కేరళ వాసి మృతి.. ఇజ్రాయెల్‌లో భారతీయులకు ఎంబసీ అడ్వైజరీ

ఇజ్రాయెల్(Israel) సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న భారతీయులను కేంద్రం అప్రమత్తం చేసింది. వారంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. 

Updated : 05 Mar 2024 16:04 IST

దిల్లీ: లెబనాన్ భూభాగం నుంచి చేసిన క్షిపణి దాడిలో ఇజ్రాయెల్‌లో (Israel) కేరళవాసి మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీని జారీ చేసింది. ఆ దేశ సరిహద్దుల్లోని భారతీయులంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.

‘ప్రస్తుతమున్న భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా ఇజ్రాయెల్‌ సరిహద్దు ప్రాంతాల్లో పనిచేసే, పర్యటించే భారతీయులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి. స్థానిక యంత్రాంగాలు జారీ చేస్తున్న అడ్వైజరీలను అనుసరించాలి. దేశ ప్రజల భద్రత నిమిత్తం ఎప్పటికప్పుడు మన ఎంబసీ ఇజ్రాయెల్‌ అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది’ అని ఆ దేశంలోని మన దౌత్య కార్యాలయం వెల్లడించింది.

ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడి.. భారతీయుడి మృతి

ఇదిలాఉంటే.. మృతుడిని కేరళలోని కొల్లామ్‌కు చెందిన పట్నిబిన్ మాక్స్‌వెల్‌గా గుర్తించారు. ఈ దాడిలో గాయపడిన జోసెఫ్‌ జార్జ్‌, పాల్‌ మెల్విన్‌కు చికిత్స అందిస్తున్నారు.  ఈ దాడి హెజ్‌బొల్లా పనేనని అనుమానిస్తున్నారు. హమాస్‌కు మద్దతుగా ఈ గ్రూప్‌ అక్టోబర్‌ 8 నుంచి ఉత్తర ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలపై రాకెట్లు, క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. దీనికి ప్రతీకారంగా హెజ్‌బొల్లా స్థావరాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (IDF) ప్రకటించింది.

బిడ్డను చూడకుండానే..

మ్యాక్స్‌వెల్‌ స్వస్థలం కొల్హాంలోని కైకులంగారా. వ్యవసాయం క్షేత్రంలో పని చేసేందుకు రెండు నెలల క్రితమే ఇజ్రాయెల్‌ వెళ్లారు. ఆయన వివాహితుడు. భార్య ఏడు నెలల గర్భిణి.  ఆ జంటకు ఇప్పటికే ఐదేళ్ల కుమార్తె కూడా ఉంది. ‘మ్యాక్స్‌వెల్‌కు ప్రమాదం జరిగిందని నిన్న సాయంత్రం మా కోడలు ఫోన్‌ చేసి చెప్పింది. అర్ధరాత్రికి మా కుమారుడి మరణవార్త తెలిసింది’ అంటూ మ్యాక్స్‌వెల్ తండ్రి విలపించారు. నాలుగు రోజుల్లో మృతదేహం భారత్‌కు రానున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని