Updated : 02/09/2021 19:47 IST

ముద్దుగుమ్మలు.. ‘మల్టీ’ అవతారాలు!

ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం, దశావతారాలు.. ఇలాంటి పాత్రల్లో హీరోలనే ఎక్కువగా చూస్తుంటాం.. కానీ కొంతమంది నటీమణులు ఒకే సినిమాలో రెండు, అంతకంటే ఎక్కువ పాత్రలు పోషించి తామూ మల్టీ రోల్స్ చేయగలమని నిరూపించారు. ఆ లిస్టులో తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌ కూడా చేరిపోయింది. ‘ధాకడ్‌’ సినిమాలో రెండు కాదు, మూడు కాదు.. ఏకంగా దశావతారాల్లో కనిపించనుందట ఈ మనాలీ బ్యూటీ. నిజానికి ఇలా ఒకే సినిమాలో ఒక పాత్ర నుంచి మరొక పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం, ఆ రోల్‌కి పూర్తి న్యాయం చేయడమంటే మాటలు కాదు. అయినా అలవోకగా చేసేయగలనని ఇటీవలే విడుదలైన ఈ సినిమా పోస్టర్ల ద్వారా చెప్పకనే చెప్పిందీ బాలీవుడ్‌ అందం. ఇలా తనొక్కర్తే కాదు.. ఒకే చిత్రంలో రెండు, అంతకంటే ఎక్కువ పాత్రల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మలు గతంలోనూ కొందరున్నారు.

 

కంగన ‘దశావతారం’!

విభిన్న పాత్రల్ని ఎంచుకోవడం, వాటికి తగిన న్యాయం చేయడం కంగనకు కొత్త కాదు.. ఇందుకు ‘క్వీన్‌’, ‘తనూ వెడ్స్‌ మనూ’, ‘మణికర్ణిక’, ‘పంగా’.. వంటి సినిమాలే ప్రత్యక్ష నిదర్శనం! ఇక ఇప్పుడు ‘తలైవి’తో నటిగా తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతోందీ బాలీవుడ్‌ అందం. అయితే ప్రస్తుతం ‘ధాకడ్‌’ అనే మరో సినిమాలో నటిస్తోందీ బ్యూటీ. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కంగన ఏజెంట్‌ అగ్ని అనే గూఢచారి పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన పోస్టర్లు కూడా సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. అయితే ఇదొక్కటే కాదు.. ఇందులో మరో 9 పాత్రల్లో కంగన కనిపించనుందంటున్నాయి సన్నిహిత వర్గాలు.

‘మానవ అక్రమ రవాణాపై పంజా విసిరే గూఢచారిగానే కాదు.. బార్‌ డ్యాన్సర్‌గా, సెక్స్‌వర్కర్‌గా, హోస్ట్‌గా.. ఇలా మొత్తం పది పాత్రల్లో కంగన కనిపించనుంద’ని చెబుతున్నాయి. చెడును అంతమొందించే మృత్యు దేవత భైరవికి తన పాత్ర ఏమాత్రం తీసిపోదంటూ ఈ సినిమాలో తన యాక్షన్‌ లుక్‌ని కంగన కూడా మొన్నామధ్య సోషల్‌ మీడియాలో పంచుకుంది.. అంతేకాదు.. సినిమా చిత్రీకరణ పూర్తయినా ఈ పాత్ర నుంచి బయటికి రాలేకపోతున్నానంటోంది. ‘తలైవి’ కోసం బరువు పెరిగిన ఈ బాలీవుడ్‌ క్వీన్‌.. ‘ధాకడ్‌’ కోసం తిరిగి బరువు తగ్గి ఫిట్‌గానూ మారిందట! కంగన దశావతారాల్ని తెరపైకి తేనున్న ఈ సినిమా అక్టోబర్‌ 1న విడుదలకు సిద్ధమవుతోంది.

పన్నెండు పాత్రలతో రికార్డు!

ఒకే సినిమాలో రెండు మూడు పాత్రల్లో ఒదిగిపోవడమే ఓ సవాలు.. అలాంటిది ‘What's Your Rashee?’ అనే సినిమాలో ఏకంగా పన్నెండు పాత్రలతో అలరించింది ప్రియాంక చోప్రా. ‘Kimball Ravenswood’ అనే గుజరాతీ నవల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో 12 రాశుల్ని ప్రతిబింబిస్తూ, ప్రోస్థటిక్‌ మేకప్ ద్వారా పన్నెండు మంది వధువు క్యారక్టర్స్‌లోకి పరకాయ ప్రవేశం చేసింది పీసీ. డాక్టర్‌గా, చిలిపి పిల్లగా, అల్లరి పిల్లగా, గ్రామీణ నేపథ్యం ఉన్న యువతిగా, డ్యాన్సర్‌గా.. ఇలా విభిన్న పాత్రల్ని పోషించిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో ఆయా పాత్రలకు ప్రాణం పోసింది. ఒకే సినిమాలో అత్యధికంగా పన్నెండు పాత్రల్లో నటించిన నటీమణిగా ఘనత నేటికీ ఈ గ్లోబల్‌ బ్యూటీ పేరిటే ఉంది. ఆశుతోష్‌ గోవారికర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా టొరంటో చిత్రోత్సవంలోనూ ప్రదర్శితమైంది. అయితే ఇది అనుకున్నంత సక్సెస్‌ను అందుకోలేకపోయిందని, దీనికోసం ఎంతో కష్టపడ్డానంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది ప్రియాంక.

‘ఈ సినిమా విజయవంతం కానందుకు నేను బాధపడట్లేదు. కానీ దీనికోసం నేను పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కలేదన్న వెలితి మాత్రం నా మనసులో ఉంది..’ అందీ ముద్దుగుమ్మ.

ఐదు పాత్రల ‘గజ గామిని’!

బాలీవుడ్‌ డ్యాన్సింగ్‌ క్వీన్‌ మాధురీ దీక్షిత్‌ ఐదు పాత్రల్లో నటించిన చిత్రం ‘గజ గామిని’. లెజెండరీ డైరెక్టర్‌ ఎంఎఫ్‌ హుస్సేన్‌ మాధురికి పెద్ద ఫ్యాన్ అనే విషయం తెలిసిందే! ఆమె నటించిన ‘హమ్‌ ఆప్కే హై కౌన్‌’ సినిమా ఆయన 67 సార్లు చూశారట! ఆమె నటనకు ముగ్ధుడైన ఆయన.. తాను దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘గజ గామిని’ కోసం మాధురినే ఎంచుకున్నారు. అందులో ఆమెతో ఐదు విభిన్న పాత్రల్లో నటింపజేశారాయన. ఈ క్రమంలో ఒక సాధారణ మహారాష్ట్ర మహిళగా, అంధురాలైన గాయనిగా, మోడల్‌గా.. వీటితో పాటు మరో రెండు పాత్రల్లో ఒదిగిపోయిందీ డ్యాన్సింగ్‌ క్వీన్‌. ఇలా కాలానుగుణంగా మహిళల జీవితంలో వచ్చిన మార్పుల్ని ఈ చిత్రంలో సుస్పష్టంగా చూపించారీ గ్రేట్‌ డైరెక్టర్‌. ‘గజ గామిని మా అమ్మ. నాకు రెండేళ్ల వయసున్నప్పుడే మా అమ్మ చనిపోయింది. ఆమెకు సంబంధించి నా వద్ద ఎలాంటి ఫొటోలు లేవు. ఆమె ప్రతిరూపాన్ని మనసులో ఊహించుకుంటూ ఈ ఐదు పాత్రల్ని రూపొందించాను..’ అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారాయన. ఇక ఇందులోని ప్రతి పాత్రలో చక్కగా ఒదిగిపోయిన మాధురికి.. తన కెరీర్‌లో ఈ సినిమా ఓ మైలురాయిగా మిగిలిపోయిందని చెప్పుకోవాలి.

ద్విపాత్రాభినయంతో మెప్పించారు!

రెండు కంటే ఎక్కువ పాత్రల్లో మెప్పించిన నాయికలు తక్కువ మందే అయినా.. తెరపై ద్విపాత్రాభినయంతో ప్రేక్షకుల్ని అలరించిన ముద్దుగుమ్మల సంఖ్య కాస్త ఎక్కువే అని చెప్పుకోవాలి.

* ప్రస్తుతం ‘ధాకడ్‌’లో దశావతారాలతో మనల్ని అలరించడానికి సిద్ధమవుతోన్న కంగన ‘తనూ వెడ్స్‌ మనూ రిటర్న్స్‌’ సినిమాలో రెండు పాత్రలతో మెప్పించింది. ఈ క్రమంలో ఈ రెండు పాత్రలు పక్కపక్కన నటించిన సన్నివేశాలు ఓ పెద్ద సవాలని చెప్పుకొచ్చిందీ బాలీవుడ్‌ క్వీన్.

* ‘ధూమ్‌-2’తో పాటు ‘ఎలోన్‌’ సినిమాలో కవల సోదరీమణుల్లా నటించి మెప్పించింది బెంగాలీ బ్యూటీ బిపాసా బసు.

* ‘దుష్మన్’ సినిమాలో సోనియా, నైనా అనే కవల సోదరీమణుల్లా రెండు పాత్రల్లో నటించింది కాజోల్‌. అయితే ఇందులో అత్యాచారం సన్నివేశం ఉన్నందుకు ముందుగా ఈ సినిమా చేయడానికి అంగీకరించలేదని, అయితే చిత్ర బృందం సర్ది చెప్పడంతో తిరిగి ఈ చిత్రాన్ని కొనసాగించినట్లు ఓ సందర్భంలో పంచుకుందీ డస్కీ బ్యూటీ.

* ‘ఆసూ బనే అంగారే’ సినిమాలో తల్లీబిడ్డలిద్దరి పాత్రల్లో ఒదిగిపోయిన మాధురి.. ‘సంగీత్‌’ అనే మరో సినిమాలోనూ ద్విపాత్రాభినయం చేసింది.

* ‘ఖుదా గవా’, ‘లమ్హే’, ‘ఛాల్‌బాజ్’.. వంటి సినిమాల్లో రెండు పాత్రల్లో ఒదిగిపోయింది శ్రీదేవి. ముఖ్యంగా ‘ఛాల్‌బాజ్‌’లో అటు పూర్తి ట్రెడిషనల్‌గా, ఇటు పూర్తి మోడ్రన్‌గా.. ఇలా రెండు పాత్రలతో మెప్పించిందీ అందాల తార.

వీరితో పాటు హేమామాలిని (సీతా ఔర్‌ గీతా), షర్మిళా ఠాగూర్‌ (మౌసమ్‌).. వంటి అలనాటి తారలు కూడా ఆయా సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసి.. తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

తెలుగులోనూ..!

కొందరు టాలీవుడ్‌ ముద్దుగుమ్మలు సైతం తమ ద్విపాత్రాభినయంతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు.

* అందాల అనుష్కా శెట్టి ‘బాహుబలి’లో దేవసేన పాత్రలో అటు తల్లిగా, ఇటు హీరోయిన్‌గా విభిన్న షేడ్స్‌లో మెప్పించింది. దీంతో పాటు ఆమె ద్విపాత్రాభినయం చేసిన సినిమాల్లో ‘భాగమతి’, ‘అరుంధతి’, ‘పంచాక్షరి’.. వంటి సినిమాలున్నాయి.

* అందాల చందమామ కాజల్‌ ‘మగధీర’ సినిమాలో మిత్రవిందగా రాజసం ఒలకబోసింది. మరోవైపు ఇందుగా మోడ్రన్గా కనిపించింది.

* ‘చారులత’ సినిమాలో ప్రియమణి Conjoined Twins (అవిభక్త కవలలు)గా నటించి మెప్పించింది. హారర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంది.

వీరితో పాటు తమన్నా (ఎందుకంటే ప్రేమంట), అంజలి (గీతాంజలి, మసాలా).. తదితరులు కూడా తమ రెండు పాత్రలతో ప్రేక్షకుల్ని మాయ చేశారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి