బాల్యం తప్పటడుగు

చిన్నారులు, టీనేజర్లలో నేర స్వభావం అంతకంతకు పెరుగుతోంది. ఎలెక్ట్రానిక్‌ ఉపకరణాలు, సామాజిక మాధ్యమాల ప్రభావం వారిపై తీవ్రంగా ఉంటోంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని సరైన మార్గంలో నడిపించడం ఎంతో అవసరం. 

Updated : 06 May 2024 04:23 IST

చిన్నారులు, టీనేజర్లలో నేర స్వభావం అంతకంతకు పెరుగుతోంది. ఎలెక్ట్రానిక్‌ ఉపకరణాలు, సామాజిక మాధ్యమాల ప్రభావం వారిపై తీవ్రంగా ఉంటోంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని సరైన మార్గంలో నడిపించడం ఎంతో అవసరం.

‘నాకు మార్కులు వేయకపోతే మా తాత చేత చేతబడి చేయిస్తా’ అంటూ పదో తరగతి జవాబుపత్రంలో ఓ విద్యార్థి మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులను ఉద్దేశించి రాయడం ఇటీవల సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. చదవడానికి ఇది నవ్వు పుట్టిస్తున్నా... దీని వెనక దాగి ఉన్న విద్యార్థి నేర ప్రవృత్తి ఆందోళన రేకెత్తిస్తోంది. తన తల్లితో తరచూ గొడవ పడుతోందన్న ఆగ్రహంతో తెలంగాణలోని జనగామ జిల్లాలో పదమూడేళ్ల బాలుడు నానమ్మను కత్తితో పొడిచాడు. తీవ్రగాయాలపాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. సిగరెట్‌ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టె ఇవ్వలేదన్న అక్కసుతో దిల్లీలో ఇద్దరు టీనేజర్లు ఓ యువకుడిని విచక్షణారహితంగా పొడిచి చంపారు. బాలలు, టీనేజర్లలో నేరస్వభావం పెరుగుతోందనడానికి ఇటువంటి దారుణాలే నిదర్శనం.

చిన్ననాటి నుంచే విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన పిల్లల్లో విషబీజాలు నాటుకుంటున్నాయి. ఆటపాటలతో ఆనందంగా గడపాల్సిన బాలలు, భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాల్సిన టీనేజర్లు నేరాల రొంపిలోకి దిగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. విచక్షణ కోల్పోతున్న కొందరు పిల్లలు చిన్నచిన్న కారణాలకే తమ బంధువులు, ఉపాధ్యాయులు, స్నేహితులు, తోటి విద్యార్థులపై దాడులు, వేధింపులకు పాల్పడుతున్నారు. మరికొందరు హత్యలు, హత్యాయత్నాలకు తెగబడుతున్నారు. తూర్పు దిల్లీలోని పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి సహవిద్యార్థి ప్రైవేటు భాగాల్లో కర్ర చొప్పించి చిత్రహింసలకు గురిచేశాడు. పరీక్షలో తమకు జవాబుపత్రం చూపించలేదన్న ఆగ్రహంతో మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో ముగ్గురు పదో తరగతి విద్యార్థులు తోటి విద్యార్థిపై కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ముగ్గురు 12వ తరగతి విద్యార్థులు తమ అధ్యాపకురాలినే ర్యాగింగ్‌ చేశారు. తమకు మార్కులు తక్కువ వేశారని ఝార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో పలువురు తొమ్మిదో తరగతి విద్యార్థులు లెక్కల మేస్టారును చెట్టుకు బంధించి కొట్టారు. కరోనా సమయానికి సంబంధించిన మధ్యాహ్న భోజనం బకాయిలను ఇవ్వాలంటూ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని దుర్జన్‌పుర్‌ ప్రాంతానికి చెందిన ఓ పాఠశాల విద్యార్థులు- ఉపాధ్యాయులను తరగతి గదిలో బంధించారు. దేశంలో ఎక్కడో ఒకచోట రోజూ ఇటువంటి దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌ వంటి ఎలెక్ట్రానిక్‌ ఉపకరణాలతో పాటు సామాజిక మాధ్యమాలకు బానిసలుగా మారుతుండటంవల్లే బాలల్లో విపరీత ఆలోచనలు, పెడపోకడలు ప్రబలుతున్నాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారత్‌లో చిన్నారులు రోజూ సగటున అయిదు గంటలకు పైగా ఆన్‌లైన్‌ వేదికల్లో గడుపుతున్నారు. 15-16 సంవత్సరాలవారు ఎక్కువగా ఇంటర్నెట్‌కు బానిసలవుతున్నట్లు ‘ఎయిమ్స్‌’ అధ్యయనంలో తేలింది. ఎలెక్ట్రానిక్‌ ఉపకరణాలు, అంతర్జాల వినియోగంవల్ల సుమారు 70శాతం బాలలు దీర్ఘకాలిక మానసిక రుగ్మతలకు గురవుతున్నారని షావోమీ ఇండియా మాజీ సీఈఓ మనుకుమార్‌ జైన్‌ ఆ మధ్య ఆందోళన వ్యక్తం చేశారు. 5-6 సంవత్సరాల బాలల్లో 7.6శాతం, 10-14 ఏళ్లవారిలో 13.5శాతం, 15-18 ఏళ్ల టీనేజర్లలో 14.7శాతం మానసిక సమస్యలతో సతమతమవుతున్నట్లు ‘ప్రపంచ మానసిక ఆరోగ్య సంస్థ-2022’ నివేదిక వెల్లడించింది. పిల్లల్లో పెరిగిపోతున్న దూకుడు స్వభావం, మానసిక రుగ్మతలు వారిని హింసాత్మక ఘటనలకు పురిగొల్పుతున్నాయి. నేరస్థులుగా మార్చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2012-22 మధ్య బాలలు, టీనేజర్లపై 3.50 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత పదేళ్ల నుంచి వారిపై ఏటా 30వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

చిన్నవయసులోనే అఘాయిత్యాలకు పాల్పడుతున్న పిల్లల మానసిక దృక్పథాన్ని మార్చాల్సింది- వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే. ఎలెక్ట్రానిక్‌ పరికరాలను ఎక్కువగా వాడకుండా ఇంట్లో తల్లిదండ్రులు కట్టడి చేయాలి. కేవలం పాఠ్యాంశాలకే వినియోగించేలా... అశ్లీల చిత్రాలు, హింసాత్మక ఘటనలు చూడకుండా, ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడకుండా డిజిటల్‌ ఉపకరణాల్లోని సెట్టింగ్స్‌ మార్చాలి. వాటిని అధికంగా ఉపయోగించడం వల్ల కలిగే అనర్థాల గురించి బడుల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా టీవీలు, ఫోన్లకు అతుక్కుపోకూడదు. ఖాళీ సమయంలో వారికి నీతికథలు చెప్పాలి. పుస్తకాలు చదివించాలి. తోటి స్నేహితులతో కలిసి ఆడుకునేలా ప్రోత్సహించాలి. సృజనాత్మక కార్యక్రమాల్లో వారిని నిమగ్నం చేయాలి. ఇటువంటి చర్యలే పిల్లల భవిష్యత్తును బంగారుమయం చేస్తాయి.

ఏలేటి ప్రభాకర్‌రెడ్డి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.