ప్రాణాలు తోడేస్తున్న నిర్లక్ష్యం

ఇండియాలో దశాబ్ద (2011-21) కాలంలో విద్యుత్‌ ప్రమాదాల్లో లక్ష మందికి పైగా మరణించారు. రోడ్డు ప్రమాదాల తరవాత పెద్దసంఖ్యలో ప్రాణనష్టం వీటివల్లే సంభవిస్తోంది. విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యానికి తోడు ప్రభుత్వాల విధానపరమైన లోపాలే శాపాలుగా మారుతున్నాయి.

Published : 26 May 2024 00:35 IST

ఇండియాలో దశాబ్ద (2011-21) కాలంలో విద్యుత్‌ ప్రమాదాల్లో లక్ష మందికి పైగా మరణించారు. రోడ్డు ప్రమాదాల తరవాత పెద్దసంఖ్యలో ప్రాణనష్టం వీటివల్లే సంభవిస్తోంది. విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యానికి తోడు ప్రభుత్వాల విధానపరమైన లోపాలే శాపాలుగా మారుతున్నాయి.

విద్యుత్‌ వినియోగం అంతకంతకూ గణనీ యంగా పెరుగుతోంది. కరెంటు పంపిణీ, వినియోగంలో చిన్న లోపం తలెత్తినా నిండు ప్రాణాలు బలవుతాయి. జాతీయ నేర గణాంక సంస్థ లెక్కల ప్రకారం ఇండియాలో 2022లో విద్యుదాఘాతంతో 12,200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏటా మే నెల నుంచి అక్టోబరు వరకు మృత్యు ఘంటికలు మోగుతున్నాయి.

నిబంధనలు గాలికి...

విద్యుత్‌ లైన్ల నిర్మాణం పూర్తిగా గుత్తేదారుల చేతుల్లో ఉంటోంది. స్తంభాల ఏర్పాటు మొదలు తీగల అమరిక వరకు కొందరు కనీస నిబంధనలనూ పాటించడం లేదు. పనులు పూర్తిచేసి అప్పగించిన మరుసటి రోజే లోపాలు బహిర్గతమైనా, గుత్తేదారులను అడిగేవారే కరవయ్యారు. చాలాచోట్ల అధికార యంత్రాంగం బంధుగణాలే గుత్తేదారుల అవతారం ఎత్తుతున్నారు. స్థానిక రాజకీయ ఒత్తిళ్లతో కరెంటు లైన్లు అష్టవంకరలు తిరుగుతున్నాయి. ఎలాంటి శిక్షణా లేని వారితో పనులు చేయిస్తున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది కొరత చాలా అనర్థాలకు కారణమవుతోంది. ఒక్కసారిగా వచ్చిపడుతున్న ఫిర్యాదులను చక్కదిద్దే క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా కనీస జాగ్రత్తలు తీసుకోకుండా స్తంభాలు ఎక్కడం ప్రాణాంతకంగా మారుతోంది. కరెంటుతో జాగ్రత్తగా ఉండాలంటూ వినియోగదారులను హెచ్చరించే శాఖే రక్షణ చర్యల్లో దారుణంగా విఫలమవుతోంది. మరమ్మతుల సమయంలో లైన్‌ క్లియరెన్స్‌ వంటి అనుమతులన్నీ హడావుడిగా ఫోన్లలోనే జరిగిపోతున్నాయి. మరోవైపు విద్యుత్‌ సిబ్బంది తీవ్ర జాప్యం, నిర్లక్ష్యం, కొంతమంది అవినీతి ఫలితంగా కర్షకులే కరెంటు పునరుద్ధరణ బాధ్యతల్ని భుజానికెత్తుకుంటున్నారు. కనీస అవగాహన లేకున్నా ఫ్యూజ్‌ల ఏర్పాటు మొదలు చిన్నచిన్న మరమ్మతులు చేస్తున్నారు. వేలాడే తీగలు, ఎర్తింగ్‌ లేని వ్యవసాయ మోటార్లు రైతుల ప్రాణాలు తీస్తున్నాయి. మామూలుగా తీగలు తెగి కిందపడినప్పుడు సబ్‌స్టేషన్‌లో సాంకేతికంగా ట్రిప్‌ అయి సరఫరా నిలిచిపోవాలి. అందుకు భిన్నంగా విద్యుత్‌ ప్రవహిస్తుండటం ప్రాణాంతకంగా మారుతోంది. ఉప కేంద్రాల్లో బ్రేకర్లు, ఏబీ స్విచ్‌లు, పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు వంటి ఉపకరణాలు సక్రమంగా పనిచేసేలా చూడగలిగితే ప్రజలతో పాటు మూగజీవాల మరణాలకు అడ్డుకట్ట వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎర్తింగ్‌ సరిగ్గాలేని ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు ఏటా వేల సంఖ్యలో పశువుల ప్రాణాల్ని కబళిస్తున్నాయి. పట్టణాలు, నగరాల్లో ఇళ్లను ఆనుకుని ఉండే విద్యుత్‌ తీగలను ఏమరుపాటుతో తాకడం వల్ల, ఇతరత్రా ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. బస్తీల్లో ఒక స్తంభానికి ఒకే ఫీడర్‌ నుంచి సరఫరా ఉండాలన్న నిబంధన అమలు కాకపోవడం మరో సమస్య. కరెంటు స్తంభాలకు యథేచ్ఛగా ఏర్పాటుచేస్తున్న ఫ్లెక్సీలు వంటివి ప్రసారంలో అంతరాయాలకు, ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పేదలు ఇళ్లలో నాసిరకం తీగలను వినియోగిస్తున్నారు. రేకుల గృహాల్లో సర్వీసు వైర్లతో కలిసిపోయే ఇనుపతీగల దండేలు శాపంగా మారుతున్నాయి. ఎర్తింగ్‌ లేకపోవడం, మీటరు ఏర్పాటుకు అనుమతులు ఇచ్చేటప్పుడు తనిఖీలు కొరవడటం వంటివీ సమస్యాత్మకమే. ప్రకృతి వైపరీత్యాల ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రధాన మార్గాల్లోనే స్తంభాలు, లైన్లు బలహీనంగా ఉండటం ముప్పుగా పరిణమిస్తోంది.

తనిఖీలు కీలకం

ప్రభుత్వాలు విద్యుత్‌ సరఫరా, పంపిణీ వ్యవస్థలో భద్రతకు ప్రాధాన్యమిస్తేనే నష్ట నివారణ సాధ్యమవుతుంది. గ్రామాన్ని యూనిట్‌గా చేసుకుని క్షేత్రస్థాయి సిబ్బందిని బలోపేతం చేయాలి. సబ్‌స్టేషన్లలో ఖాళీలను భర్తీ చేయాలి. తనిఖీలు పకడ్బందీగా, జవాబుదారీతనంతో చేపట్టాలి. లైన్‌క్లియరెన్స్‌ అనుమతుల్లో సాంకేతికతకు పట్టంకట్టాలి. సబ్‌స్టేషన్ల నిర్వహణకు పెద్దపీట వేయాలి. కనీసం నెలలో ఒకసారైనా ట్రాన్స్‌ఫార్మర్ల తనిఖీలు ఉండాలి. సిబ్బందిలో నైపుణ్యాలను పెంపొందించాలి. పట్టణాల్లో హైటెన్షన్‌ తీగల మార్పిడికి అయ్యే ఖర్చులను ప్రభుత్వాలే చెల్లించాలి. అవసరమైతే పేదల ఇళ్లలో ఎర్తింగ్‌ సదుపాయం సమకూర్చాలి. స్తంభాల వద్ద ఎర్త్‌రాడ్లు ఉంచాలి. ఏపీ తదితర రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో పకడ్బందీ జాగ్రత్తలు తీసుకోవాలి. మరమ్మతుల సందర్భంగా సిబ్బంది విధిగా రక్షణ కల్పించే ఉపకరణాల్ని ధరించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాణ రక్షణలో భాగంగా చేపట్టాల్సిన దిద్దుబాటు చర్యలను భారంగా భావించకూడదు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు, విధివిధానాల పకడ్బందీ అమలుతోనే విద్యుత్‌ భద్రత సుసాధ్యమవుతుంది.

సముద్రాల స్వామినాథ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.