UK: యూకే ఎయిర్‌ పోర్టుల్లో రాత్రంతా నిలిచిపోయిన ఈ-గేట్లు.. ప్రయాణికుల అవస్థలు!

యూకే విమానాశ్రయాల్లో మంగళవారం అత్యంత తీవ్రమైన సమస్య  కొన్ని గంటలపాటు ప్రయాణికులకు నరకం చూపించింది. 

Published : 08 May 2024 11:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యూకేలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఈ-గేట్లు నిన్న మొరాయించాయి. ఫలితంగా  ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో భారీగా ప్రయాణికులు బారులు తీరి గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా పాస్‌పోర్టు ఐటీ వ్యవస్థ కుప్పకూలడమే దీనికి కారణమని భావిస్తున్నారు. దీంతో బోర్డర్‌ ఫోర్స్‌ సిబ్బంది మాన్యూవల్‌గా ప్రాసెస్‌ చేయాల్సి వచ్చింది. ప్రయాణికులు పత్రాల తనిఖీల్లో తీవ్ర జాప్యం నెలకొనడంతో.. చాలా విమానాల సేవలను రద్దు చేశారు. 

ఈ సమస్యకు బోర్డర్‌ క్రాసింగ్‌ పేరిట ఉండే.. ‘బోర్డర్‌ ఫోర్స్‌ సెక్యూరిటీ డేటాబేస్‌’లో సమస్య కారణంగానే ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవస్థ నిర్మాణం కోసం యూకే దాదాపు 372 మిలియన్‌ డాలర్లను వెచ్చించింది. కొన్ని గంటల తర్వాత అర్ధరాత్రి 2.10 సమయంలో ఈ సమస్యను పరిష్కరించారు. ఇది సైబర్‌ దాడి వల్ల తలెత్తిన పరిస్థితి అధికారులు వెల్లడించారు. 

బ్రిటన్‌లో ఈ బోర్డర్‌ క్రాసింగ్‌ వ్యవస్థ పనిచేయకపోతే.. ఎయిర్‌పోర్టుల్లోని ఈ-గేట్స్‌ తెరుచుకోవు. దీంతో అధికారులు మాన్యూవల్‌గా ప్రయాణికుడి పేరును ఉగ్రవాదుల రికార్డులు, నేషనల్‌ పోలీస్‌ కంప్యూటర్‌, ఇమ్మిగ్రేషన్‌ సమాచారంతో సరి పోల్చుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా హీత్రూ, గాట్విక్‌, స్టాన్‌స్టెడ్‌, బ్రిస్టోల్‌, సౌతాంప్టన్‌, ఎడిన్‌బర్గ్‌, గ్లాస్గో వంటి పెద్ద ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది. 

నాడు తప్పుడు డేటాతో..

గతేడాది ఆగస్టులో కూడా బ్రిటన్‌ విమనాశ్రయంలో సాంకేతిక లోపం తలెత్తి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వ్యవస్థపై ప్రభావం పడటంతో ఎక్కడి ఫ్లైట్లు అక్కడే నిలిచిపోయాయి. అప్పట్లో వేల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రయాణంలో ఉన్న విమానాలను సురక్షితంగా దిగేందుకు ట్రాఫిక్‌ ఫ్లో నిబంధనలను అమలు చేయాల్సి వచ్చింది. నాడు విమానాశ్రయాల్లోని ఆటోమేటిక్‌ విమానాల ప్రణాళిక ప్రభావితమైంది. దీనికి తప్పుడు ఫ్లైట్‌ డేటానే కారణమని గుర్తించారు.  సిస్టమ్స్‌ దానిని అర్థం చేసుకోకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తిందని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ చీఫ్ అప్పట్లో వెల్లడించారు. ఫలితంగా ఆటోమేటిక్ ప్రాసెసింగ్ నిలిచిపోయి మాన్యువల్‌గా డేటాను ఎంటర్ చేయాల్సి రావడంతో తీవ్ర జాప్యం జరిగింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని