America: 17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష

తాను పని చేసే ఆసుపత్రిలో చేరిన రోగులకు అధిక మోతాదులో ఇన్సులిన్‌ ఇచ్చి హత్య చేస్తున్న అమెరికాలోని ఓ నర్సుకు అక్కడి కోర్టు శనివారం 700 ఏళ్ల  జైలు శిక్ష విధించింది. 

Published : 04 May 2024 13:12 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: తాను పని చేసే ఆసుపత్రిలో చేరిన రోగులకు అధిక మోతాదులో ఇన్సులిన్‌ ఇచ్చి హత్య చేస్తున్న అమెరికాలోని ఓ నర్సుకు అక్కడి కోర్టు శనివారం 700 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2020-2023 మధ్య కాలంలో అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన నర్సు హీథర్ ప్రెస్‌డీ(41)  వివిధ ఆరోగ్య కేంద్రాల్లో పని చేసింది. ఆ సమయంలో ఆమె ఆసుపత్రికి వచ్చే రోగులకు  మోతాదుకు మించిన ఇన్సులిన్‌ను ఇంజక్ట్‌ చేసేది. అలా ప్రెస్‌డీ 22 మందికి అధిక మొత్తంలో ఇన్సులిన్‌ ఇచ్చింది. దానివల్ల 17 మంది రోగులు మరణించారు. తాను మూడు హత్యలు, 19 హత్యాయత్నాలు చేసినట్టుగా నిందితురాలు నేరాన్ని అంగీకరించినట్టు సమాచారం.

ఇద్దరు రోగులను చంపినందుకు ఆమెపై తొలుత గత ఏడాది మేలో ఆసుపత్రి వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. కేసు విచారణ సమయంలో భాగంగా నర్సు ఇదే విధంగా మరికొందరి మరణానికి  కారణమయినట్టు తేలింది. గతంలో ఆమెతో కలిసి పని చేసిన సహోద్యోగులను పోలీసులు విచారించారు. ఆమె రోగులతో దురుసుగా ప్రవర్తించేదని, తరచూ వారిని అవమానించేలా మాట్లాడేదని వారు పేర్కొన్నారు. ఆమె తన  తల్లికి  చేసే మెసేజ్‌లలో సైతం తన చుట్టూ ఉన్నవారు, రోగులు తనకు నచ్చట్లేరని వారికి హాని కలిగించాలని ఉందని తరచుగా చెప్తుండేది. “ఆమెకు ఎటువంటి జబ్బు లేదు. మతిస్థిమితం సరిగానే ఉంది. కాని తన వ్యక్తిత్వం మంచిది కాదు. ఆమె నా తండ్రిని చంపడం నేను స్వయంగా చూశాను’’అని బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరు కోర్టుకు తెలిపారు. 

ఇన్సులిన్ అధిక మోతాదులో ఇస్తే హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది. దీని వల్ల  హృదయ స్పందన పెరుగుతుంది. గుండె పోటుకు కూడా దారి తీయవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని