Dawood Ibrahim: దావూద్‌ ఇబ్రహీం.. అనేకసార్లు ‘చచ్చిన’ మోస్ట్‌వాంటెడ్‌!

కరాచీలో ఉన్న అంతర్జాతీయ ఉగ్రవాది దావూద్‌ చనిపోయాడంటూ తాజాగా మరోసారి వార్తలు వచ్చాయి. ఇటువంటి వార్తలు గతంలో అనేకసార్లు వచ్చాయి.

Published : 20 Dec 2023 02:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ముంబయి బాంబు పేలుళ్ల సూత్రధారి, భారత మోస్ట్‌వాంటెడ్‌ దావూద్‌ ఇబ్రహీం (Dawood Ibrahim) పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ అంతర్జాతీయ ఉగ్రవాది పాకిస్థాన్‌ కరాచీలో ఓ ఆసుపత్రిలో చేరాడని, అతడిపై విషప్రయోగం జరిగిందనేది ఆ కథనాల సారాంశం. వీటిపై అధికారికంగా ఎటువంటి ధ్రువీకరణ లేనప్పటికీ.. దావూద్‌ ముఠా (D-Company) అధినేత గడిచిన కొన్నేళ్లలో అనేకసార్లు చచ్చిపోయినట్లు వార్తలు వచ్చాయి.

అంతర్జాతీయ ఉగ్రవాదిగా..

1993లో జరిగిన ముంబయి వరుస పేలుళ్ల ప్రధాన సూత్రధారి అయిన దావూద్‌ ఇబ్రహీం.. 1980ల్లోనే పాకిస్థాన్‌కు (Pakistan) పారిపోయాడు. అమెరికాతోపాటు, ఐక్యరాజ్యసమితి కూడా అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఐరాస జాబితాలో అతడి చిరునామా కరాచీలో ఉన్నట్లు పేర్కొంది. అయితే, అతడు తమ దేశంలో తలదాచుకున్న విషయాన్ని చెప్పడానికి పాక్‌ వెనకాడుతూనే ఉంది. ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రే లిస్టు నుంచి బయటపడేందుకు గాను తప్పని పరిస్థితుల్లో (2020లో) ఒకసారి మాత్రం అంగీకరించినట్లు సమాచారం. ఉగ్రవాదుల జాబితాలో ఉన్న అతడు కరాచీలో ఉంటున్నట్లు పలు చిరునామాలను పేర్కొన్నప్పటికీ ఆయన అక్కడ లేడని తేలింది.

చనిపోయాడంటూ..

పాకిస్థాన్‌లో ఉన్నట్లు భావిస్తోన్న దావూద్‌ చనిపోయాడనే వార్తలు అనేకసార్లు వినిపించాయి. రక్తంలో ఇన్‌ఫెక్షన్‌తో ఆయన బాధపడుతున్నాడని, దాంతో ఆయన కాలు తీసేయాల్సి వచ్చిందని 2016లో వార్తలు వచ్చాయి. కానీ చివరకు అవి తప్పు అని తేలింది. అనంతరం 2017లో ఆయన చనిపోయాడని సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అయ్యాయి. బ్రెయిన్‌ ట్యూమర్‌ లేదా గుండెపోటుతో మరణించి ఉండొచ్చని పేర్కొన్నాయి. ఆ వార్తలను దావూద్‌ సన్నిహితుడు ఛోటా షకీల్‌ తోసిపుచ్చారు. మరోసారి 2020లో దావూద్‌ కరోనా వైరస్‌ బారినపడ్డాడని.. పరిస్థితి విషమించి చనిపోయాడనే కథనాలు వెలువడ్డాయి. తర్వాత అవి కూడా తప్పుడు కథనాలేనని తెలిసింది. అయితే, కోడలు సిరాజ్‌ కస్కర్‌ కొవిడ్‌తో చనిపోయినట్లు వెల్లడైంది.

అంతర్జాతీయ ఉగ్రవాది దావూద్‌ చనిపోయాడంటూ తాజాగా మరోసారి వార్తలు వచ్చాయి. కరాచీలో ఉన్న అతడిపై విష ప్రయోగం జరిగిందని పేర్కొంటున్నప్పటికీ.. వాటికి ఎటువంటి ధ్రువీకరణ లేదు. దీంతో దావూద్‌ ఇబ్రహీం ఎలా? ఎక్కడ ఉన్నాడనే విషయం ఓ మిస్టరీగానే మిగిలింది. అయితే, దావూద్‌ కరాచీలోనే ఉన్నాడని ఆయన సోదరి హసీనా పార్కర్‌ కుమారుడు అలీషా పార్కర్‌ చెప్పినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఈ ఏడాది జనవరిలో దాఖలు చేసిన అభియోగపత్రంలో పేర్కొంది. దావూద్‌ వ్యవహారంపై పాక్‌ మౌనంగానే ఉంటోంది. ఇలా భారత్‌ మోస్ట్‌వాంటెడ్‌ దావూద్‌ ఇబ్రహీం ఇప్పటికే అనేకసార్లు చచ్చినట్లు వార్తలు వస్తున్నప్పటికీ అతడి సన్నిహితుడు ఛోటా షకీల్‌ మాత్రం.. దావూద్‌ 1000శాతం ఫిట్‌గా ఉన్నాడని చెబుతూనే ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని