Published : 13/12/2021 19:09 IST

మేనికి మెరుపునిచ్చే కాఫీ!

అలసిన మనసుకి ఓ కప్పు కాఫీ ఎంతో ఉత్తేజాన్నిస్తుంది. అలసటను తగ్గించి, ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది. అందుకే కదా.. రకరకాల పనులతో మైండు వేడెక్కగానే మనందరం ఓ కప్పు కాఫీ కోరుకునేది.. అయితే మనసుని హుషారెత్తించే కాఫీకి మేనికి మెరుపునిచ్చే శక్తి కూడా ఉందని మీకు తెలుసా? ఇంతకీ మేని మెరుపును పెంపొందించడంలో కాఫీ పాత్ర ఏమిటి? చూద్దాం రండి..

కాంతులీనే చర్మానికి..

జిడ్డు చర్మం కలవారు కాఫీ డికాక్షన్లో కొద్దిగా పెరుగు గానీ, శెనగపిండి గానీ కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం కాంతులీనుతుంది. కాఫీ పొడిని ఫేస్ ప్యాక్ లా కూడా వేసుకోవచ్చు. దీనివల్ల చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోయి చర్మం బిగుతుగా తయారవుతుంది. పిగ్మెంటేషన్ సమస్య కూడా దూరమవుతుంది. కాఫీకి ఆలివ్ ఆయిల్ ని జోడించి ఆ మిశ్రమంతో ముఖాన్ని శుభ్రపరిస్తే మొటిమల బాధ తగ్గుతుంది. కొంతమందికి మోచేతులు, మోకాళ్ల భాగాల్లో చర్మం పొరలూడిపోతుంటుంది. అలాంటివారు కాఫీ గింజలతో ఆ ప్రదేశంలో రుద్దితే మంచి ఫలితం ఉంటుంది.

నల్లటి వలయాలు దూరం..

నిద్రలేమితో కళ్లు అలసిపోతుంటాయి. దాంతో కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడి ఇబ్బందికరంగా కనిపిస్తుంటాయి. ఆ ప్రాంతంలో కాఫీ డికాక్షన్ ని కళ్ల చుట్టూ రుద్దితే మంచి ఫలితం ఉంటుంది. దానిలోని విటమిన్ 'కె' కళ్లకు ఉపశమనాన్నిస్తుంది. అంతేకాకుండా కాఫీలో ఉండే కెఫీన్ అనే పదార్థం కళ్ల కింద ఉండే చర్మాన్ని బిగుతుగా, కాంతివంతంగా చేస్తుంది. చర్మానికి రుద్దుకునేటప్పుడు కాఫీ పొడిలో కొద్దిగా చక్కెర కలుపుకుంటే మంచిది.

మెరిసే శిరోజాలకు..

శిరోజ సంరక్షణకు ఒకసారి కాఫీ గింజల్ని ఉపయోగించి చూడమంటున్నారు సౌందర్య నిపుణులు. ఇందుకోసం కాఫీ డికాక్షన్ ని తలకు పట్టించి ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరిస్తే.. శిరోజాలు పట్టుకుచ్చులా... ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఈ విధానాన్నే 'కాఫీ థెరపీ' అంటారు.

చూశారుగా.. అందంగా మెరిసిపోవడానికి బ్యూటీ ఉత్పత్తులే కాదు..  మనందరికీ అందుబాటులో ఉండే కాఫీ కూడా ఎలా ఉపయోగపడుతుందో.. ఓసారి ట్రై చేసి చూడండి మరి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని