IPL 2024: విరాట్ స్ట్రైక్‌రేట్‌పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు

భారీగా పరుగులు చేస్తున్నా.. విరాట్ కోహ్లీపై విమర్శలు మాత్రం ఆగడం లేదు. వాటిని భారత మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్‌, కైఫ్ కొట్టిపడేశారు.

Published : 04 May 2024 13:41 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2024 సీజన్‌లో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో విరాట్ కోహ్లీ (500) రెండో స్థానంలో ఉన్నాడు. రుతురాజ్‌ గైక్వాడ్ (509) మాత్రమే ముందున్నాడు. అయినా, కోహ్లీ స్ట్రైక్‌రేట్‌పై విమర్శలు తీవ్రస్థాయిలో వస్తున్నాయి. అయితే, విమర్శల్లోనూ పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారని భారత మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, మహమ్మద్‌ కైఫ్‌ ఆక్షేపించారు. హైదరాబాద్‌ ఆటగాడు ట్రావిస్ హెడ్‌ గత మ్యాచ్‌లో 131 స్ట్రైక్‌రేట్‌తో ఆడినా ఎవరూ ఏమీ అనలేదని.. కోహ్లీని (Virat Kohli) మాత్రం ఇంకా మాటలతో ఇబ్బంది పెడుతున్నారని వ్యాఖ్యనించారు. ఒకవేళ హెడ్‌లా ఆడితే మాత్రం విరాట్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటానికి కొందరు సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు. 

‘‘విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌ సత్తా ఏంటో మనందరికీ తెలుసు. ప్రతిసారీ దూకుడుగా ఆడటం కుదురదు. పిచ్‌, ప్రత్యర్థి బౌలింగ్‌, వికెట్లను త్వరగా కోల్పోవడం వంటి పరిణామాలు కీలక పాత్ర పోషిస్తాయి. ట్రావిస్ హెడ్‌ కూడా రాజస్థాన్‌పై 44 బంతుల్లో 58 పరుగులు చేశాడు. అయినా సరే ఎవరూ విమర్శించలేదు.దానికి కారణం పిచ్‌ బ్యాటింగ్‌కు సహకరించలేదు. అదే, విరాట్ ఆటతీరుకు వచ్చేసరికి అవేవీ పట్టించుకోకుండా కామెంట్లు చేసేస్తారు. ప్రతి ఒక్కరినీ సమానంగా చూడాల్సిన అవసరం ఉంది’’ అని ఇర్ఫాన్‌ స్పష్టం చేశాడు. 

అలా కోహ్లీ ఆడుంటేనా?: కైఫ్‌

‘‘ఇర్ఫాన్‌ చెప్పిన మాటలు అక్షర సత్యం.  ఒకవేళ కోహ్లీనే అలా ఆడుంటే.. అదేంటి 44 బంతుల్లో కేవలం 58 పరుగులే చేస్తాడా? ఇదేం ఆటతీరు? పక్కన పెట్టేయండంటూ విమర్శలు వచ్చేసేవి. అతడి స్ట్రైక్‌రేట్‌ గురించి పెద్ద ఎత్తున చర్చా కార్యక్రమాలు పెట్టేవారు. అయితే, రాజస్థాన్‌పై హెడ్ ఆడిన ఇన్నింగ్స్‌ చాలా బాగుంది. అలాగే ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ నుంచి కీలక ఇన్నింగ్స్‌లను చూశాం. బెంగళూరు బ్యాటింగ్ విభాగం భారాన్ని అతడే మోస్తున్నాడు’’ అని కైఫ్‌ వెల్లడించాడు. 

గుజరాత్‌తో ఇవాళ బెంగళూరు మ్యాచ్‌

ఇప్పటికే ప్లేఆఫ్స్ ఆశలు అడుగంటిన బెంగళూరుకు మరో కీలక పోరు ఎదురుకానుంది. గుజరాత్‌తో చిన్నస్వామి స్టేడియం వేదికగా మ్యాచ్‌ జరగనుంది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ఆర్సీబీ మిగతా నాలుగు మ్యాచుల్లోనూ గెలిస్తే 14 పాయింట్లు తన ఖాతాలోకి వస్తాయి. అయినా, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిందే. మరోవైపు గుజరాత్ పరిస్థితి బెంగళూరు కంటే ఫర్వాలేదు. ప్రస్తుతం 10 మ్యాచుల్లో నాలుగు విజయాలతో 8 పాయింట్లను సాధించిన గుజరాత్ మిగతా మ్యాచుల్లో గెలిస్తే ప్లేఆఫ్స్‌ బెర్తును దక్కించుకొనే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని