Lucknow vs Kolkata: లఖ్‌నవూ చిత్తు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన కోల్‌కతా

లఖ్‌నవూపై కోల్‌కతా 98 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలక్ష అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 236 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూ 16.1 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్‌ అయింది. 

Updated : 05 May 2024 23:58 IST

లఖ్‌నవూ: సొంతగడ్డపై లఖ్‌నవూ తడబడింది. ఆ జట్టుపై కోల్‌కతా 98 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కోల్‌కతా నిర్దేశించిన 236 పరుగుల లక్ష్యాన్ని లఖ్‌నవూ ఛేదించలేకపోయింది. 16.1 ఓవర్లలో 137 పరుగులకే ఆ జట్టు కుప్పకూలింది. మార్కస్‌ స్టాయినిస్‌ (36; 21 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌. కేఎల్‌ రాహుల్‌ (25: 21 బంతుల్లో 3 ఫోర్లు) చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. అర్షిన్‌ కుల్‌కర్ణి (9), దీపక్‌ హుడా (5), నికోలస్ పూరన్‌ (10), ఆయుష్‌ బదోని (15), ఆష్టన్ టర్నర్‌ (16), కృనాల్‌ పాండ్య (5) ఇలా వచ్చి అలా వెళ్లారు. వరుణ్ చక్రవర్తి (3/30), హర్షిత్ రాణా (3/24), రస్సెల్ (2/17) లఖ్‌నవూ పతనాన్ని శాసించారు. స్టార్క్‌, నరైన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో కోల్‌కతా అగ్రస్థానానికి చేరుకుంది. 

టపాటపా వికెట్లు

లక్ష్యఛేదనలో లఖ్‌నవూకు ఆదిలోనే షాక్ తగిలింది. స్టార్క్‌ బౌలింగ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ అర్షిన్ కులకర్ణి (9) ఔటవడంతో లఖ్‌నవూ పతనం ఆరంభమైంది. రమణ్‌దీప్ అద్భుతమైన రన్నింగ్‌ క్యాచ్‌ అందుకోవడంతో అర్షిన్ వెనుదిరిగాడు. అనంతరం స్టాయినిస్‌, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో లఖ్‌నవూ గట్టిపోటీ ఇచ్చేలా కనిపించింది. హర్షిత్‌ బౌలింగ్‌లో రాహుల్ ఔటైన తర్వాత లఖ్‌నవూ ఇన్నింగ్స్‌ గాడి తప్పింది. వేగంగా వికెట్లు కోల్పోయి ఘోర ఓటమిని చవిచూసింది. దీపక్‌ హుడాను చక్రవర్తి వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దూకుడుగా ఆడుతున్న స్టాయినిస్‌ను, హిట్టర్ నికోలస్‌ పూరన్‌ను రస్సెల్ వరుస ఓవర్లలో వెనక్కి పంపాడు. నరైన్‌ బౌలింగ్‌లో బదోని.. స్టార్క్‌కు చిక్కాడు. టర్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి రిట్నర్ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. హర్షిత్ బౌలింగ్‌లో కృనాల్ పాండ్య.. ఫిల్ సాల్ట్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో లఖ్‌నవూ పనైపోయింది. కాసేపటికే ఆ జట్టు ఆలౌటైంది. 

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఓపెనర్ సునీల్ నరైన్ (81; 39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లు) మరోసారి చెలరేగి ఆడాడు. మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ (32; 14 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నంతసేపు బౌండరీలతో అలరించాడు. రఘువంశీ (32; 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), శ్రేయస్ అయ్యర్ (23; 15 బంతుల్లో 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. రింకు సింగ్ (16), ఆండ్రీ రస్సెల్ (12) భారీ స్కోరు చేయలేకపోయారు. చివర్లో రమణ్‌దీప్‌ సింగ్ (25; 6 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. లఖ్‌నవూ బౌలర్లలో నవీనుల్ హక్ 3, యశ్‌ ఠాకూర్, రవి బిష్ణోయ్, యుధ్విర్ సింగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని