icon icon icon
icon icon icon

ap dgp rajendranath reddy: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై బదిలీ వేటు

ap dgp rajendranath reddy: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది.

Updated : 05 May 2024 18:48 IST

అమరావతి: జగన్‌ భక్త అధికారిగా ముద్రపడిన డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి(AP DGP Rajendranath Reddy)పై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. తక్షణమే విధుల నుంచి వైదొలగాలని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని పేర్కొంటూ సీఎస్‌ జవహర్‌రెడ్డికి ఆదేశాలిచ్చింది. సోమవారం ఉదయం 11గంటల్లోగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులతో కూడిన ముగ్గురి పేర్లను పంపించాల్సిందిగా ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. వీరందరికీ సంబంధించిన ఐదేళ్ల పనితీరు నివేదిక, విజిలెన్స్‌ క్లియరెన్స్‌ నివేదికల్ని కూడా కమిషన్‌కు పంపించాల్సిందిగా సూచించింది. గత కొంతకాలంగా విపక్షాల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఈసీ చర్యలకు ఉపక్రమించింది.

డీజీపీ  కేవీ రాజేంద్రనాథరెడ్డి (AP DGP Rajendranath Reddy) తొలి నుంచి వైకాపా కార్యకర్తలా పనిచేస్తున్నారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. ప్రతిపక్షాలపై ఎన్ని దాష్టీకాలు జరుగుతున్నా ఆయన ఏ రోజూ పట్టించుకోలేదు. ప్రతిపక్ష నాయకులు, ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించేవారిని ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రయత్నించారు. తప్పుడు కేసులు పెట్టి, అక్రమంగా అరెస్ట్‌లు చేయించారు. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించినవారి గొంతులు నొక్కారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినవారినీ కేసులతో వేధించారు. విపక్ష పార్టీలు, ఉద్యోగ సంఘాలు నిరసనకు పిలుపునిచ్చినా గృహ నిర్బంధాలు చేశారు. మాచర్లలో వైకాపా నాయకులు విధ్వంసానికి దిగి, తెదేపా నాయకుల ఇళ్లు, పార్టీ కార్యాలయాలకు నిప్పంటించి దమనకాండకు పాల్పడితే వాళ్లనే వెనకేసుకొస్తూ, ప్రతిపక్షానిదే తప్పన్నట్టుగా మాట్లాడారు. రాజధాని అమరావతి పరిరక్షణకు ఉద్యమిస్తున్న రైతులపై పోలీసులు అత్యంత కర్కశంగా వ్యవహరించారు. వైకాపా అరాచకాలపై ఫిర్యాదు చేసేందుకు విపక్ష పార్టీల్లో ఎంత ముఖ్యనేతలు వెళ్లినా ఆయన అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాతే విపక్ష నేతలకు ఆయన దర్శనభాగ్యం కలిగింది.

సీనియర్లను పక్కనపెట్టి మరీ డీజీపీగా బాధ్యతలు

డీజీపీ హోదా కలిగిన 11 మంది సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను పక్కనపెట్టేసి మరీ కేవీ రాజేంద్రనాథరెడ్డిని ఇన్‌ఛార్జీ డీజీపీ (పోలీసు దళాల అధిపతి)గా నియమించిన జగన్‌ ప్రభుత్వం..రెండేళ్లుగా ఆయన్ను అదే హోదాలో కొనసాగించింది. పూర్తిస్థాయి (రెగ్యులర్‌) డీజీపీ ఎంపిక కోసం అర్హులైన అధికారుల వివరాలతో జాబితా పంపాలని కేంద్ర హోంశాఖ పదే పదే లేఖలు రాసినా ఖాతరు చేయలేదు. డీజీపీ నియామకం విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోలేదు. వడ్డించే వాడు మనవాడైతే అన్నట్లుగా.. సీనియారిటీలో అట్టడుగున ఉన్నప్పటికీ రాజేంద్రనాథరెడ్డిని ఇన్‌ఛార్జి డీజీపీగా పదవి వరించింది. 1992 బ్యాచ్‌ అధికారైన ఆయన అదనపు డీజీపీ నుంచి డీజీపీ హోదాకి పదోన్నతి పొందిన కొద్ది రోజుల్లోనే...పోలీసు దళాల అధిపతిగా నియమిస్తూ 2020 ఫిబ్రవరి 15న జగన్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీగా ఉన్న గౌతమ్‌సవాంగ్‌ను ఆకస్మికంగా, అర్ధాంతరంగా ఆ పోస్టు నుంచి పక్కకు తప్పించి.. ఆ స్థానంలో ఇన్‌ఛార్జి డీజీపీగా కేవీ రాజేంద్రనాథరెడ్డిని నియమించిన జగన్‌ ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img