T20 WC 2024: రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్‌ టీమ్‌ సెలక్షన్‌: గంగూలీ

టీ20 ప్రపంచ కప్‌ కోసం ప్రకటించిన జట్టు గురించి భారత మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. సరైన జట్టును ఎంపిక చేశారని సెలక్టర్లను అభినందించాడు.

Published : 04 May 2024 13:54 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్‌ కోసం (T20 World Cup 2024) జట్టును ప్రకటించినప్పటి నుంచి పొగడ్తలు, విమర్శలు, సూచనలు వస్తున్నాయి. రింకు సింగ్‌ను తీసుకుంటే మంచిదని కొందరు.. హార్దిక్‌ ఎందుకని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా భారత జట్టు ఎంపికపై మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ (Sourav Ganguly) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రింకు సింగ్‌ను రిజర్వ్‌లో పెట్టడానికి కారణాలను వివరించాడు. అత్యుత్తమ జట్టుతోనే రోహిత్‌ మెగా టోర్నీకి వెళ్తున్నాడని ప్రశంసించాడు. 

‘‘వెస్టిండీస్‌ పిచ్‌లు చాలా మందకొడిగా ఉంటాయి. సెలక్టర్లు అదనంగా మరొక స్పిన్నర్‌ను ఎంపిక చేసి ఉంటారు. అందుకే, రింకు సింగ్‌కు అవకాశం దక్కి ఉండకపోవచ్చు. యువ బ్యాటర్ ఇప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లో మెరుస్తున్నాడు. భవిష్యత్తులో తప్పకుండా అవకాశం వస్తుంది. టీ20 ప్రపంచ కప్‌ టైటిల్ రేసులో భారత్, ఆస్ట్రేలియా ముందుంటాయని అనుకుంటున్నా. గత వన్డే వరల్డ్‌ కప్‌లో ఫైనల్‌లో ఈ రెండు జట్లే తలపడ్డాయి. మరోసారి ఆధిపత్యం ప్రదర్శిస్తాయి. టీమ్‌ఇండియా ఉత్తమ జట్టుతోనే బరిలోకి దిగుతోంది. ప్రతి ఒక్కరూ మ్యాచ్‌ విన్నర్లే. రోహిత్, ద్రవిడ్‌ సరైన ప్లేయర్లనే ఎంచుకున్నారని భావిస్తున్నా’’ అని గంగూలీ తెలిపాడు. 

కుల్చాదే హవా: చావ్లా

‘‘టీ20 ఫార్మాట్‌ వచ్చిన మొదట్లో ఎవరూ స్పిన్నర్లకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం ప్రపంచవ్యాప్తంగా స్పిన్నర్లే ఉపయోగకరంగా మారారు. బంతి వేగంగా వస్తే సులువుగా బ్యాటింగ్‌ చేయొచ్చు. అదే నెమ్మదిగా టర్న్‌ అయితే దాని కోసం చాలా ఎనర్జీని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఐపీఎల్‌లో చాహల్‌ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. కుల్‌దీప్‌ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో భారత్‌ నాణ్యమైన ప్రదర్శన చేస్తుందని భావిస్తున్నా’’ అని సీనియర్‌ స్పిన్నర్ పీయూశ్‌ చావ్లా వ్యాఖ్యానించాడు. టీ20 ప్రపంచ కప్ కోసం భారత్ నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. స్పెషలిస్ట్‌ స్పిన్నర్లుగా యుజ్వేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ను తీసుకుంది. స్పిన్‌ ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌కు చోటు కల్పించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని