, వ్యవసాయం, స్థానిక పాలనకు ఏఐ గొప్ప చేయూతనివ్వగలదు. ఏఐ సామర్థ్యం ఉన్నవారికి ఫైనాన్స్, వినోదం, రవాణా రంగాలలో ఉపాధి, వ్యాపార అవకాశాలు లభిస్తాయి. నిపుణులు వృత్తి ఉద్యోగాలలో రోజువారీ విధులను ఏఐకి అప్పగించి సృజనాత్మకతను పెంపొందించుకునే అవకాశం ఏర్పడుతుంది. ప్రాథమిక దశ నుంచే ఏఐలో ప్రావీణ్యం సంపాదించే విద్యార్థులు కాలక్రమంలో తామే వ్యవస్థాపకులుగా ఎదుగుతారు. కాబట్టి భారతీయ విద్యావ్యవస్థలో ఏఐని అంతర్భాగం చేయడం తప్పనిసరి. ఆ పని చేయకుంటే ప్రపంచంలో భారత్‌ సాంకేతికంగా, ఆర్థికంగా, రక్షణపరంగా వెనకబడిపోతుంది. ఏఐని ఉత్సాహంగా అందిపుచ్చుకొంటే భారత్‌ ప్రగతికి ఆకాశమే హద్దు.


ఎక్కడెక్కడ  ఏముంది?

ఒక తరగతిలో విద్యార్థులందరూ మేధాపరంగా ఒకే స్థాయికి చెందినవారై ఉండరు. కొందరు నెమ్మదిగా నేర్చుకుంటే మరికొందరు వేగంగా అలవరచుకుంటారు. అందరికీ ఒకే రకమైన బోధనా పద్ధతి అంతగా ఉపయుక్తం కాకపోవచ్చు. ఎవరికి తగిన రీతిలో బోధనా పద్ధతిని వారికోసం చేపట్టడానికి ఏఐ ఉపకరిస్తుంది. డ్రీమ్‌బాక్స్, న్యూటన్‌ వంటి కంపెనీలు ఇలాంటి ప్రత్యేక బోధనా కార్యక్రమాలను అందిస్తున్నాయి. డువోలింగో, క్విజ్లెట్‌ వంటి సంస్థలు గేమ్స్‌ సహాయంతో, ఇంటరాక్టివ్‌ సాధనాలతో అభ్యసనాన్ని విద్యార్థులకు ఆహ్లాదకర అనుభవంగా మారుస్తున్నాయి. విద్యార్థులకు గ్రేడ్లు ఇవ్వడం, బోధనా కార్యక్రమాల కాలపట్టికను తయారు చేయడం వంటి కార్యక్రమాలను ఏఐ సాయంతో ఆటొమేట్‌ చేయడంలో గ్రేడ్‌ స్కోప్‌ వంటి ఆన్‌లైన్‌ వేదికలు ముందున్నాయి. కోర్సెరా నిర్వహణా టూల్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. శారీరక, మానసిక లోపాలున్న విద్యార్థుల కోసం మైక్రోసాఫ్ట్‌ ప్రత్యేక లెర్నింగ్‌ టూల్స్‌ను అందిస్తోంది. ఖాన్‌ అకాడమీ ఏఐ సాయంతో విద్యార్థులకు రిమోట్‌ అభ్యసన అవకాశాన్ని అందిస్తోంది. ఉపాధ్యాయులకు అధునాతన ఏఐ శిక్షణ కార్యక్రమాలను అందించడానికి, ఎప్పటికప్పుడు పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి కోర్సెరా తోడ్పడుతోంది. తరగతుల సమర్థ నిర్వహణకు క్లాస్‌ క్రాఫ్ట్‌ అందుబాటులో ఉంది. చదువులో వెనకబడుతున్న విద్యార్థులను ముందుగానే గుర్తించి సకాలంలో వారికి తోడ్పడటానికి బ్రైట్‌ బైట్స్‌ వంటి కంపెనీలు ఏఐ టూల్స్‌ అందిస్తున్నాయి. విద్యారంగంలో పరిశోధన-అభివృద్ధికి, ఏఐ నిరంతర అభ్యసనానికి అవకాశం కల్పిస్తున్న సంస్థలూ ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.