Published : 14/05/2022 17:29 IST

Mango Season: తినే ముందు వీటిని నీళ్లలో నానబెడుతున్నారా?

మామిడి పండ్లను చూస్తే క్షణమైనా ఆగలేం.. వాటి రుచిని ఆస్వాదించే దాకా మనసు మనసులో ఉండదు. అయితే ఆ ఆతృతే వద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఈ పండ్లను తినే ముందు కాసేపు నీళ్లలో నానబెట్టడం వల్ల ఆరోగ్యపరంగా బోలెడు ప్రయోజనాలు చేకూరతాయని చెబుతున్నారు. మరి, అవేంటో తెలుసుకుందాం రండి..

ఎంతసేపు నానబెట్టాలి?

‘ఎ’, ‘సి’, ‘ఇ’, ‘కె’, ‘బి’ విటమిన్లతో పాటు ఫోలేట్‌.. వంటి పోషకాలు మిళితమై ఉన్న మామిడి పండ్లు రుచిలోనే కాదు.. ఆరోగ్యాన్ని అందించడంలోనూ మిన్నే! ముఖ్యంగా చర్మం, జుట్టు సంరక్షణ విషయాల్లో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు నిపుణులు. అయితే ఈ ప్రయోజనాలన్నీ చేకూరాలంటే తినే ముందు వాటిని 1-2 గంటల పాటు నీటిలో నానబెట్టడం మంచిదంటున్నారు. ఒకవేళ వెంటనే తినాలనుకునే వారు కనీసం పావుగంట పాటైనా నీటిలో నానబెట్టాలట!

చలువ చేస్తుంది!

వేసవిలో తప్ప ఇతర సీజన్లలో దొరకవని కొంతమంది అమితంగా వీటిని లాగించేస్తుంటారు. దీనివల్ల శరీరంలో ఎక్కువ వేడి ఉత్పత్తవుతుంది. ఫలితంగా జీర్ణ సంబంధిత సమస్యలు, ముఖంపై మొటిమలు.. వంటివి తలెత్తుతాయి. ఈ సమస్యలకు దూరంగా ఉండాలంటే తినే ముందు మామిడి పండ్లను నీళ్లలో నానబెట్టాలి. తద్వారా పండ్ల నుంచి శరీరంలో వేడి ఉత్పత్తి చేసే గుణాలు తొలగిపోతాయంటున్నారు నిపుణులు.

ఆ సమస్య రాకూడదంటే..!

మామిడి పండ్లలో ఫైటిక్‌ ఆమ్లం అనే సహజసిద్ధమైన పరమాణువు ఉంటుంది.  ఇది మనం తీసుకునే ఆహారం నుంచి ఖనిజాల్ని శరీరం గ్రహించకుండా అడ్డుపడుతుంది. తద్వారా శరీరంలో పోషకాహార లోపం తలెత్తుతుంది. మరి, ఈ సమస్య రాకూడదంటే తినే ముందు మామిడి పండ్లను కాసేపు నీటిలో నానబెట్టడం వల్ల అందులో అధికంగా ఉండే ఫైటిక్‌ ఆమ్లం ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది.

క్యాన్సర్‌కు దూరంగా..!

ఈ కాలంలో సహజసిద్ధంగా పండించిన మామిడి పండ్లు దొరకట్లేదు. వివిధ రకాల రసాయనాలు ఉపయోగించి వాటిని త్వరగా పక్వానికి తీసుకొస్తున్నారు. ఇలా వాడిన రసాయనాలు పండు తొక్కపై చేరతాయి. అది గమనించకుండా వాటిని ఆదరాబాదరాగా శుభ్రం చేసుకొని తీసుకుంటే.. ఆరోగ్యానికే ప్రమాదం! తద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు, శ్వాస సంబంధిత రుగ్మతలు, కంటి-చర్మ అలర్జీ, మలబద్ధకం, వివిధ రకాల క్యాన్సర్లు.. వంటి సమస్యలొస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలంటే తినే ముందు మామిడి పండ్లను నీటిలో నానబెట్టడమొక్కటే మార్గం! తద్వారా పండు తొక్కకు అంటుకున్న రసాయనాలు తొలగిపోతాయి.

బరువూ తగ్గచ్చు!

మామిడి పండ్లలో ఉండే ఫైటోకెమికల్స్‌, బయోయాక్టివ్‌ సమ్మేళనాలు కొవ్వు కణాలు, కొవ్వు సంబంధిత జన్యువులపై ప్రభావం చూపుతాయి. ఈ క్రమంలో మామిడి పండ్లను నీటిలో నానబెట్టడం వల్ల ఈ సమ్మేళనాల గాఢత తగ్గి, శరీరానికి హానికరమైన కొవ్వుని కరిగించడంలో తోడ్పడతాయి. తద్వారా బరువూ అదుపులో ఉంచుకోవచ్చు.. ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చు. అయితే బరువు తగ్గాలంటే మాత్రం పండ్లను షేక్స్‌, స్మూతీస్‌ రూపంలో కాకుండా నేరుగా తినడమే మంచిదంటున్నారు నిపుణులు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని