USA vs China: అమెరికా ముంగిట చైనా గూఢచర్యం.. క్యూబాలో డ్రాగన్‌ వేగులు..!

అమెరికాకు అత్యంత సమీపంలో చైనా ఇంటెలిజెన్స్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అమెరికా పత్రికలు కథనాలు వెలువరించాయి. క్యూబా, చైనా సర్కార్లు వీటిపై మండిపడ్డాయి. 

Updated : 11 Jun 2023 14:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గూఢచర్యంపై అమెరికా (USA)- చైనా(China) మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తమ దేశానికి అత్యంత సమీపంలోని క్యూబా(Cuba)లో చైనా గూఢచర్య కార్యాలయాలు నిర్వహిస్తోందని అమెరికా అధికారి ఒకరు బాంబు పేల్చారు. దీని ఆధారంగా అక్కడి పత్రికలు కథనాలు ప్రచురించాయి. 2019లో ట్రంప్‌ హయాంలో మొదలైన కార్యకలాపాలను చైనా మెల్లగా విస్తరిస్తోందని వాటిల్లో పేర్కొన్నాయి. ‘‘2019లో క్యూబాలోని ఇంటెలిజెన్స్‌ సేకరణ వ్యవస్థలను  చైనా అప్‌గ్రేడ్‌ చేసింది. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇవి ఇంటెలిజెన్స్‌ రికార్డు(అమెరికా)ల్లో పక్కాగా ఉన్నాయి’’ అని అమెరికా అధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు సిగ్నల్‌ ఇంటెలిజెన్స్‌ను సేకరించే వ్యవస్థను చైనా నిర్మించేందుకు క్యూబా అంగీకరించింది. దీంతో ఆగ్నేయ అమెరికాలో సిగ్నల్‌ ఇంటెలిజెన్స్‌ సేకరించేందుకు చైనాకు అవకాశం లభించింది. ఈ విషయాన్ని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనంలో కూడా పేర్కొంది. దీంతో బైడెన్‌ సర్కారుపై విమర్శలు చెలరేగే పరిస్థితి నెలకొంది. 

దీనిపై అమెరికా నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ప్రతినిధి జాన్‌ కెర్బీ భిన్నంగా స్పందిస్తూ ఈ నివేదికలు పూర్తిగా కచ్చితమైనవి కావు. ఇవి కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలే. ఇందులో పేర్కొన్న అంశాలు మా వద్ద ఉన్న సమాచారానికి సరిపోవడంలేదు’’ అని పేర్కొన్నారు. చైనా ఇంటెలిజెన్స్‌ సర్వీసులు సముద్ర ట్రాఫిక్‌పై నిఘాపెట్టడం, అమెరికాకు చెందిన గ్వాంటనామో నౌకా స్థావరంలో కదలికలు గమనించడం, కమ్యూనికేషన్లపై దృష్టిపెట్టడం వంటి అంశాలను పరిశీలిస్తోంది.  మరోవైపు క్యూబా డిప్యూటీ ఫారెన్‌ మినిస్టర్‌ కార్లోస్‌ ఫెర్నాండో డి కాసియో కూడా అమెరికా పత్రికల కథనాలను ఖండించారు. ఎటువంటి ఆధారాలు సమర్పించకుండానే అమెరికా పత్రికలు ఇటువంటి కథనాలను వ్యాప్తి చేస్తున్నాయన్నారు. కనీసం నియమాలను కూడా పాటించడంలేదన్నారు. 

మరోవైపు ఈ కథనాలపై చైనా కూడా స్పందించింది. క్యూబా అంతర్గత వ్యహారాల్లో అమెరికా జోక్యంపై హెచ్చరించింది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ స్పందిస్తూ అక్కడి పరిస్థితి తెలియదని తొలుత చెప్పారు. ‘‘వదంతలు, అపవాదులను వ్యాప్తి చేయడం అమెరికా శైలి ఇష్టానుసారంగా పరాయి దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం దానికి పేటెంట్‌’’ అని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు