Onion exports: ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం

ఉల్లి ఎగుమతులపై కేంద్రం ఎత్తివేసింది. మహారాష్ట్రలో ఎన్నికల వేళ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Updated : 04 May 2024 13:35 IST

Onion exports | దిల్లీ: దేశీయంగా ఉల్లి ధరలు (Onion prices) అదుపులోకి తీసుకొచ్చేందుకు ఎగుమతులపై గతంలో విధించిన ఆంక్షలను కేంద్రం ఎత్తివేసింది. దాదాపు కొన్ని నెలలుగా అమల్లో ఉన్న నిషేధాన్ని తొలగించింది. ఈ మేరకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ శనివారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కొనసాగుతాయని పేర్కొంది. అయితే, కనీస ఎగుమతి ధరను టన్నుకు 550 డాలర్లుగా (రూ.45,860) పేర్కొంది. మహారాష్ట్రలో తదుపరి దశ పోలింగ్‌ జరగనున్న వేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

దేశంలో ఉల్లి దిగుబడి ఆశించిన స్థాయిలో ఉండబోదన్న అంచనాల నేపథ్యంలో కేంద్రం గతేడాది చర్యలకు పూనుకుంది. దేశీయంగా ఉల్లి ధరలను అదుపులో ఉంచేందుకు తొలుత ఉల్లి ఎగుమతలపై కనీస ధరను టన్నుకు 800 డాలర్లకు పెంచుతూ అక్టోబర్‌ 28న నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌ 8న పూర్తిగా నిషేధం విధించింది. మార్చి 31 వరకు ఈ ఆదేశాలు అమలవుతాయని పేర్కొంది. ఆ గడువును కేంద్రం మళ్లీ పొడిగించింది. ఉల్లి ఎగుమతులపై శుక్రవారం 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించిన కేంద్రం.. శనివారం ఆంక్షలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.

అప్పు చేసి ఇల్లు కొంటున్నారా?

ఎన్నికల వేళ..

ఉల్లి ఎగుమతులపై నిషేధం పట్ల మహారాష్ట్రలోని ఉల్లి రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిషేధం వల్ల తమకు ఆశించిన స్థాయిలో రాబడి రావడం లేదన్నది వాళ్ల వాదన. ఆంక్షలు ఎత్తివేయాలని పలుమార్లు ఆందోళనలు కూడా నిర్వహించారు. విపక్ష కాంగ్రెస్‌ సైతం ఉద్దేశపూర్వకంగానే ఉల్లి రైతులను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందంటూ ఆరోపించింది. ట్రేడర్లు కూడా కేంద్ర నిర్ణయంపై గుర్రుగా ఉన్నారు. మహారాష్ట్రలో ఇంకా పలు దశల్లో కొన్ని స్థానాలకు పోలింగ్‌ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని