లిథియం వెలికితీత... సమస్యాత్మకం

విద్యుత్తు వాహన (ఈవీ) పరిశ్రమలో లిథియం కీలక భూమిక పోషిస్తోంది. ఇటీవల జమ్మూకశ్మీర్‌లో పెద్దమొత్తంలో లిథియం నిక్షేపాలు వెలుగుచూశాయి. వాటిని వెలికి తీయడంలో పర్యావరణ, సామాజిక సమస్యలెన్నో ఉన్నాయి. వీటిని అధిగమించడం ఎంతో కీలకం.

Published : 04 Mar 2023 00:31 IST

విద్యుత్తు వాహన (ఈవీ) పరిశ్రమలో లిథియం కీలక భూమిక పోషిస్తోంది. ఇటీవల జమ్మూకశ్మీర్‌లో పెద్దమొత్తంలో లిథియం నిక్షేపాలు వెలుగుచూశాయి. వాటిని వెలికి తీయడంలో పర్యావరణ, సామాజిక సమస్యలెన్నో ఉన్నాయి. వీటిని అధిగమించడం ఎంతో కీలకం.

జాతీయ భూవిజ్ఞానశాస్త్ర సంస్థ దేశీయంగా ఇటీవల భారీగా లిథియం నిక్షేపాలను గుర్తించింది. జమ్మూ-కశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంతంలోని రియాసి జిల్లా సలాల్‌ హైమానా ప్రాంతంలో 59 లక్షల టన్నుల లిథియం నిల్వలను ఆ సంస్థ కనుగొంది. లిథియంతో తయారు చేసిన బ్యాటరీలను గాలి మరలు, సౌర ప్యానెళ్లు, విద్యుత్తు వాహనాల్లో (ఈవీ) అధికంగా వినియోగిస్తారు. 2030 నాటికి భారత్‌లోని ప్రైవేటు వాహనాల్లో 30శాతం, వాణిజ్య వాహనాల్లో 70శాతం, ద్విచక్ర, త్రిచక్ర వాహనాల్లో 80శాతం ఈవీలు ఉండేలా చూడాలని కేంద్రం లక్షిస్తోంది. జమ్మూకశ్మీర్‌లో వెలుగు చూసిన లిథియం నిక్షేపాలు ఆ లక్ష్య సాధనకు ఉపకరిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. విద్యుత్తు వాహనాల వినియోగాన్ని పెంచడం వల్ల పర్యావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాలను పెద్దమొత్తంలో తగ్గించవచ్చు.

తీవ్ర సమస్యలు

ప్రపంచబ్యాంకు అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి లిథియం, కోబాల్ట్‌ వంటి అరుదైన లోహాల అవసరం దాదాపు 500శాతం పెరుగుతుంది.2030 నాటికి ప్రపంచ ఈవీల విపణి విలువ ఎనభై వేల కోట్ల డాలర్లకు పైగా ఎగబాకుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. భారత్‌లో నిరుడు ఈవీ పరిశ్రమ విపణి పరిమాణం 321 కోట్ల డాలర్లు. 2029 నాటికి అది దాదాపు 11,400 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. ప్రస్తుతం ఆస్ట్రేలియా, అర్జెంటీనా నుంచి లిథియాన్ని ఇండియా పెద్దమొత్తంలో దిగుమతి చేసుకుంటోంది. లిథియం అయాన్‌ సెల్‌ అవసరాల్లో 70శాతానికి చైనా, హాంకాంగులపైనే ఆధారపడుతోంది. జమ్మూ కశ్మీర్‌లోని లిథియం నిల్వల వల్ల భారతీయ బ్యాటరీ తయారీ పరిశ్రమ భారీగా వృద్ధి చెంది, ఆర్థిక వ్యవస్థకు మేలు కలుగుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఖనిజాల అన్వేషణను మరింత విస్తృతం చేస్తే దేశీయంగా అధిక మొత్తంలో లిథియం నిల్వలు వెలుగు చూసే అవకాశం ఉంది. అయితే, వాటిని భారీగా గుర్తించినంత మాత్రాన సంబరపడటానికి వీల్లేదు. లిథియం వెలికితీతలో ఎన్నో సమస్యలు ఉన్నాయి.

లిథియం తవ్వకాల్లో సామాజిక, పర్యావరణ ఇక్కట్లు అధికంగా ఎదురవుతాయి. అవి ఆ ఖనిజం దొరికే ప్రదేశాలను బట్టి మారుతూ ఉంటాయి. ఉదాహరణకు, ఆస్ట్రేలియాలో లిథియం నిక్షేపాలు ఉన్న ప్రాంతాల్లోని కఠిన శిలలు వంద కోట్ల సంవత్సరాల నుంచి భూకంపాల వంటి సహజ విపత్తులకు దూరంగా, స్థిరంగా ఉన్నాయి. జమ్మూకశ్మీర్‌లో లిథియం నిక్షేపాలు ఉన్న కఠిన శిలలు హిమాలయాల పర్వత శ్రేణుల్లో ఉన్నాయి. ఆ ప్రాంతం తరచుగా భూకంపాల తాకిడికి గురయ్యే అవకాశం ఉంది. అందువల్ల లిథియం వెలికితీతలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక అంచనా ప్రకారం ప్రతి టన్ను లిథియాన్ని వెలికి తీసేటప్పుడు దాదాపు 1.7 లక్షల లీటర్ల నీటి అవసరం ఉంటుంది. దాదాపు 15 టన్నుల బొగ్గుపులుసు వాయువు విడుదలవుతుంది. దానివల్ల వాయు కాలుష్యం సమస్య ఎదురవుతుంది. మృత్తిక, ఉపరితల, భూగర్భ జలాలు సైతం కలుషితమవుతాయి. ఫలితంగా జీవవైవిధ్య నష్టం వంటివి సంభవిస్తాయి. తవ్వకాల వల్ల నీటిలభ్యత క్షీణిస్తుంది. నేల కుంగిపోతుంది. మానవ హక్కుల ఉల్లంఘన తలెత్తడంతోపాటు, సామాజిక సంఘర్షణలకూ అది దారితీస్తుంది.

మెరుగైన పరిష్కారాలు అవసరం

కేవలం శక్తి ఉత్పత్తికే కాకుండా పేదరికం నిర్మూలన, స్థిరమైన అభివృద్ధిని సాధించడం వంటి లక్ష్యాలు ఖనిజాల తవ్వకం ద్వారా నెరవేరాలి. ఖనిజాల వెలికితీతలో స్థానికంగా ఉండే ప్రజలకు ఉపాధి కల్పించకపోతే ఉద్రిక్తతలు తలెత్తుతాయి. అవి కొత్త సామాజిక సమస్యలకు దారితీస్తాయి. ఖనిజాలను వెలికితీసే కంపెనీలు ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలతో ముందుగా ఒప్పందం కుదుర్చుకోవాలి. పర్యావరణ పరిణామాలపై స్థానికంగా విస్తృత అవగాహన కల్పించాలి. జమ్మూకశ్మీర్‌లోని లిథియం నిక్షేపాల వెలికితీతలో స్థానిక సంఘాల పాత్ర ఉంటుందని అక్కడి అధికార యంత్రాంగం వెల్లడించింది. గనుల అభివృద్ధికి సంబంధించిన కొలువుల్లో స్థానికులకే ప్రాధాన్యం దక్కుతుందని వివరించింది. లిథియం నిక్షేపాల తవ్వకం వల్ల వ్యవసాయం, పశుపోషణ, పర్యాటకంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. స్థానిక ప్రజలకు కేవలం గనిలో ఉపాధి కల్పించడం ద్వారానే ఆ నష్టాలను భర్తీ చేయడం సాధ్యం కాకపోవచ్చు. వారికి మరింత మెరుగైన ప్రయోజనం దక్కాలంటే ఏం చేయాలో పాలకులు ఆలోచించాలి. తీవ్రమైన పర్యావరణ, సామాజిక సమస్యలను ముందుగా గుర్తించి వాటికి మెరుగైన పరిష్కారాలను కనుగొనాలి. సామాజిక, పర్యావరణ చట్టాలను దృష్టిలో పెట్టుకొని తవ్వకాల కార్యకలాపాలు సక్రమంగా జరిగేలా పటిష్ఠ చర్యలు తీసుకోవడం తప్పనిసరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.