Published : 30/10/2021 17:32 IST

దుస్తులు కొత్తగా తళతళలాడుతూ ఉండాలంటే..!

కొత్త దుస్తులు వేసుకునేటప్పుడు చాలా అపురూపంగా వాటిని చూసుకుంటాం. అయితే రాన్రాను వాటిని ఉపయోగించేటప్పుడు, శుభ్రపరిచేటప్పుడు వాటి మీద మనం వహించే శ్రద్ధ తగ్గుతుందనే చెప్పాలి. ఫలితంగా కొద్ది రోజులకు దుస్తులు వాటి కొత్తదనాన్ని కోల్పోతాయి. మరి, కొత్త దుస్తులు ఎక్కువ కాలం అలా కొత్తగా కనిపిస్తూ చక్కగా మన్నాలంటే ఏం చేయాలి? అందుకు బట్టలు ఉతికేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు మీ కోసం..

బట్టలు కొనేటప్పుడు దాని బ్రాండ్ ఏంటి? క్లాత్ ఎలాంటిది? ఎంత కాలం మన్నుతుంది.. అంటూ ప్రశ్నల వర్షం కురిపించేస్తాం. అలాగే నచ్చిన దుస్తులు కొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒకటి లేదా రెండుసార్ల వరకు చాలా అపురూపంగా కూడా చూసుకుంటాం. ఆపైన వాటి మీద మోజు తగ్గాక ఎలా పడితే అలా వాడటం, ఉతకడం ప్రారంభిస్తాం. అందుకే అవి వాటి కొత్తదనం కోల్పోవడమే కాకుండా నాణ్యత కూడా దెబ్బతిని మన్నిక కాలం తగ్గుతుంది. అలా జరగకుండా ఉండాలంటే-

చల్లని నీటిలోనే..

సాధారణంగా చాలామంది గృహిణులు మురికి ఎక్కువగా ఉండే బట్టలను వేడి నీళ్లలో నానబెట్టి ఉతుకుతూ ఉంటారు. బాగా మురికి ఉన్నవాటికి ఈ చిట్కా బాగా ఉపకరిస్తుంది. కానీ వాటితో పాటే మిగతా దుస్తుల్ని కూడా వేడినీటిలో పెట్టి ఉతకడం పొరపాటు. ఇలా చేయడం వల్ల వాటి నాణ్యత దెబ్బతింటుంది. కొన్ని దుస్తులకైతే దారాలు పోగులు పడటం, దగ్గరకి అయిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

బట్టలు తిరగేసి..

బట్టలు ఉతికేటప్పుడు లోపల, బయట రెండువైపులా శుభ్రం చేయాలని గుర్తుంచుకోండి. అందుకే ముందు బయటి భాగం శుభ్రం చేసుకుంటే తర్వాత బట్టలు తిరగేసి లోపలి భాగం ఉతకచ్చు. అలాగే బట్టలు శుభ్రం చేసిన తర్వాత తిరగేసి ఉండగానే వాటిని తాడు మీద ముడతలు లేకుండా ఆరేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బట్టలు బాగా శుభ్రపడటమే కాకుండా సూర్యరశ్మి వల్ల రంగు మారకుండా ఉంటాయి. బట్టల నాణ్యత కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది.

లేబుల్స్ ఆధారంగా..

బట్టలు కొన్నప్పుడు వాటికి కొన్ని లేబుల్స్ ఉంటాయి. ఇంటికొచ్చాక వాటిని కత్తిరించి పక్కన పడేయకుండా ముందు దాని మీద ఇచ్చిన వివరాలను ఓసారి గమనించండి. దీని వల్ల ఆ బట్టలను డ్రైవాష్ చేయాలా? వాషింగ్‌మెషీన్‌లో వేయాలా? లేక చేత్తో ఉతకాలా? నీడలో ఆరేయాలా లేక ఎండలోనా?? వంటి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. అలాగే వాటిని ఇస్త్రీ చేయచ్చా? లేదా? కూడా తెలుస్తుంది. ఆ వివరాల ఆధారంగానే ఎప్పుడూ దుస్తుల్ని శుభ్రం చేయాల్సి ఉంటుంది.

క్లోరిన్, బ్లీచ్..

బట్టలకు ఉన్న మురికి తొందరగా వదిలిపోయి తెల్లగా మిలమిలా మెరిసిపోవాలని చాలామంది గృహిణులు చేసే పని బట్టలు ఉతికే నీళ్లలో క్లోరిన్, బ్లీచ్ వంటివి కలపడం.. ఇవి కలపడం వల్ల దారాలు వాటి నాణ్యతను చాలా తొందరగా కోల్పోతాయి. అందుకే వీటికి బదులు వెనిగర్‌ని ఉపయోగించడం చాలా శ్రేయస్కరం. దీని వాడకం వల్ల బట్టలు ఎక్కువ కాలం కొత్త వాటిలా తళతళా మెరుస్తూనే ఉంటాయి.

మరకలు పడిన వెంటనే..

బట్టల మీద మరకలు పడిన వెంటనే వాటిని పోగొట్టడానికి ప్రయత్నించాలి. అలాకాకుండా ఉతికే సమయంలో చూసుకుందామని వదిలేస్తే ఆ మరకలు మరింత కఠినంగా మారే అవకాశాలు లేకపోలేవు.

కఠినమైన సబ్బులు వద్దు..

బట్టలు ఉతకడానికి ఉపయోగించే సబ్బులు తక్కువ గాఢత కలిగినవైతే మంచిది. ఎక్కువ గాఢత ఉన్న సబ్బులు, డిటర్జెంట్లను ఉపయోగించడం.. మురికి తొందరగా వదిలిపోవాలని ఎక్కువ మొత్తంలో వాటిని వాడటం వంటివి చేయడం వల్ల ఫ్యాబ్రిక్స్ నాణ్యత దెబ్బతింటుంది.

ఈ జాగ్రత్తలు కూడా..

* బట్టలు ఉతికేటప్పుడు వాటికుండే బటన్స్, జిప్స్ పోకుండా ఉతకాలి.

* డెనిమ్ వంటి జీన్స్‌లను అప్పుడప్పుడూ ఉతికితే సరిపోతుంది.

* బట్టలు కవర్లలో పెట్టాల్సి వస్తే ప్లాస్టిక్ కవర్స్‌కు దూరంగా ఉండాలి. వాటికి బదులు కాటన్ లేదా గాలి తగిలేలా ఉండే కవర్స్ ఉపయోగించాలి.

* మాసిన బట్టలు లేదా తడి ఉన్న బట్టల్ని మిగతా దుస్తులతో కలిపి ఉంచితే అదొక రకమైన వాసన వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బ్యాక్టీరియా కూడా చేరచ్చు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని