Hyderabad vs Rajasthan: చివరి బంతికి వికెట్‌.. హైదరాబాద్‌ థ్రిల్లింగ్‌ విక్టరీ

సొంత గడ్డపై హైదరాబాద్‌ అదరగొట్టింది. రాజస్థాన్‌తో చివరి వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.

Updated : 03 May 2024 01:04 IST

ఇది కదా మ్యాచ్‌ అంటే.. స్టేడియంలో ఉన్న అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా టీవీలు, ఫోన్లకు అతుక్కుపోయిన వారిని మునివేళ్లపై నిలబెట్టేలా చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన హైదరాబాద్‌-రాజస్థాన్‌ మ్యాచ్‌.. అభిమానులకు మరిచిపోలేని థ్రిల్‌ను పంచింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌లో ఇరుజట్ల ఆటగాళ్లు ప్రాణం పెట్టి ఆడారు. అయితే ఒక్క బంతికి రెండు పరుగులు అవసరమైన సమయంలో రాజస్థాన్‌ చివరి మెట్టుపై బోల్తా పడింది. తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు తీసి రాజస్థాన్‌కు షాక్‌ ఇచ్చిన భువనేశ్వర్‌.. చివరి బంతికి పావెల్‌ను ఔట్‌ చేసి ఈ మ్యాచ్‌కు హీరోగా నిలిచాడు. ఇక వరుస విజయాలతో జైత్రయాత్ర చేస్తున్న రాజస్థాన్‌కు హైదరాబాద్‌ చెక్‌ పెట్టింది.        

హైదరాబాద్‌: సొంత గడ్డపై హైదరాబాద్‌ అదరగొట్టింది. రాజస్థాన్‌ (Rajasthan)తో చివరి వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ (Hyderabad) 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. నితీశ్‌ రెడ్డి (76: 42 బంతుల్లో 8 సిక్స్‌లు, 3 ఫోర్లు,) వీరవిహారం చేయగా, ట్రావిస్‌ హెడ్‌ (58: 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో రాణించాడు. అనంతరం 202 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. రియాన్‌ పరాగ్‌ (77: 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) (Riyan Parag), యశస్వి జైస్వాల్‌ (67: 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) (Yashasvi jaiswal) అర్ధశతకాలు చేసినప్పటికీ రాజస్థాన్‌ను గెలిపించలేకపోయారు. హైదరాబాద్‌ బౌలర్లలో భువనేశ్వర్‌ 3, నటరాజన్‌ 2, కమిన్స్‌ 2 వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. నితీశ్‌ రెడ్డి (76*), హెడ్‌ (58), క్లాసెన్‌ (42*) చెలరేగి ఆడారు. అవేశ్‌ ఖాన్‌ రెండు, సందీప్‌ శర్మ ఒక వికెట్‌ తీశారు. 

జైస్వాల్‌, పరాగ్‌ దూకుడు.. 

202 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌కు తొలి ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న బట్లర్‌ను, కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (Sanju Samson)ను భువనేశ్వర్‌ కుమార్‌ (Bhuvneshwar Kumar) డకౌట్‌ చేశాడు. బట్లర్‌ రెండో బంతికి జాన్సెన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔట్‌ కాగా, ఐదో బంతికి శాంసన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఇక ఈఓవర్‌లో కేవలం ఒక పరుగు మాత్రమే వచ్చింది. వీరి ఔట్‌తో కంగుతిన్న రాజస్థాన్‌ను ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, పరాగ్‌ కలిసి ఆదుకున్నారు. భువనేశ్వర్‌ వేసిన మూడో ఓవర్‌లో రియాన్‌ రెండు ఫోర్లు, ఓ సిక్స్‌ కొట్టి ఒక్కసారిగా ఇన్నింగ్స్‌కు ఊపుతీసుకొచ్చాడు. జాన్సెన్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో జైస్వాల్‌ రెండు ఫోర్లు బాదాడు. ఇక కమిన్స్‌ వేసిన ఐదో ఓవర్‌లో జైస్వాల్‌ మరింత రెచ్చి పోయాడు. రెండు ఫోర్లు, ఓ సిక్స్‌ బాదడంతో 15 పరుగులు వచ్చాయి. దీంతో 5 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆ జట్టు 50 పరుగులతో నిలిచింది.

వీరి దూకుడుతో రాజస్థాన్‌ 10 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 100 పరుగులతో పటిష్ఠంగా నిలిచింది. 11వ ఓవర్‌లో ఇద్దరు ఆటగాళ్లు జైస్వాల్‌, పరాగ్‌  చెరో ఫోర్‌ కొట్టి అర్ధశతకాలు చేశారు. అయితే 14వ ఓవర్‌లో 135 పరుగుల వద్ద నటరాజన్‌ బౌలింగ్‌లో జైస్వాల్‌  బౌల్డ్‌ అయ్యాడు. రెండు ఓవర్ల తర్వాత కమిన్స్‌ బౌలింగ్‌లో పరాగ్‌ సైతం ఔటయ్యాడు. దీంతో 16 ఓవర్లకు ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. చివరి నాలుగు ఓవర్లలో ఆజట్టు విజయానికి 42 పరుగులు అవసరం కాగా, క్రీజులో హెట్‌మయర్‌ (13), పావెల్‌ (27: 15 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌) ఉండడంతో ఆ జట్టు ధీమాగానే ఉంది. జాన్సెన్‌ వేసిన తర్వాత ఓవర్‌లో మూడు వైడ్‌లు పడడంతో పాటు 15 పరుగులు ఇచ్చుకున్నాడు. నటరాజన్‌ వేసిన 18వ ఓవర్‌లో నాలుగో బంతికి హెట్‌మయర్‌ ఔటయ్యాడు. స్వల్ప తేడాతో జురెల్‌ సైతం వెనుదిరిగాడు. 19వ ఓవర్‌లో కమిన్స్‌ కేవలం 7 పరుగులే ఇవ్వడంతో సమీకరణం 6 బంతుల్లో 13 పరుగులుగా మారింది. భువనేశ్వర్‌ వేసిన చివరి ఓవర్‌లో తొలి బంతికి అశ్విన్‌ సింగిల్‌ తీయగా, రెండో బంతికి పావెల్‌ రెండు పరుగులు రాబట్టాడు. మూడో బంతికి ఫోర్‌ కొట్టాడు. ఇరు జట్లలోనూ ఉత్కంఠ తారస్థాయికి వెళ్లింది. తర్వాత వరుస రెండు బంతులకు రెండు పరుగులు చొప్పున నాలుగు పరుగులు చేశారు. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా, భువనేశ్వర్‌ ఫుల్‌టాస్‌ వేశాడు. స్ట్రైకింగ్‌లో పావెల్‌ ఉండగా, బంతి ప్యాడ్లను తాకి పక్కకి వెళ్లింది.  దీంతో వారు పరుగు తీయగా, హైదరాబాద్‌ ఆటగాళ్లు ఔట్‌ కోసం అప్పీల్‌ చేశారు. అంఫైర్‌ ఔట్‌గా ప్రకటించగా, రాజస్థాన్‌ రివ్యూ కోరింది. స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. దీంతో రివ్యూలో ఔట్‌గా తేలడంతో హైదరాబాద్‌ ఒక పరుగు తేడాతో విజయం సాధించి సంబరాల్లో మునిగి తేలింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని