Love & Dating: ఇద్దరి మధ్య వయసు తేడా ఉందా..?
close
Updated : 06/11/2021 18:32 IST

Love & Dating: ఇద్దరి మధ్య వయసు తేడా ఉందా..?

ఈ తరం యువత ప్రేమ, పెళ్లికి ముందు డేటింగ్ కూడా అవసరమని అనుకుంటున్నారు. డేటింగ్ చేసేవారికి కులం, మతం, జాతి, వర్ణం, వయసు.. మొదలైనవేవీ అడ్డంకులు కావడం లేదు. అయితే డేటింగ్ విషయంలో మిగతా అంశాల మాదిరిగానే ఇద్దరి మధ్య ఉండే వయసు తేడా కూడా తమ అనుబంధంపై ప్రభావం చూపిస్తుంటుంది. కొన్నిసార్లు ఆ తేడా మరీ ఎక్కువుండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఎక్కువ వయసు తేడాతో డేటింగ్‌లో ఉన్న జంటలు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలేంటో తెలుసుకుందాం..!

ఆధిపత్యం వద్దు..!

రిలేషన్‌షిప్‌లో ఉన్న ఇద్దరిలో వయసులో పెద్దవాళ్లు ఒక్కోసారి చిన్నవాళ్లపై ఆధిపత్యం చూపించే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో చిన్నవాళ్లు తమ ఆలోచనలు, అభిప్రాయాలను వ్యక్తపరచడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. దీనివల్ల క్రమంగా తమ మధ్య స్నేహపూర్వక వాతావరణం మసకబారుతుంది. ఇది తమ రిలేషన్‌షిప్‌కు అంత మంచిది కాదు. ఈ క్రమంలో ఒకరికొకరు తమ భావాలను స్వతంత్రంగా వ్యక్తపరచుకోగలిగినప్పుడే ఏ బంధమైనా నిలబడుతుందనే విషయం మర్చిపోకండి.

పరిణతి స్థాయిలో తేడా..!

రిలేషన్‌షిప్‌లో ఉన్న ఇద్దరికీ వయసు పరంగా తేడా ఉండడం వల్ల.. వాళ్ల ఆలోచనా విధానం, పరిణతి స్థాయిలలో కూడా తేడా ఉండడం సహజం. ఈ క్రమంలో కొన్నిసార్లు వారి మధ్య అభిప్రాయభేదాలు వస్తుంటాయి. ఎందుకంటే ఇద్దరి దృష్టికోణాలు ఎప్పుడూ ఒకేలా ఉండాలని లేదు. అలాంటి పరిస్థితుల్లో నా మాటే నెగ్గాలనే ధోరణిలో కాకుండా ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవాలి. ఎదుటివాళ్లు అలా ఎందుకు ఆలోచిస్తున్నారో అర్ధం చేసుకొని మెలగాలి.

స్నేహితుల బృందాలను కలిసేటప్పుడు..

రిలేషన్‌షిప్‌లో ఉన్న ఇద్దరి మధ్య వయసు తేడా ఉందంటే.. తమ భాగస్వామి స్నేహితులతో కూడా ఆ తేడా ఉన్నట్లే కదా..! ఈ క్రమంలో స్నేహితుల బృందాలతో కలిసి ఎంజాయ్ చేసే క్రమంలో ఇద్దరి ఆలోచనల్లో తేడా ఉండొచ్చు. ఉదాహరణకు ఒకరికి వీకెండ్‌లో స్నేహితులతో కలిసి ఏదైనా పార్టీకి వెళ్లాలని ఉంటే.. మరొకరికి స్నేహితులతో ఇంట్లోనే కూర్చొని నచ్చిన సినిమాను వీక్షించడం ఇష్టం కావొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడూ ఒకరి అభిప్రాయాలనే సమర్థించకూడదు. ఈ క్రమంలో ఇద్దరూ ఆలోచించుకొని ఒక అభిప్రాయానికి రావడం మంచిది.

గొడవలు వస్తే ఎలా..?

ఏ రిలేషన్‌షిప్‌లో అయినా సరే ఇద్దరి మధ్య గొడవలు రావడం చాలా సహజం. కానీ.. తమ మధ్య వచ్చే అభిప్రాయభేదాలకు వయసు తేడానే కారణమని అనుకోవడం సరి కాదు. వయసు పరంగా తేడా ఉన్నవాళ్లు రిలేషన్‌షిప్లో ఉండడం కష్టమని ఏ పుస్తకంలోనూ రాయలేదు. ఏదైనా గొడవ జరిగినప్పుడు అలా ఎందుకు జరిగిందో ఆలోచించి.. మరోసారి అది పునరావృతం కాకుండా చూసుకోండి. అంతేతప్ప గొడవ జరిగిన ప్రతిసారీ వయసు తేడాను నిందించడం సమస్యకు పరిష్కారం కాదు..!

వయసు సమస్య కాదు..!

రిలేషన్‌షిప్‌లో ఇద్దరి ఆలోచనా విధానాలు, పాటించే విలువలు.. ఒకేలా ఉన్నప్పుడు వారి మధ్య ఉండే వయసు తేడా అనేది ఎప్పటికీ సమస్యగా కనిపించదు. ఈ క్రమంలో వాళ్లకు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దానిని సరైన విధంగా పరిష్కరించుకోగలరు. అంతేకాకుండా భవిష్యత్తు కార్యాచరణపై ఇద్దరూ ముందు జాగ్రత్తతో ఉంటారు. ఏకాభిప్రాయంతో ప్రణాళికాబద్ధంగా తమ జీవితాన్ని నచ్చినట్లుగా, ఆనందంగా గడుపుతుంటారు.

ఆ విషయంలోనూ..

లైంగిక విషయాలకు సంబంధించి మనిషి వయసు చాలా కీలకమనే చెప్పాలి. ఎందుకంటే మనిషికి ఉండే లైంగిక ఆలోచనలు ఒక్కో వయసులో ఒక్కోలా ఉంటాయి. రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ల మధ్య వయసు విషయంలో తేడా ఉన్నప్పుడు.. తమ లైంగిక ఆలోచనల్లో కూడా తేడా ఉండడం సహజం. అందుకే తమ మనసులోని భావాలను ఒకరితో ఒకరు పంచుకోవడం చాలా ముఖ్యం. ఇద్దరి ఆలోచనల మధ్య సఖ్యత కుదిరినప్పుడు పెళ్లి తర్వాత లైంగిక జీవితం కూడా హాయిగా సాగిపోయే అవకాశం ఉంటుంది.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని