T20 WC 2024: టీ20 ప్రపంచకప్‌నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ

ఐపీఎల్ ముగిసిన వారం రోజులకే మరో క్రికెట్ సంగ్రామం ప్రారంభం కానుంది. కానీ, దానిపై ఉగ్రమూకలు కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై ఐసీసీ స్పందించింది.

Updated : 06 May 2024 14:32 IST

ఇంటర్నెట్ డెస్క్‌: జూన్‌ 1 నుంచి (భారత కాలమానం ప్రకారం జూన్ 2న) యూఎస్‌ఏ - విండీస్‌ సంయుక్త ఆతిథ్యంలో టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) ప్రారంభం కానుంది. అయితే, ఈ మెగా టోర్నీకి ఉగ్ర ముప్పు ఉండే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. నార్త్ పాకిస్థాన్‌ వేదికగా పనిచేస్తున్న టెర్రరిస్ట్‌ గ్రూప్‌ల నుంచి ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. కరీబియన్ మీడియాలోనూ కథనాలు రావడంతో ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కీత్‌ రౌలే, ఐసీసీ ప్రతినిధులు స్పందించారు. 

‘‘ఐసీసీ చాలా నిశితంగా పరిస్థితులను గమనిస్తోంది. ఆతిథ్య దేశాల ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. కథనాలు రాగానే అధికారయంత్రాంగంతో మాట్లాడాం. వెస్టిండీస్ క్రికెట్‌ బోర్డు కూడా ప్రతి ఒక్క ఆటగాడి భద్రతకు భరోసానిచ్చింది. కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తు్న్నట్లు పేర్కొంది. ఎలాంటి రిస్క్‌నైనా తట్టుకొనేలా చర్యలు తీసుకుంటామనే నమ్మకం కలిగించింది’’ అని ఐసీసీ అధికారులు వెల్లడించారు. 

ట్రినిడాడ్‌ పీఎం ఏమన్నారంటే?

‘‘21వ శతాబ్దంలోనూ ఉగ్రవాద ముప్పు పెరిగిపోవడం దురదృష్టకరకం. విభిన్న మార్గాల్లో ఉగ్రవాదం వ్యాపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు దీనిపై పోరాడేందుకు సమాయత్తం కావాలి. అతిపెద్ద టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే అవకాశం మాకు దక్కింది. దానిని విజయవంతం చేయడానికి అన్ని విధాలుగా చర్యలు చేపట్టాం. ఉగ్రమూకలు ఎలాంటి దాడులకైనా పాల్పడే ప్రమాదం లేకపోలేదు. అయితే, వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాం. టోర్నీ ఆసాంతం మ్యాచ్‌లు జరిగే వేదికలు, పర్యటకలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా ఉండేందుకు వీలు కల్పించాం. ఇప్పటికే మా ఇంటెలిజెన్స్‌, సెక్యూరిటీ ఏజెన్సీలు ఆ కార్యక్రమంలో నిమగ్నమయ్యాయి’’ అని ట్రినిడాడ్ పీఎం కీత్‌ స్పష్టం చేశారు. 

మొత్తం 20 టీమ్‌లు నాలుగు గ్రూప్‌లుగా విడిపోయి వరల్డ్‌ కప్‌ కోసం పోటీపడతాయి. బార్బడోస్ వేదికగా జూన్ 29న ఫైనల్‌ జరగనుంది. జూన్ 5న ఐర్లాండ్‌, జూన్ 9న పాకిస్థాన్‌, జూన్ 12న యూఎస్‌ఏ, జూన్ 15న కెనడాతో టీమ్‌ఇండియా తలపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు