Published : 05/10/2022 11:18 IST

అందుకే ఈ నగరాలకు అమ్మవారి పేర్లు!

దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుపుకొనే పండగల్లో 'దసరా' ఒకటి. ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా పది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా ఆ దుర్గమ్మను మనసారా సేవించడం, ఆ అమ్మవారు కొలువై ఉన్న ప్రాంతాలను సందర్శించడం పరిపాటే. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా వెలసిన అష్టాదశ శక్తిపీఠాలు, అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడతాయి. అయితే ఇలా విభిన్న పేర్లతో, వేర్వేరు రూపాల్లో ఆయా ప్రాంతాల్లో కొలువైన ఆ ఆదిపరాశక్తి పేరు మీద వెలసిన నగరాల గురించి విన్నారా?

ముంబయి - ముంబా దేవి

'ముంబయి'.. భారత దేశ ఆర్థిక రాజధానిగానే ఈ నగరం చాలామందికి సుపరిచితం. అయితే ఈ మహానగరానికి ఆ పేరెలా వచ్చిందో తెలుసా? అక్కడ వెలసిన 'ముంబా దేవి' ఆలయం పేరు మీదే దీన్ని ముంబయిగా పిలుస్తున్నారట. దక్షిణ ముంబయిలోని బులేశ్వర్ అనే ప్రాంతంలో కొలువైన ఈ ఆలయంలోని అమ్మవారిని దర్శించుకోవడం ఎన్నో జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. ఇక్కడ దసరా ఉత్సవాలు మహాద్భుతంగా జరుగుతాయి.

సిమ్లా - శ్యామలా దేవి

సిమ్లా.. ఈ పేరు తలచుకోగానే తెల్లటి దుప్పటి కప్పుకున్న మంచు పర్వతాలే గుర్తొస్తాయి.. వేసవిలోనైతే ఈ ప్రాంతానికి సందర్శకుల తాకిడి అధికంగా ఉంటుంది. మరి అలాంటి ప్రాంతానికి ఆ పేరెలా వచ్చిందో తెలుసా? అక్కడ కొలువైన అమ్మవారు శ్యామలా దేవి పేరు మీదే! సాక్షాత్తూ ఆ కాళీ మాతే శ్యామలా దేవిగా ఇక్కడ వెలసినట్లు స్థల పురాణం చెబుతోంది. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో శ్యామ వర్ణంలో మెరిసే దుర్గా మాత రూపం చూపరులను కట్టిపడేస్తుంది. ఇలా ఈ దేవాలయంతో పాటు ఆహ్లాదాన్ని పంచే ఎన్నో ప్రదేశాలు సిమ్లాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.

చండీగఢ్ - చండీ మందిర్

ఒకప్పుడు 'హ్యాపియెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా'గా పేరు పొందిన చండీగఢ్‌కు ఆ  పేరు రావడానికి అక్కడ కొలువైన 'చండీ మందిర్' దేవాలయమే కారణమట.

మంగళూరు - మంగళా దేవి

కర్ణాటకలోని ముఖ్య పట్టణాల్లో మంగళూరు ఒకటి. ఆహ్లాదకరమైన తీర ప్రాంతం గల ఈ నగరాన్ని కన్నడ వాణిజ్య వ్యవస్థకు ఆయువు పట్టులా పరిగణిస్తారు. ఇక్కడ కొలువైన మంగళా దేవి అమ్మవారి పేరు మీదే ఈ నగరానికి మంగళూరు అనే పేరొచ్చిందట. దసరా శరన్నవరాత్రుల సమయంలో మంగళా దేవి మాతకు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో సప్తమి రోజున 'చండీ' లేదా 'మరికాంబ'గా అమ్మవారిని కొలుస్తారు. అష్టమి రోజున 'మహా సరస్వతి'గా, నవమి రోజు 'వాగ్దేవి'గా పూజలందుకుంటోందా అమ్మ. అలాగే నవమి రోజున అమ్మవారి ఆయుధాలకు విశేష పూజలు నిర్వహిస్తారు. దాంతో పాటు చండికా యాగం కూడా చేస్తారు. దశమి రోజు అమ్మవారిని దుర్గా దేవిగా అలంకరించిన తర్వాత నిర్వహించే రథయాత్ర ఎంతో కన్నుల పండువగా సాగుతుంది.

కోల్‌కతా - కాళీ మాత

దేశమంతా దుర్గా దేవి శరన్నవరాత్రులు జరగడం ఒకెత్తయితే.. పశ్చిమ బంగలో జరిగే దసరా ఉత్సవాలు మరో ఎత్తు. ఇక ఈ దసరా సందర్భంగా ఆ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో అయితే ఎటు చూసినా అమ్మవారి మండపాలే దర్శనమిస్తుంటాయి. అంతేకాదు.. ఇక్కడ కాళీ మాత దేవాలయాలు కూడా చాలానే ఉన్నాయి. మరి, ఇలా కోల్‌కతాకు ఆ పేరు రావడం వెనుక ఎన్నో పురాణ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కోల్‌కతా అనేది బెంగాలీ భాషలోని కాలిక్ క్షేత్ర అనే పదం నుంచి ఉద్భవించింది. కాలిక్ క్షేత్ర అంటే.. కాళికా దేవి నిలయమైన ప్రాంతం అని అర్థం. ఎర్రటి కళ్లతో, నల్లటి రూపంతో, నాలుక బయటపెట్టి ఎంతో గంభీరంగా కనిపించే ఈ దేవి తనను భక్తి శ్రద్ధలతో పూజించే భక్తులను కడు దయతో కాపాడుతుంది. అలాగే 'కాళీఘాట్' అనే పదం నుంచి ఈ నగరానికి కోల్‌కతా అనే పేరొచ్చినట్లు మరో కథనం ప్రచారంలో ఉంది. ఇక్కడ కాళీ మాత కొలువైన 'కాళీఘాట్ కాళీ దేవాలయా'నికి 200 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు స్థల పురాణం చాటుతోంది. ఇక ఈ కాళీ ఘాట్‌లో దసరా ఉత్సవాలు ఆకాశమే హద్దుగా, అంగరంగ వైభవంగా జరుగుతాయి.

పట్నా - పతన్ దేవి

తూర్పు భారతదేశంలో రెండో అతి పెద్ద నగరమైన పట్నాకు ఆ పేరు రావడం వెనుక శక్తి స్వరూపిణి అయిన 'పతన్ దేవి' అమ్మవారు కొలువైన ఆలయమే కారణం. ఈ ఆలయం 51 సిద్ధ శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. దసరా సమయంలో పది రోజుల పాటు ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, హారతులతో శోభాయమానంగా ఉత్సవాలు జరుగుతాయి.

ఇవి కూడా..!

ఇవే కాదు.. ఆ దుర్గా మాత పేరుతో విరాజిల్లే మరికొన్ని ప్రాంతాలు సైతం మన దేశంలో ఉన్నాయి. అవేంటంటే..

❀ త్రిపుర - త్రిపుర సుందరి (తిప్రుర)

❀ మైసూరు - మహిషాసుర మర్దిని (కర్ణాటక)

❀ అంబ జోగె - అంబ జోగేశ్వరి/ యోగేశ్వరి దేవి (మహారాష్ట్ర)

❀ కన్యాకుమారి - కన్యాకుమారి దేవి (తమిళనాడు)

❀ తుల్జాపుర్ - తుల్జా భవాని (మహారాష్ట్ర)

❀ హస్సాన్ - హసనాంబె (కర్ణాటక)

❀ అంబాలా - భవానీ అంబా దేవి (హరియాణా)

❀ సంబల్ పుర్ - సమలై దేవి/ సమలేశ్వరి (ఒడిశా)

❀ నైనిటాల్ - నైనా దేవి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని