Published : 29/06/2022 18:53 IST

Entrepreneurship: సిబ్బందిలో ఇలా ప్రేరణ కలిగించండి!

బిజినెస్‌ అంటేనే ఎన్నో సవాళ్లతో కూడుకున్న విషయం. ఎదురయ్యే ప్రతి సమస్యను సమర్థతతో, సమయస్ఫూర్తితో పరిష్కరించాలి. మనకు అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా ఉపయోగిస్తూ లాభాలు రాబట్టే వారే సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌ పర్సన్‌ అవుతారు. ఈ క్రమంలో బిజినెస్‌లో ఉండే అతి పెద్ద ఛాలెంజ్‌.. ఉద్యోగుల సేవలను సమర్థంగా ఉపయోగించుకోవడం. ఎందుకంటే వాళ్లు చేసే పని పైనే కంపెనీ ఎదుగుదల ఆధారపడుంటుంది.

ఈ క్రమంలో మల్టీ నేషనల్‌ కంపెనీలు సైతం పని విషయంలో టార్గెట్లు నిర్దేశిస్తూనే తమ ఉద్యోగులను మేనేజ్‌ చేయడానికి, వారి ఉత్పాదకతను పెంచడానికి రకరకాల పద్ధతులను అమలు చేస్తుంటాయి. అయితే కొత్తగా బిజినెస్‌ రంగంలో దిగిన వాళ్లలో చాలామందికి వీటిపై సరైన అవగాహన లేక తమ ఉద్యోగుల నుంచి సరైన ఫలితాలను రాబట్టలేరు. దీంతో నష్టాలు పొందడం, ఉద్యోగులు తమ కంపెనీని విడిచి వెళ్లడం వంటివి జరుగుతుంటాయి. ఈ క్రమంలో పని ప్రదేశాల్లో ఉద్యోగులకు పనిపై ఆసక్తి ఎలా కలిగించాలి, వాళ్ల నుంచి మంచి ఫలితాలను ఎలా రాబట్టాలి, వాళ్లకు పనిపై తృప్తిని ఎలా కలిగించాలి.. మొదలైన అంశాల విషయంలో పాటించాల్సిన కొన్ని చిట్కాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!

స్వేచ్ఛని కల్పించడం అవసరం..!

ఆఫీస్‌లో ఉన్నంతసేపు ఒకే చోట కూర్చొని పని చేయాలి, నిర్దేశించిన సమయంలోనే బ్రేక్‌ తీసుకోవాలి.. లాంటి నియమాలు ఉద్యోగుల్లో పనిపై ఉండే ఉత్సాహాన్ని తగ్గిస్తాయి. వారికి కాస్త స్వేచ్ఛ ఇవ్వడంలో తప్పు లేదు. ఒక అధ్యయనం ప్రకారం కఠినమైన నియమాల మధ్య పని చేసే ఉద్యోగుల కంటే స్వేచ్ఛాపూరిత వాతావరణంలో పని చేసే ఉద్యోగులే సమర్ధంగా పని చేస్తారని వెల్లడైంది. ఈ క్రమంలో వాళ్లు ఆఫీస్‌లో ఉన్నంతసేపు పూర్తిగా పనిలోనే నిమగ్నమై ఉండకుండా.. పని మధ్యలో కాసేపు రిలాక్స్‌ అయ్యే వెసులుబాటును కల్పించడంలో తప్పు లేదు.

ఒకే చోట ఉండాల్సిన అవసరం లేదు..!

ఆఫీస్‌లో ఉద్యోగులను ఎప్పుడూ ఒకే చోట కూర్చోబెట్టి పని చేయించాలన్న నియమమేమీ లేదు. వాళ్ల మూడ్‌ని బట్టి ఆఫీస్‌లో వాళ్లకు నచ్చిన చోటుకి వెళ్లి కూర్చొని పని చేసే స్వేచ్ఛను వాళ్లకి కల్పించండి. అనుకూలమైన చోటులో కూర్చోవడం వల్ల ఉద్యోగులు అనుకున్న దానికంటే చురుగ్గా పని చేస్తారు. ఇందుకోసం ఆఫీస్‌లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం మన బాధ్యత. అంతేకాదు, ఎప్పుడూ ఏసీ గదుల్లోనే కాకుండా.. అప్పుడప్పుడు బాల్కనీలో లేదా గార్డెన్‌లో కూర్చొని.. స్వచ్ఛమైన గాలి పీలుస్తూ, కాస్త ఎండ తగులుతూ పని చేసే అవకాశాన్ని కల్పించడం వల్ల ఫలితాలు ఇంకా బాగుంటాయి.

ఫీడ్‌బ్యాక్‌ తీసుకోండి..!

పని విషయాలకు సంబంధించి ఉద్యోగుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్‌ (అభిప్రాయ సేకరణ) తీసుకోండి. పనిని ఇంకా సమర్ధంగా ఎలా పూర్తి చేయగలరో అనే విషయం గురించి వాళ్ల నుంచి సలహాలు, సూచనలు తీసుకోండి. ఇలాంటి చర్చల్లో వాళ్లనూ భాగం చేయడం వల్ల పని విషయంలో వాళ్ల దృష్టి కోణం నుంచి చూసే అవకాశం మనకు లభిస్తుంది. పైగా టీమ్‌ వర్క్‌తో ఆశించిన ఫలితాలు లభిస్తాయి.

ప్రోత్సహించడం అవసరం..!

ఉద్యోగులు పొరపాట్లు చేసినప్పుడు వాటిని సరిచేసే బాధ్యత మనకెంతుందో.. ఆ విషయాన్ని వాళ్లకు సున్నితంగా చెప్పి మరోసారి ఇలాంటి తప్పులు చేయకుండా వారిని ప్రోత్సహించే బాధ్యత కూడా మనదే. దీనివల్ల ఉద్యోగుల్లో మనపై గౌరవం పెరిగి ఆఫీస్‌ పనిని తమ సొంత పనిగా భావించి జాగ్రత్తగా పని చేస్తారు. అంతేకాదు, ఆఫీస్‌లో ఎప్పుడూ పాజిటివ్‌ వాతావరణాన్ని ఉంచాలి. టీమ్‌ వర్క్‌ దృష్ట్యా ఉద్యోగుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించడం కూడా మన బాధ్యతే అన్న విషయం మాత్రం మర్చిపోవద్దు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని