Published : 14/05/2022 00:40 IST

పెళ్లికి ముందే పొదుపు

రాగిణి ఉద్యోగంలో చేరి ఆరునెలలు కూడా కాలేదు... కానీ అమ్మానాన్నలు తనకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. మరొక ఏడాది ఆగుతానంటున్న రాగిణి, ఈ లోపు ఎంతో కొంత పొదుపు చేయాలనుకుంటోంది. ఇలా బ్యాచిలర్‌గా ఉన్నప్పటి నుంచే పొదుపు ప్రారంభిస్తే మంచిదంటున్నారు నిపుణులు.

దువుకున్నంత వరకు అవసరానికి సరిపడా అమ్మానాన్నలు అందిస్తుంటారు. ఉద్యోగం వచ్చాక చేతిలో డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో అవగాహన లేక చూసిన ప్రతిదీ కొనేస్తుంటారు చాలామంది. దుస్తులు, సౌందర్యోత్పత్తులు, బ్యూటీపార్లర్‌, మనసుకు నచ్చిన ఆహారం అంటూ డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తారు. అలాకాక ఈ సమయంలోనే వచ్చిన జీతంలో వీలైనంత పొదుపు చేస్తే భవిష్యత్తులో ముఖ్య అవసరాల్లో ఈ సొమ్ము ఆదుకుంటుంది.

లక్ష్యం... ఎంత పొదుపు చేయవచ్చో ముందుగా ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఉదాహరణకు ఈ నెల 20 శాతం పొదుపు చేయాలని రాసుకోవాలి. ఏదైనా ఖర్చు చేస్తున్న ప్రతి సారీ ఈ లక్ష్యాన్ని గుర్తు చేసుకోవాలి. నెలయ్యాక దాన్ని చేరుకున్నామా లేదా చూడాలి. చేరితే శభాష్‌ అనుకోండి. ఈ పొదుపు లక్ష్యాన్ని మరికొంత పెంచుకునే దిశగా అడుగులు వేయండి. కనీసం 30 శాతం పొదుపు చేస్తే మీ భవిష్యత్తుకు ఢోకా ఉండదని ఆర్థిక నిపుణులు చెబుతారు.

పట్టిక.. జీతంలో దేనికి ఎంత ఖర్చు చేస్తున్నామో చిట్టా రాయాలి. వాటిని అతి ముఖ్యం, అవసరం, నివారించవచ్చు, వృథా... అని వర్గీకరించాలి. ముందుగా వృథా ఖర్చులను నిలిపివేయాలి. తర్వాత మిగిలిన మూడింటి మీదా దృష్టిపెట్టాలి. షాపింగ్‌కు వెళ్లేటప్పుడు ఏం కొనాలో ముందుగానే ఆలోచించుకుని, ఒక జాబితా రాసి తీసుకెళ్లాలి. దానిలో లేనివి ఎట్టి పరిస్థితుల్లోనూ కొనకూడదని నిర్ణయించుకుని దానికి కట్టుబడి ఉండాలి. ఈ నియమాన్ని కచ్చితంగా పాటిస్తే ఖర్చులు తగ్గుతాయి.

పెట్టుబడులు.. వివాహానికి ముందు బాధ్యతలు తక్కువ. పొదుపు చేయాలంటే ఈ సమయమే సరైనది. స్థలం, ఇల్లు, బంగారం, షేర్స్‌ వంటి వాటిపై పొదుపు చేస్తే భవిష్యత్తులో వీటి విలువ పెరుగుతుంది. పెట్టుబడీ వృథా కాదు.

అమ్మాయిలం... స్థలాలు, పెట్టుబడులు అంటే ఎవరు ఏమనుకుంటారో అని సంకోచించకండి. నాన్నో, అన్నయ్యో చూసుకుంటార్లే అనుకోకండి. అసలు ఇలాంటి పాత ఆలోచనల్ని ముందు మీరు వదిలేయండి. వాళ్ల సాయం తీసుకోండి కానీ మీకూ అవగాహన ఉండాలి. అలాగే ఎమర్జెన్సీ ఫండ్‌ పేరుతోనూ ఎంతో కొంత ప్రతి నెలా.. భద్ర పరచాలి. అత్యవసరానికి ఆదుకునేలా ఇది భరోసానిస్తుంది. ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉండకుండా జాగ్రత్తపడుతూ, అప్పుల జోలికి వెళ్లకుండా ఉంటే చాలు. భవిష్యత్తులో భరోసాగా ఉండొచ్చు. బాధ్యతలు మొదలయ్యే సరికి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఈ పొదుపు కాపాడుతుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని